Sunday, June 17, 2012

బాల్యం ఖాతాలోంచి ఒక చెక్కు రాసి


బాల్యం  ఖాతాలోంచి ఒక చెక్కు రాసి

మనసు బరువెక్కి..
గుండె కింద తడి , సవ్వడి చేసినప్పుడు.
పరిస్థితుల పద్మవ్యూహం లో చిక్కి..
దారి తెన్నూ కాన రాక , పరి పరి విధాల పరితాపం సుళ్ళు తిరుగుతుంటే...లోలోపల రగిలే  బడబాగ్నికి  పడే పడే రాలే చుక్కల నిట్టూర్పుల నుంచి తప్పుకుని  మదికి  చలచల్లని  అంజనాన్ని  అద్దడానికి  ఓ  చిట్కా కనిపెట్టా ....

రెక్కలు విప్పుకుని బంగారు బాల్యం లోకి  అందమైన  పద్యాల్లాంటి  నేపధ్యం లోకి జారిపోయి, కళ్ళ ముందున్న పరిస్థితుల  ముందు అందాకా...చిన్నతనపు పచ్చ పచ్చని వెల్వెట్ తెరల్ని దించుతా............
ఏటి ఒడ్డున తీసిన పరుగుల బుల్లి పాదాల ముద్రలు. నీళ్ళ గుండెల్ని చీలుస్తూ కాల్వలో కొట్టిన ఈతలు, తోటల్లో చాటు మాటున కోసిన ..మామిడి పిందెల ఉప్పు కారం  అద్దకంతో నాలుక తిరిగిన సుళ్ళు . బెంచీ ఎక్కమంటూ అయ్యవారు గద్దిస్తే, జెండా కర్రలా  ధీమాగా నిలబడ్డాం ...భయం లేదు, బెంగా లేదు..రేపు ఏమవుతుందో అనే బాధ లేదు ..చీకులేవో ? చింతలేవో?  తెలవని తనం.

బేంక్ లో నిలవ ఉన్న డబ్బు లా చిన్న నాటి  జ్ఞాపకాలు !!!!

కళ్ళముందు ఆనందం కరిగిపోయినప్పుడల్లా .. ఓ చెక్కు రాసి  బాల్యం ఖాతా లోంచి ..తీయనైన  జ్ఞాపకాలు సొమ్ము చేసుకుని వెల్లివిరిసిన ఉత్సాహం తో ..నిరాశను తరిమి కొట్టి..పరిస్థితులను ఎదుర్కొంటా ...................శ్రీ కోడిమెల  శ్రీరామమూర్తి (neనేను సేకరించినది)

Friday, June 15, 2012

ఎవరికీ చెప్పద్దు


మా మేన మామ గారి అబ్బాయి, పేరెందుకు లెండి ఇప్పుడు. వాడి చిన్నప్పుడు చాలా అమాయకంగా బాగా ముద్దోస్తూ ఉండేవాడు. నేను చెప్పే ఈ విషయం అప్పుడు - వాడికి బహుశా ఒక అయిదారేళ్ళుప్పుడు అవ్వచ్చు.

మేమందరం తిరపతి వెళ్ళాము - శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి. అప్పుడు మా అందరితో పాటు వాడికి కూడా గుండు కొట్టిద్దాము అని సర్వ జనులు తీర్మానించేశారు. అప్పటి మా లో (అంటే నాకు, వాడి నాన్నకి) కొందరికి గుండు కొట్టే కార్యక్రమం పూర్తయ్యింది. అంతే వాడు మమ్మల్ని చూసి ఝడుసుకున్నాడు. 'అయ్యబాబోయ్ గుండు అంటే ఇలా ఉంటుందా అని'. వెంటనే వాడు తన ఒప్పందాన్ని రద్దు చేసేసాడు. "నేను గుండు చేయించుకోను అంతే!". మేమందరం  "అదేంటి ఉన్నట్టుండి ఇలా మాట మార్చేస్తే ఎలా? తప్పు కదా? పాపం వస్తుంది అదీ అని కోప్పడేసాము". అప్పుడు వాడు నెమ్మదిగా చెప్పాడు, గుడు చేయించుకుంటే బాగోదు,స్కూల్లో అందరు వాడిని చూసి నవ్వుతారు అని, వాడి క్లాసులో అమ్మాయిలు కూడా ఉన్నారు లెండి.

