Friday, December 21, 2012

సారోచ్చారు (రవితేజ) సినిమా రివ్యూ


సారోచ్చారు – ‘రవితేజ మార్కు’ సినిమా అనుకుని వెళ్ళాను.

దర్శకుడు పరశురాం కి సినిమా చాలా కొత్తగా ఎదేదోలా ఎలాగో తీసేద్దాం అని చాలా అనిపించి ఉంటుంది......కాని పాపం అస్సలు చెప్పదలుచుకున్నది సరిగ్గా చెప్పలేకపోయాడు. చాలా పేలవమైన డైలాగు లు సినిమాకి పెద్ద మైనస్ మార్కు. మామూలుగా జనం రవితేజ సినిమా అంటే ఎదో కాస్త loud comedy ఉంటుందనుకుంటారు. ఇందులో కాస్త కూడా కామెడి లేదు. ఎదో ఒక అయిదు నిమిషాలు మొహమాటంగా ఎమ్మెస్ నారాయణతో కామెడి చేయిద్దాం అని ప్రయత్నించారు (నాకైతే అది కూడా విసుగొచ్చింది)
రవితెజ మొహం లో బాగా వయసు కనబడుతోంది. మొహం మీద బాగా మేకప్ వేసినా ముడతలు కనబడుతున్నాయి. అతని నటనలో ఆ స్పార్క్ కనబడలేదు. కాజల్ మామూలుగా ఉంది. ఒక్కో చోట కాస్త ఓవర్ గా చేసిందా అనిపించింది (అరవ సినిమాలు ఎక్కువయ్యాయి అమ్మాయికి). అంత కంటే ఆమె గురించి పెద్దగా చెప్పుకోడానికి ఏమి లేదు. రిచాగంగోపాధ్యాయ్ అసలు ఆ పాత్ర ఏమిటో - ఎందుకో నాకు అర్ధం కాలేదు.
ఇంక కధలోకి వస్తే....యూరప్ లో ఎదో కాలేజిలో చదువుకుంటున్న కాజల్ ఇండియాకి వచ్చే ముందు అనుకోకుండా రవితేజని కలుస్తుంది. అతను అక్కడ ఏమి చేస్తుంటాడో మనకు కధా పరంగా అస్సలు తెలియదు. ఊరికే అక్కడ ఉంటాడు అంతే! ఆ అమ్మాయికి తన మీద తనకి చాలా నమ్మకం, అందగత్తెని అని కూసింత గర్వం. సినిమా అంతా రవితేజా కాజల్ రోడ్డు మీద కార్లో, లేదా విమానం లో, మధ్యలో కాస్సేపు airport లో మళ్ళి కార్లో రోడ్డు మీద..........ఇలా వెళుతూ రవితేజ పాత కధని వింటూ ఉంటారు (అదే రిచా తో రవితేజ వ్యవహారం). అంతా అయ్యాకా అయ్యో అతనికి పెళ్లి అయిపొయింది అని బాధపడుతున్న కాజల్ కి రవితేజ “అబ్బే నేను ఇన్నాళ్ళు చెప్పింది అంతా కల్పితం అసలు అలాంటి అమ్మాయే లేదు, ఒకళ్ళని ఒకళ్ళు ఎలా అర్ధం చేసుకోవాలో చెప్పడానికే ఈ కల్పిత కధ చెప్పాను” అంటాడు. అంతే కాజల్ కి కోపం వస్తుంది...ఛీ నువ్వు మోసగాడివి నిన్ను నమ్మకూడదు అదీ ఇదీ అని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ కాజల్ వాళ్ళ అమ్మ (జయసుధ – గెష్టు రోల్) కాజల్ బావతో పెళ్లి కుదురుస్తుంది. బావ ఎవరో కాదు మన చంద్ర బాబు నాయుడి తమ్ముడి కొడుకు నారా రోహిత్ . అదీ ఒక గెష్టు పాత్రే! మరి అతనికి ఏమి మొహమాటాలో లేదా ఖర్మ కాలిందో అలా గెష్టు రోల్ వేసుకోవాల్సి వచ్చింది. తర్వాత మామూలే తాంబూలాలప్పుడు రోహిత్ కాజల్ ని ఆపేసి చిన్న స్పీచి పీకి ఆ అమ్మాయిని వెళ్లి రవితేజాని పెళ్లి చేసుకో అంటాడు..............అప్పుడు శుభం కార్డు ముంది titles తో వస్తుంది పాట “రచ్చ రంభోల”.
దేవిశ్రీ సంగీతం ఆహ్లాదంగా ఉంది. “మిరపకాయిలాంటి పిల్లడంటా – made ఫర్ each other “ అన్నపాట చాలా క్యాచీగా ఉంది. అందులో స్టెప్పులు చాలా కొత్తగా స్మూత్ గా ఉన్నాయి. నాకు చాలా చాలా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది చిత్రీకరణ.
సాధ్యమైనంతవరకు చూడకుండా ఉండటానికి ప్రయత్నించండి వీలైతే. మరీ తప్పక మొహమాటానికి వెళితే ఖచ్చితంగా first half లో నాలా ఒక పావు గంట  చిన్న కునుకు తీసేస్తారు.
   

