Friday, April 25, 2014

మానవ సంబంధాలు

మనిషి అన్నాకా కొన్ని విషయాలు ఒట్టి భావనలోనే కాక అనుభవం లో కూడా ఉంటేనే బాగుంటుంది. ఒక ఉదాహరణ: మనకి దేవుడు ఉన్నాడు అన్న నమ్మకం - ఒక భావన. మనకి జరిగే మంచి చెడులు దాని ద్వారా మనం అనుభవించే ఆనందం, కష్టాలు అవీ అనుభవం. అవే లేకపోతే మనకి దేముడు  అసలు ఉన్నాడా? లేడా? ఉంటె ఏంటి? అసలు లేకపోతే ఏంటి అన్న ఫీలింగ్ వచ్చేయచ్చు.
అలాగే మానవ సంబంధాల్లో కూడా మన మనసులో ఉన్న భావాలని అప్పుడప్పుడు మనం అవతలి వాళ్ళకి మన చేతల ద్వారా తెలియచెయ్యాలి. ఆ ప్రక్రియలో భాగంగానే గట్టిగా కోప్పడ్డం (నేను నీ పట్ల చాల కోపంగా ఉన్నా అన్న భావన తెలియ చెయ్యడానికి), గట్టిగా నవ్వడం (నువ్వు చేసిన పని వల్లనో/ నువ్వు చెప్పిన మాట వల్లనో నాకు చాలా ఆనందం కలిగింది అని తెలియచేస్తూ నవ్వుతాం) అవీ చేస్తుంటాం అని అనుకుంటున్నా. మంచి జోకు చెప్పినప్పుడు నవ్వక పోతే మనలో ఎదో తేడా ఉన్నట్టు లెక్క !!! అలాగే బాగా కోపం వచ్చినప్పుడు దాన్ని బహిర్గతం చెయ్యాలి లేదంటే ఆరోగ్యానికి ప్రమాదం. అలాగే ఒకరి పట్ల ప్రేమ, ఆప్యాయత  ఉంటె వ్యక్త పరచాలి.
ఇక మనుషుల భాందవ్యాలు, చుట్టరికాలు, సాన్నిహిత్యం ఇత్యాది విషయాల్లో మన ప్రవర్తన, మన భావ వ్యక్తీకరణ చాల ప్రముఖ పాత్ర వహిస్తాయి అని అనుకుంటాను. మన కుటుంబ వ్యక్తులు, చుట్టాలు, పక్కాలు, స్నేహితులు ఇలా చాల మంది మన జీవన యానం లో మనతో ప్రయాణిస్తూ ఉంటారు. మనిషి సంఘ జీవి. మనిషికి గుర్తిపు కోరుకుంటాడు. మీరు, మీ ప్రవర్తన నాకు నచ్చితే నేను, నా ప్రవర్తన మీకు నచ్చేలా మార్చుకోవడానికి ప్రయత్నిస్తా – ఎందుకంటే ఎదుటి వాడి మెప్పు పొందడం కోసం ఆ సాన్నిహిత్యం చిరకాలం సాగాలని కోరుకుంటాడు కాబట్టి. అలాగే పెళ్ళయిన భార్యా భర్తలు కూడా. ఇద్దరు ఒకరికి ఒకరు తెలియక పోయినా జేవితాంతం ఒకరికొకరు కలిసి ఉండాలి అన్న విషయం తెలుసు కాబట్టి, చాల విషయాల్లో ఇచ్చిపుచ్చుకుని, కొన్నిటిలో సర్దుకుని పోయి ఉన్నంతలో హాయిగా కాలం గడపడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రయత్నం లో భాగంగానే పుట్టిన రోజులు, పెళ్లి రోజులు ఇలా ఎదో ఒక వంకన ఒకరికి ఒకరు అభినందనలు, మంచి విషయాలు, పొగడ్తలు అవీ ఇచ్చిపుచ్చుకుంటూ ఆ అనుబంధాన్ని ఇంకాస్త గట్టి పరచుకుని ముందుకి సాగుతుంటారు. దీన్నే ప్రేమ భావ వ్యక్తీకరణ అని కూడా అనొచ్చేమో!! పిల్లల్ని కాస్త పొగిడితే హనుమంతుడిలా చాలా ఉబ్బిపోయి ఆ రోజంతా మనకి నచ్చేపనులు చాలా చేసేసి చూపెడతారు.
మొన్న ఒక స్నేహితుడి తో కూర్చుని పిచ్చా పాటి, మాట్లాడుతూ ఉంటె కొన్ని interesting విషయాలు మా మధ్య దొర్లాయి. ఆ బతాఖానిలో కొన్ని మచ్చు తునకలు:
కొంతమంది ‘ప్రత్యెక చుట్టాలు’ ఉంటారు. నలుగురిలో ఉన్నప్పుడు మనగురించి ఆహా! ఓహో! అని పొగిడేస్తూ ఉంటారు. ఆ తర్వాత, అసలు మనం అనే వాళ్ళం అసలు వాళ్ళ లిష్టులో ఉన్నామా అన్న అనుమానం కలుగుతుంది. నెలలు ఏళ్ళు గడిచిన వాళ్ళంతట వాళ్ళు వచ్చి పలకరించిన పాపాన ఉండదు. అలాగే అని ఏదైనా శత్రుత్వం, రాజకీయం ఉందా అంటే అదీ లేదు. మరి దీనికి కారణం? ఏదైనా కావచ్చు, ఉత్తి పుణ్యాన పలకరిస్తే మనకి అనవసరంగా ఏదైనా పని తగిలిస్తారేమో? అన్న భావన కావచ్చు, డబ్బెదైనా సర్దామంటాడేమో అన్న భయం కావచ్చు, “అబ్బా వెధవ గోల, ఈ చుట్టరికాలు!! ఈ లంపటాలు!! అవి నాకు చిరాకు బాబూ” అన్న ఫీలింగ్ కావచ్చు. అసలు అలాంటి వాళ్ళు మనల్ని పలకరిస్తే ఎంత? లేకపోతే? ఎంత అని కూడా మీరు అడగవచ్చు. అదే ఇక్కడ వచ్చిన అసలు గొడవ... వాళ్ళు మనకి చాలా క్లోజ్ ట!! వాళ్ళు మన జీవన ప్రయాణం లో చాల ముఖ్యమైన సహ ప్రయాణీకులు ట,అసలు మనకంటే వేరే ఇంకెవరు ఈ లోకం లో వాళ్లకి లేరుట... ఇలాంటి మాటలు వింటేనే అసలు మానవ సంబంధాల మీద చిర్రెత్తుకుని కోపం వచ్చేస్తుంది. ఇంటి గడప దాక వచ్చి – అయ్యో వచ్చారు అని తెలిసే లోపే వెనక్కి వెళ్ళిపోయే ఈ కోవకు చెందినా పెద్దల తో వేగేది ఎలారా? భగవంతుడా అని !!
మనం మాత్రం భక్తిగా, మనవాళ్ళని చూడడానికి అన్ని పనులు మానుకుని, ఫలం, పత్రం, పుష్పం, తోయం ....ఇత్యాది గౌరవమర్యాదలతో సకుటుంబ సపరివార సమేతంగా వెళ్లి దర్శనం చేసుకుని వారిచ్చిన సత్కారాలు అందుకుని పునీతులు అయ్యి రావాలిట.  అదేమిటి ఒకసారి కూడా మీరు మా ఇంటికి రారే ? కనీసం ఒక ఫోనైనా చెయ్యరే ?అంటే ....”we are very busy you see !!“లేదా ఎదో చాలా రావాలి అని అనుకుంటూ ఉంటాం రొజూ..., అస్సలు వీలు పడటం లేదు, మీరు  మాత్రం రావడం మానకండి  సుమా, ఇది మీ ఇల్లే అనుకోండి” .........ఇలాంటి తీపి మిఠాయి కబుర్లు. ఇలాంటి కబుర్లు కొత్తల్లో బావుంటాయి కాని అస్తమాను బాగోవు.
ప్రేమా, ఆప్యాయతా ఉన్నాయి అంటే చాలదు...అది ఆచరణలో కూడా కనబడాలి అప్పుడే సంబంధాలు గట్టి పునాదుల మీద నిలబడతాయి అని నా నమ్మకం.

మా తాత గారు అంటుండే వారు....” మా ఊరుకి మీ ఊరు ఎంత దూరమో!! మీ ఊరికి మా ఊరూ అంతే దూరం!!” అని. అంటే మేము చేసిన దానికి, చేస్తున్న దానికి మీ నుంచి మంచి స్పందన లేకపోతే మానుంచి కూడా మీ పట్ల అంతే మోతాదులో మా స్పందన ఉంటుంది అని గ్రహించ గలరు అని ఆ మాటకి అర్ధం.

2 comments:

  1. True many times.People confuse others with their words and expressions.maybe it is being nice or trying to escape confrontation when in a group.

    ReplyDelete
  2. It is "acting nice" అని నా ఉద్దేశం

    ReplyDelete