చివరికి నేను వాడికి ఒక సలహా ఇచ్చాను. "సరే ఒరేయ్,అమ్మా వాళ్ళు చెప్పినట్టు నా మాట విని గుండుచేయించుకో, పుణ్యం వస్తుంది, దేముడు మెచ్చుకుంటాడు కూడా. ఇంక స్కూల్లో సంగతి అంటావా? నువ్వు గుండు చేయిన్చుకున్నట్టు ఎవరికీ చెప్పకు అంతే!! ఇంక ఎలా తెలుస్తుంది? ఓకే నా?"

కాస్సేపు బాగా ఆలోచించాడు, నా మాట బాగానే అనిపించింది వాడికి , " సరే అలా అయితే గుండు చేయించుకుంటా కాని మీరు కూడా ఎవరితో చెప్పకూడదు" అని అందరికి ఒక షరతు పెట్టాడు. వచ్చే నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ అందరం వోప్పేసుకున్నాం.

తర్వాత క్షవర కళ్యాణం విజయవంతంగా పూర్తయ్యింది వాడికి.

కుర్రాడు ఇప్పుడు అమెరికా పౌరుడు.

Friday, June 1, 2012

నా చిన్ననాటి - జ్ఞాపకాలు


గడిచిన చిన్నతనం ఎంత హాయిగా ఉండేదో? నా చిన్న తనం మా మాతా మహుల ఇంట్లో – రాజమండ్రి లో   గడపడం జరిగింది. అప్పుడు అది ఒక ఉమ్మడి కుటుంబం. మా అమ్మమ్మ గారు, తాత గారూ, తాతగారి చెల్లెలు ఒక ఏభై ఏళ్ళ ఆవిడ (విధవరాలు), మా ఇద్దరు మేన మామలు, తర్వాత వచ్చిన వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, మా అమ్మగారి చెల్లెలు, పిన్ని గారు, నేను, నా తమ్ముళ్ళు కలిపి మేము ముగ్గురం (మా తల్లి తండ్రులు ఉద్యోగ రీత్యా వేరే వూళ్ళో ఉండేవారు),