Thursday, November 29, 2012

దూరపు కొండలు.......


సాఫీగా సాగిపోతున్న జీవితం. పొద్దున్న్నే లేవగానే శ్రీమతి తెచ్చి ఇచ్చే కాఫీ , గుమ్మంలో ఆరవ్వకుండా వచ్చే దిన  పత్రిక (అది ఉన్న ఊరుని బట్టి “ఈనాడు”, లేదా  “మైసూరు మిత్ర” లేదా  “దైనిక్ భాస్కర్” మరియు Indian Express). హాయిగా వీధి వరండాలో కూర్చుని నీరెండ మొహం మీద పడుతుండగా ఇంటిపట్టున కాఫీ తాగుతూ, పేపర్ చదివి, స్నానం చేసి బేంక్ కి వెళ్ళడం. అక్కడ “మన వాళ్ళ మధ్య” పిచ్చా పాటి మాట్లాడుకుంటూ రోజంతా ఆనందంగా పని చేసుకోడం. సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకోడం. కాస్సేపు సేద తీరాకా హీరో హోండా బైక్ మీద ఇద్దరు పిల్లలు భార్యా అందరం అలా ఒక లాంగ్ డ్రైవ్.........తర్వాత కారు కొనుక్కున్నకా కార్ లో లాంగ్ డ్రైవ్. దారిలో కారులో మనసుకి నచ్చిన పాటలు వింటూ.......పిల్లలు “నేను ముందు సీట్లో కూర్చుంటా అంటే నేను ముందు సీట్లో “ అని దేబ్బలాడుకుని చివరికి ఎవరో ఒకరు వాళ్ళ ఒప్పందం ప్రకారం వచ్చి కూర్చోడం, ఎప్పుడైనా నెలకోసారి రాత్రి హోటల్లో భోజనం, మిఠాయి కిళ్ళీలు...తిరిగి ..ఇంటికి కాస్సేపు TV చూడడం, వచ్చిపడుకోడం. ఎక్కడా జీవిత గమనం లో ఒక్క సెంటి మీటర్ కూడా తేడా  వచ్చేది కాదు.
మైసూర్ బాంక్ - బళ్ళారి (1988)
పేరుకి పెద్ద బేంక్ ఆఫీసర్ ఉద్యోగం (ప్రభుత్వ బేంక్ లో ఉద్యోగం) కాని జీతాలు మాత్రం పెద్దగా ఉండేవికాదు. మాకు ‘వేరే విధంగా” జీవితాన్ని మెరుగుపరుచుకునే టెక్నిక్కులు తెలియవు, అలవాటు/ ఇష్టం  లేదు. పర్యవసానం నెలాఖరులో ఒక వెయ్య రూపాయిలు అప్పు...బ్రాటోవరు. పొరబాటున ఏదైనా కాస్త కూడబెట్టానేమో అని అనుమానం వచ్చేలోపు ట్రాన్సఫర్ ..గోదారి ఈత లంక మేతలా....ఇల్లు షిఫ్టింగ్  లో అంతా హారతిలా ఖర్చు అయిపోయేది. చేతిలో పెద్దగా డబ్బు లేకపోవడం వల్ల  బంధువుల్లో చుట్టాల్లో నాతో, వాళ్లకి కాస్త ఇబ్బందిగా ఉండేది కాని నాకు మిత్రులతో ఎప్పుడూ ఒక రకంగానే ఉండేది. నన్ను నా సాహచర్యాన్ని మిత్రులు బాగా కోరుకునేవారు. స్నేహం లో డబ్బు ఏనాడు ఒక అడ్డుగోడ కాలేదు.
కాకినాడలో పనిచేసిన కాలం ఒక్క రెండేళ్ళు మాత్రమే. 1998, అప్పటికి నాకు ఇల్లు లేదు, కొంటానన్న ఆశ ఈషన్మాత్రం కూడా లేదు. బేంక్ ఎదో కొంత అప్పు ఇచ్చినా మన దగ్గిర ఒక్క ఫదివేలైనా ఉండాలిగా?  అదీ లేదు. నా సహచరులు అంతా కలిసి ప్రోత్సాహించి నన్ను ఇల్లు కట్టడం అనే ప్రాజెక్టు లోకి తోసారు. ఒక కాంట్రాక్టర్ – YV Dasu ని పరిచయం చేసారు. నాకు ఆయన దేముడు పంపిన దూత తో సమానం. అన్ని విషయాలు ఆయనే చూసుకున్నాడు, నా దగ్గిర చిల్లి గవ్వ లేని కారణాన, ఇంటి స్థలానికి ముందు ఇచ్చే టోకెన్ ఎడ్వాన్స్ కూడా ఆయనే ఇచ్చాడు. ఆ దాసు గారు మా బేంక్ కష్టమర్ కూడా కాదు – Quid pro Quo ఒప్పందం లేదు. అప్పటి బేంక్ రూలు ప్రకారం ముందు కట్టడం లో ఒక భాగం కట్టాకా, తర్వాత బేంక్ డబ్బు రిలీస్ చేస్తారు, దానికి దాసు గారే పెట్టుబడి పెట్టేవారు, బిల్లు పాస్ అవ్వడానికి రెండు నెలలు పట్టేది.....పాపం ఆయన ఓపికగా ఆగే వారు కూడా నాకోసం. అతకు ముందు జీవితం లో ఎప్పుడు ఆయనని కలవలేదు, అయినా  సరే ఎందుకనో ఆయనకి నేనంటే చాల గౌరవం ఉండేది. “మేనేజర్ గారు, మేనేజర్ గారు” అని మాత్రమే సంబోధించేవారు. అలా నన్ను ఒక ఇంటివాడిని చేసారు దాసు గారు. దేముడు ఆయనకి రావడానికి తీరిక లేనప్పుడు సాయం చెయ్యడానికి వేరే వాళ్ళని పంపిస్తాడని అంటారు, అలాగే ఆయన దాసు గారిని నా దగ్గిరకి పంపి ఉంటారని నేను ఇప్పటికి నమ్ముతాను. ఇప్పుడు దాసుగారు  అక్కడే కాకినాడలో ఒక పెద్ద రాజకీయ వేత్త. రేపో మాపో కాబోయే ఒక ఎమ్మెల్లే.
తర్వాత ఈ డబ్బులేని బ్రతుకు ఏమిటి చ్చా అస్సలు బాగోలేదు అని..... శత విధాల ప్రయత్నించి చివరకు ఎలాగో అలా ఒక ప్రైవేట్ బేంక్ లో ఢిల్లీ లో చేరాను. అప్పటికి నా మాత్రు సంస్థ అయిన ఆ ప్రభుత్వ బేంక్ లో నా సర్వీసు 13 ఏళ్ళు పూర్తయింది. అందరు వెళ్ళద్దు అని బ్రతిమిలాడారు, నచ్చచెప్పారు చాలా మంచి భవిష్యత్తు ఉంది నీకు ఇక్కడ నీకు ఆల్రెడీ మంచిపేరు ఉంది, భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉంటుంది అని చెప్పి చూసారు. మా డిప్యూటి జనరల్  మేనేజర్ వాసుదేవన్ గారు కూడా వద్దన్నారు. కాని మనకి అప్పటికే తల మీద bhoot sawaar hai. లేదు “దేశానికి నాలాంటి మేధావి అవసరం చాల అవసరం” నాకు ఇక్కడ తగిన గుర్తింపు లభించడం లేదు (అంటే డబ్బు చాలట్లేదు అని చదువుకో ప్రార్ధన), అని ఉన్న ఉద్యోగం వదిలేసి కొత్త తీరాలకి వెళ్ళిపోయా ఢిల్లీ కి. ఇంటిలో ఉండే స్విమ్మింగ్ పూల్ నించి ఒక్కసారి పసిఫిక్ మహాసముద్రం లో పడ్డ ఫీలింగ్. స్విమ్మింగ్ పూల్ (ప్రభుత్వ బేంక్ లో) ఉన్నప్పుడు ఈత రాక పోయినా చుట్టూ బాగా సపోర్ట్ ఉండేది (సహచరుల రూపంలో), ఇక్కడ పసిఫిక్ సముద్రం మధ్యలో ఈత రాదు, చుట్టూ తిమింగలాలు. అదను