ఈ రోజుల్లో పిల్లల్లా కాదులెండి, పొద్దున్నే తెల్లవారుఝామునే లేవడం ...మా బామ్మ గారికి అవసరం పాపం చాలా ఇష్టం అని దేముడి పూజ కోసం పారిజాతం పువ్వులు ఏరి తెచ్చేవాళ్ళం. అంటే ఉండడానికి పారిజాతం చెట్టు మా ఇంట్లోనే ఉండేది, కాని దాని పువ్వులు అన్ని మా ఇంటి గోడ బయటికే పడేవి. అందుకని అన్ని పూలు వాళ్ళు వీళ్ళు తీసుకుపోయేవారు. వాళ్ళు రాకముందే మేము లేచి పొద్దున్నే పువ్వులు ఎరుకోనేయ్యాలి అదీ ప్రాజెక్టు. అలా ప్రతీ రోజు కసితో అత్యుత్సాహంతో లేచే వాళ్ళం. అప్పుడు సమయం తెల్లార గట్ల సుమారుగా నాలుగు నాలుగున్నర. పారిజాతం పువ్వులు, నందివర్ధనం పువ్వులు, మందార పువ్వులు, అన్ని వీధులు తిరిగే వాళ్ళం పువ్వుల కోసం ఎక్కడ దొరికితే అక్కడ కోసేవాళ్ళం.
అలా పువ్వుల పని అవ్వగానే, సైకిల్ వేసుకుని పాల సీసాలు తేవడానికి వెళ్ళే వాళ్ళం. అప్పుడు పాలు గాజు సీసాల్లో వచ్చేవి దాని మీద నాజూకుగా ఉండే ముచ్చిరేకు మూత అతికించి ఉండేది. అ రోజుల్లో పాల సీసాలు చాలా short supply లో ఉండేవి. ఒక్క సీసా కూడా ఎక్కువ దొరికేది కాదు, కార్డుకి ఎన్ని ఉంటె అన్నే వచ్చేవి. డానికి కూడా పెద్ద పెద్ద క్యూ లు . మా ఇంట్లో ప్రతీ రోజూ ఏదో ఒక శుభ కార్యం, పూజ, చుట్టాలు ఏదో ఒక గొడవ. ప్రతీ రోజు ఎన్నో కొన్ని ఎక్కువ కావాల్సి వచ్చేవి. దానికోసం మళ్లి నగర యాత్ర సైకిల్ మీద, ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరు ఎవర్నో పరిచయం చేసుకుని, మాటలు కలిపి, చుట్టరికాలు అల్లి, ఎలాగోలా ఎగష్ట్రా సీసాలు సంపాదించే వాడిని. ఖాళి చేతులతో ఇంటికి ఏనాడు వెనక్కి వచ్చిన పరిస్థితి లేదు.. రావుగాడికి పని ఇస్తే చేసుకునే వస్తాడు అని ఒక నమ్మకం జనం లో.
అప్పటికి సమయం పొద్దున్న అయిదున్నర ఆరు. మా ఇంటిపక్కనే, హిందూ సమాజం అని కీర్తి శేషులు శ్రీ న్యాపతి సుబ్బారావు పంతులు గారు కట్టించిన ఒక క్లబ్బు ఉండేది. మా ఇంటి గోడ హిందూ సమాజం గోడ ఒకటే అంత పక్క పక్కనే ఉండేవి. అందులో మేము మా తాతగారి ప్రోద్బలంతో Shuttle Badminton court తయారు చేసాము. ఆరు ఘంటలకల్లా...షటిల్ ఆడదానికి మా వాళ్ళంతా  రెడి గా వచ్చేసే వారు.మా తాతగారు ఆ వయస్సులో కూడా (అప్పటికే ఆయన వయస్సు ఒక అరవై ఏళ్ళ దరిదాపుల్లో ఉండేది) చాలా ఉత్సాహంగా మా కంటే దృడంగా ఉండేవారు. మేము ఎప్పుడైనా కాస్త బద్దకించేవాళ్ళం ఏమో కాని, ఆయన మాత్రం ప్రతీ రోజు మా కంటే ముందే రెడి. ఉదయం ఆరు నించి ఎనిమిది దాకా షటిల్ ఆడేవాళ్ళం. చెమటతో తడిసి ముద్దై పోయి ఇంటికి వెళ్ళి ఆవురావురుమని ఏదోకటి తినేసే వాళ్ళం. ఒక్కోసారి చద్ది అన్నం, ఒక్కోసారి వేసంగుల్లో తరవాణి అన్నం, మామూలు టిఫిన్లు అలా Five star బ్రతుకులా  ఉండేది.
తిండి అవ్వగానే స్కూలుకి/ కాలేజికి పోవడం, హాయిగా నడుచుకుంటూ/ సైకిల్ తొక్కుకుంటూ రోడ్దమ్మట అటూ ఇటూ సినిమా పోష్టర్లు చూసుకుంటూ ఆడుతూ పాడుతూ స్కూలుకి చేరేవాళ్ళం. సాయంత్రం మళ్లి అయిడుకల్లా...ఫ్రెండ్స్ తో పడి రోడ్లమ్మట పోవడం. ఒక్కోసారి క్రికెట్, ఒక్కోసారి కబడ్డీ, ఒక్కోసారి క్రికెట్ పోటీ మ్యాచ్ లు. మా ఇంటినించి ధవళేశ్వరం కాటన్ స్కూల్ దాకా సైకిల్ తొక్కుకుంటూ పోయే వాళ్ళం క్రికెట్ మ్యాచ్ లకి. ఎండా  లేదు వానా  లేదు అసలు అవి ఉండేవి అన్న స్పృహ కూడా ఉండేది కాదు. రాత్రి ఎనిమిది లోపు ఇంటికి రావడం ఏదో చదువు అయ్యిందనిపించడం, పడుకోడం.
మళ్లి తెల్లారి అదే దినచర్య షురూ. మధ్యలో వచ్చిన ప్రతీ సినిమా చూసేయ్యడం, యే పండగ వచ్చినా వెళ్ళి బట్టలు కొనుక్కోడం, మా ముత్యాలరావు (Elite Tailors) నెత్తి మీద కూర్చుని ఒక్క రోజులో కుట్టించేసుకోడం – వేసేసుకోడం. పండగ అంటే అదీ ఇదీ అని లేదు బాగోదు అని వదిలేసే వాళ్ళం కాని Christmas కి Bakrid కి కూడా కుట్టించేద్దును. అదంతా మా తాతగారి గారం. ఏనాడూ అడిగినది కాదనలేదు ఆయన, నేను మా పిల్లలకి ఇవాళ ఆ జీవితం ఇవ్వలేకపోతున్నా. (వాళ్లకి ఆ జీవితం విలువ తెలియదు కూడా),