చూసి వేటు వేస్తాయి. నాకు ఊపిరి ఆడేది కాదు, రెండేళ్ళు ప్రత్యక్షనరకం అనుభవించాను అక్కడ. ఇంకొన్నాళ్ళు అక్కడే ఉండి ఉంటె ఇప్పుడు ఇలా బ్లాగ్ రాయడానికి ఉండేవాడినే కాదు. అన్ని రాజకీయాలు, అన్ని కుతంత్రాలు, అన్ని కుత్సితాలు అంత దగ్గరగా నేను పుట్టాక ఎప్పుడు చూడలేదు. అప్పుడు మొదటిసారి అనిపించింది – “డబ్బే అన్నిటికి ప్రధానం కాదు” అని. కాని అప్పటికే చాల అలిస్యం అయిపొయింది. వెనక్కి వెళ్ళే దారులు అన్ని మూసుకుపోయాయి. భయపడితే సముద్రం లో మునగడం తప్పదు. ముందుకు వెళ్ళడం తప్ప వేరే దారి లేదు.
భగవంతుణ్ణి నమ్ముకుని ప్రయత్నాలు మొదలుపెట్టి ఇంకో బేంక్ లోకి మారిపోయాను. మొదటి సారి ఉద్యోగం మారినప్పుడు ఉన్న బెంగ బాధ ఇప్పుడు లేవు. బహుశా దేనికైనా మొదటి సారి విడాకులు ఇవ్వడం కష్టం గా అనిపిస్తుందేమో? తర్వాత తర్వాత అది అలవాటైపోతుంది కామోసు.
ఈ కొత్త ఉద్యోగం చాలా బావుండేది. పనికి తగ్గ గుర్తింపు గౌరవం మర్యాద అన్ని ఉండేవి. మళ్ళి పాతరోజుల్లా జీవితం పట్టాల మీదకి వచ్చేసినట్టు అనిపించింది. జీతం కూడా పర్వాలేదు బాగానే ఉండేది. అవసరాలు తీరిపోయేవి, గడిచిపోయేవి. నాలుగేళ్ళు హాయిగా...జాలీ గా గడిచిపోయాయి. అన్ని అలా  ఆనందంగా సాగిపోతే ఎలా........? ఇంక పైవాడి ప్రత్యేకత ఏమిటి? ఉన్నట్టుండి ఒక ఏడాది నా performance average స్థాయికి పడిపోయింది. సంవత్సర చివరి మీటింగ్ లో మా బాసు (ఒక పంజాబీ ఆయన) నలుగురిలో చాలా చిన్నబరిచేలా, కించపరిచేలా మాట్లాడారు. “మొగుడు కొట్టినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకు కోపం వచ్చింది” అన్న సామెతలా... ఆయన నన్ను తిట్టడమే కాకుండా నాకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాడికి నాకంటే మంచి రేటింగ్, గ్రేడ్ ఇచ్చారు. అది చాల బాధ కలిగించింది......మళ్ళి షరా మామూలే...మెదడులో bhoot sawar hua. ప్రయత్నాలు, అవి ఫలించి గల్ఫ్ లో ఒక బేంక్ లో నాకు ఉద్యోగం వచ్చింది. “జీతం లక్షల్లో ట. ఒక్క రెండు మూడేళ్ళు ముక్కు మూసేసుకుంటే లక్షలు లేదా కోట్లు కూడబెట్టేయ్యచ్చుట. “ ముందు వెనకలు ఆలోచించలేదు, ఏమిటి ఎందుకు అన్న విషయం పట్టించుకోలేదు, వెంటనే ఉన్న ఉద్యోగం మానేసా (చెప్పా కదా విడాకులు, మొదటిసారి ఇవ్వడం కష్టం, తర్వాత తర్వాత ఎన్ని పెళ్ళిళ్ళైనా  చేసుకోవచ్చు, వదిలేయచ్చు). ఝామ్మని విమానం ఎక్కి దుబాయ్ కి వచ్చేసా.....!!

అద్దాలమేడ లాంటి గల్ఫ్ జీవితం గురించి తదుపరి సంచికలో...........

Thursday, October 25, 2012

ఆనందం - ప్రశాంతత ఎక్కడున్నాయి ?


"అలౌకిక ఆనందం, ప్రశాంతత" ....ఎక్కడుంది? ఎవరిస్తారు? ఎలా ఉంటుంది? సాధారణం గా అది ఎప్పుడూ మనకి కనబడదు – అది మనకి మన పక్క వాళ్ళల్లో  ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఎడారిలో ఎండమావిలా మనం దాన్ని వెతుకుతూ తిరుగుతూ ఉంటాం...గుళ్ళు, గోపురాలు, పూజలు, పునస్కారాలు...ఏవేవో చేస్తాం. అది మనకి దొరకదు. అదొక బ్రహ్మ పదార్ధం లా మనకి అర్ధం అవ్వదు కూడా. అలా మన జీవితం దాన్ని వెతుక్కోడం లో అయ్యే పోతుంది. ఇంక చివరి దశలో అన్ని ఉడిగాక ..అప్పుడు మనకి ఆ అలౌకిక ఆనందం దొరికినట్టు అనిపిస్తుంది. కాస్త విశ్లేషిస్తే దానికి కారణం మనకి విషయం అర్ధం అవ్వచ్చు. “too many disappointments are the reason for too many expectations”. జీవిత ప్రయాణం లో మన ఆశలు, కోరికలు అంతులేనివి వాటిని సాధించే ప్రక్రియలో మనకి కళ్ళ ఎదురుగా ఉన్న ఆనందం కనబడదు. అలా ఎండమావి వెనక పరుగెత్తి పరుగెత్తి వయసు అయిపోయాక ఇంక ఏమి చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు ......ఉన్నట్టుండి మనకి జ్ఞానోదయం అవుతుంది. కోరికలే కష్టాలకి మూలం అని. మనం మన కంటే చిన్నతరం వాళ్ళకి చెబుదాం అని ప్రయత్నిస్తాం...”ఆ మాకు తెలుసులేవోయ్, నువ్వు నీ పని చూస్కో” అని యువతరం వాళ్ళ పనిలో వాళ్ళు పడిపోతారు......వాళ్ళకి మళ్లి సీన్ రిపీట్. మన యవ్వనం లో మనం చేసింది అదేగా? (ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కోరికలు అంటే గొంతెమ్మ కోర్కెలు అని అర్ధం)

అలాగే మనం మనసులో ఉన్న మాట నిర్భయంగా ఎదుటి వాడికి చెప్పగలిగితే మనకి stress ఉండదు. ఎప్పుడు stress  ఎదుటి వాడికి dene vaali  లా ఉండాలి కాని వారినించి lene vaali లా ఉండకూడదు. ఒక అబద్దం చెపితే దాన్ని కవర్ చెయ్యడానికి ఒక వంద అబద్దాలు ప్లాన్ చేసుకోవాలి ..ఆ ప్లానింగ్ లో మన సర్వ శక్తులు ఖర్చు అయిపోతాయి. మనిషికి mental stress లేకపోవడం కూడా ఒక వరం, అదే అలౌకిక ఆనందం కూడా.
నా మటుక్కు నేను హాయిగా ఉంటాను, కాని దాన్ని చూసిన వాళ్ళు “అబ్బే వీడికి భాద్యత లేదు, he is not taking life seriously” అంటారు. ఎందుకంటే మనం హడావిడి చెయ్యట్లేదు ఒకే విషయం మీద అస్తమాను మాట్లాడుతూ ఉండాలి. ఊక దంపుడు ఉపన్యాసం ఇస్తూ ఉండాలి...జీవితం, బరువులు, భాద్యతలు...తొక్క తోటకూరా ఇత్యాది అని పీకుతూ ఉండాలి. మన ప్రస్తుత సమాజం లో “you must not only be working hard, but also seem to be working hard”, అందుకే నిజంగా వాళ్ళు ఏమి చేసినా లేకపోయినా మన చుట్టుపక్కల వాళ్ళు మనకి జీవితం గురించి లెక్చర్లు పీకుతూనే ఉంటారు.
మనం నిన్న ఏమి మాట్లాడాం అని గుర్తుపెట్టుకోకుండా ఉండేలా కనక, మనం మాట్లాడ గలిగితే మన జీవితం లో సగం బాధలు తీరిపోతాయి. అంతా ఆనందమే. Be good, see good, feel good – All is well