శ్రీ బాలా త్రిపురసుందరి సమేత విశ్వేశ్వర స్వామీ దేవాలయం, రాజమండ్రి

ఒక్కోసారి మా బామ్మ గారితో పాటు పొద్దున్నే గోదారి స్నానంకి వెళ్ళే వాళ్ళం. అక్కడినించి శివాలయంకి వెళ్ళడం, అక్కడ మా కుటుంబ బ్రహ్మ గారు శ్రీ మాచనవఝుల సూర్యనారాయణ మూర్తిగారిని కలవడం, ఆశీర్వాదం, దక్షిణ ఇత్యాది కార్యక్రమాలు, అక్కడినించి అప్పుడప్పుడు సంతాన వేణుగోపాల స్వామి ఆలయానికి కూడా వెళ్ళేవాడిని. బహుశా ఎంతో మందికి తెలిసి ఉండకపోవచ్చు. రాజమండ్రి నగరానికి క్షేత్రపాలకుడు - శ్రీ వేణుగోపాలస్వామి, ఆయన గుడి కంభం వారి సత్రం, గుండువారి వీధి దగ్గిర ఎక్కడో ఒక సందులో ఉంది. 
క్షేత్ర పాలక - శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి దేవస్థానం 

అలాగే గోదారి గట్టున  ఉన్న మార్కండేయ స్వామీ గుడి కి కూడా వెళ్ళే వాళ్ళం బామ్మ గారితో. మర్కండేయస్వామి గుడిపక్కన, కాకి వారి భవనం ఉంది అందులో అప్పుడప్పుడు పురాణ కాలక్షేపం అయ్యేది, అప్పుడు మా బామ్మ గారితో అక్కడికి కూడా వెళ్ళే వాడిని. మా బామ్మగారి వల్ల నాకు అన్ని పురాణాలు, కధలు, ఇతిహాసాలు తెలిసాయి. [మా పిల్లలకి ఏవి తెలియదు, చెపుదాం అన్నా...వినీ తెలుసుకునే ఓపిక వాళ్ళకి లేదు. పోనీ చూపిద్దాం అని ఏదైనా ఒక పాత పౌరాణికం  సినిమా వస్తుంటే చూడమన్నా వాళ్ళకి నచ్చటం లేదు.] It’s damn boring you see!!!
నా చిన్న నాటి నా స్నేహితులు, అందులో చాల మటుక్కు నా తమ్ముళ్ళ ఫ్రెండ్సే నా ఫ్రెండ్స్ ....K L, ఉండవిల్లి, పరమాత్మా, పారుపూడి, హనుమంతు, మా ఇంట్లో ఉన్న పాల సపోట చెట్టు ఎక్కడం, ఆకుపచ్చ సంపంగి చెట్టు నించి పువ్వులు కొయ్యడం, విజయనగరం ఎర్ర సంపంగి చేట్టునించి ఆ పువ్వులు కొయ్యడం, మ పిన్ని గారికి ఆవిడ స్నేహితురాళ్ళకి ఇవ్వడం ఒక దిన చర్య లా ఉండేది. మా పిన్ని గారికి కనకాంబరాలు, సన్న జాజులు  చాలా ఇష్టం.
మిరపకాయ బజ్జీలు 

రాజమండ్రి లో బాగా పాపులర్ అయిన మిరపకాయి బజ్జీలు ప్రతి - రోజు విడిచి రోజు సాయంత్రం తెచ్చేవాడిని మా అత్తయ్యలకి, మా పిన్నిగారికి. విజయ టాకీస్ సెంటర్ లో ఉండేవి బళ్ళు, మిరపకాయి బజ్జిని మధ్యకి కోసి, దానిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు ఉప్పు-కారం, కాస్త నిమ్మ కాయ రసం పిండి ఇచ్చేవాడు. తినేటప్పుడు ఏమి తెలిసేది కాదు హాయిగా తినేసే వాళ్ళం, అప్పుడప్పుడు తర్వాత వచ్చేది ఇబ్బంది.

శాంతినివాస్ హోటల్ లో పెసరట్టు ఉప్మా...ఆ రోజుల్లో రాజమండ్రి కి ఒక Trade Mark. అప్సర హోటల్ లో టిఫిన్ అంటే ఏదో ఒక స్టార్ హోటల్ కి వెళ్ళినట్టే. తర్వాత గోదారి గట్టు దగ్గిర పంచవటి హోటల్ వచ్చింది కొన్నేళ్ళకి, ఆ తర్వాత మహాలక్ష్మి హోటల్ వచ్చింది. మా పెద్ద మేనమామగారికి ఒక అలవాటు ఉండేది మమ్మల్ని అందర్ని (ముగ్గురు తమ్ముళ్ళని) ప్రతి శనివారం హోటల్ కి తీసుకువెళ్ళేవారు టిఫిన్ కి. ఆయన పెళ్ళయ్యాకా కూడా అది కంటిన్యు చేసారు ఆ రోజుల్లో అదీ గొప్పతనం. అంటే చాల మందికి  భార్యా పిల్లలు రాగానే వాళ్ళ వాళ్ళ Priorities మారిపోతాయి, కాని మా దిన చర్యలో పెద్దగా మార్పు రాలేదు.
రంభ, ఊర్వశి, మేనక - ధియేటర్ రాజమండ్రి 

ఆ రోజుల్లో రాజమండ్రి లో కట్టిన కొత్త సినిమా ధియేటర్ లు మొదట ఊర్వశి....తర్వాత వచ్చిన మేనక... ఆ తర్వాత వచ్చినా రంభ..యే సినిమా వచ్చినా సరే ముందు మేము అక్కడ ఉండాల్సిందే. ఎన్నో contacts, ఎన్నో influence లు ఎన్నో కష్టాలు ఏది ఏమైనా మొదటి రోజు సినిమా చూసేయ్యడమే. అది ఈ నాటికి అలాగే కొనసాగుతున్నది (చిన్న పిల్లలు నన్ను చూసి నవ్వుకోవచ్చేమో కూడా)

ఎందుకో ఒక్కసారి నా ఊరు నా జ్ఞాపకాలు అలా గుర్తుకు వచ్చి మనసుని కమ్మేసాయి.
మళ్లి ఇంకో సారి ఇంకొన్ని  కబుర్లు చెబుతాను.....తవ్విన కొద్ది ఊరే జ్ఞాపకాలు నా చిన్నతనంలో.