Thursday, October 18, 2012

కెమెరామెన్ గంగ తో రాంబాబు - సినిమా సమీక్ష



(పవన్ కళ్యాణ్ అభిమానులకి ఒక విజ్ఞప్తి. నేను కూడా పవర్ స్టార్ కి అభిమానినే. జల్సా, ఖుషి, తమ్ముడు, మొన్న మొన్నటి గబ్బర్ సింగ్ కూడా బాగా నచ్చాయి నాకు...ఈ సినిమా నాకు ఎలా అనిపించిందో అలా ఉన్నది ఉన్నట్టు రాస్తున్నా...దయచేసి తప్పుడు అర్ధాలు తియ్యకండి)
సినిమా పేరు ఉన్నంత క్యాచీ గా సినిమా తియ్యలేదు దర్శకుడు. పవన్ కళ్యాణ్ చాలా బాగా కష్టపడి నటించాడు. ఎక్కడా సినిమాలో అరుపులు కేకలు, మెరుపులు లేవు. హీరో – హీరొయిన్ ఎంట్రీ కూడా ఉన్నంతలో ..కాస్త సాదా సీదాగానే ఇచ్చారు. సినిమా మొదటి భాగం అంతా కాస్త లైవ్ లీ గా నడిచిపోతుంది. ఒక సారి గట్టిగా ఆలోచిస్తే, తమన్నా పవర్ స్టార్ ని కాస్త డామినేట్ చేసిందా అనిపిస్తుంది అక్కడక్కడ. తమన్నా నటన బాగా ఉంది. సినిమా సినిమా కి బాగా పేరు తెచ్చుకుంటోంది.
పవన్ ని చూస్తూ సినిమా లో కాలం గడిపేయ్యచ్చు. పవన్ ఒక కారుషెడ్డు లో మెకానిక్ నించి ఒక టీవి లో న్యూస్ రిపోర్టర్ గా ఎలా మారిపోతాడో చూపించిన క్రమం కాస్త వెటకారం గా అనిపించింది. అయినా కూడా పవన్ బావున్నాడు. తమన్నా మన ‘కెమెరామెన్ గంగ’ అన్నమాట. ఇద్దరు కలిసి రిపోర్ట్ చేసిన సన్నివేశాలు పెద్దగా ఉండవు సినిమాలో, అయినా సినిమా పేరు బాగా కొత్తగా ఉండి అలరిస్తుంది.
ప్రకాష్ రాజ్ పాత్ర చాలా పేలవంగా తీర్చి దిద్దాడు దర్శకుడు. అస్సలు అందులో దమ్ము లేదు.కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి..............వీళ్ళంతా ఇలాంటి పాత్రలు ఎన్నివేసి ఉంటారో లెక్కే లేదు? ఏదో పెట్టాం కదా అన్నట్టు ఉంది ధర్మవరపు సుబ్రహ్మణ్యం/ ఎమ్మెస్ నారాయణ పాత్ర. కాస్తలో ..కాస్త అలీ బావున్నాడు. బ్రహ్మానందం – మళ్ళి ఇంకో disaster character లో కనబడతాడు. బ్రహ్మానందం- పవన్ తో కలిసి TV లో వార్తలు కాస్త వక్రీకరించి ఎలా చదువుతాడో చూపించే సన్నివేశం బాగా పండింది.
సంగీతం - పెద్దగా చెప్పుకోడానికి ఏమి లేదు, ఒక ఐటెం సాంగ్ – జరమొచ్చింది  బాగా ఊపుగా ఉంది, పాట  ఉన్నత ఊపుగా ఆ అమ్మాయి డాన్సు లేదు, యధావిధిగా పవన్ బాగా స్టేప్పులేసాడు. తమన్నాతో చేసిన “నీ నగుమోమే extra ordinary” పాత చిత్రీకరించిన తీరు చాలా బావుంది.పవన్ కళ్యాణ్, తమన్నా చితక్కోట్టేసారు ఈ పాటలో.
సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర (నాజర్) స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారిని పోలి ఉన్నట్టు అనిపించింది...ఖద్దరు పంచె కట్టు, నవ్వు ముఖం, “పాదయాత్ర చేసాను కదా అంతా తెలుసులే “ అన్న డైలాగు ల వల్ల. ముఖ్యమంత్రి పాత్ర పేరు కూడా చంద్రశేఖర రెడ్డి. కోట శ్రీనివాసరావు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ప్రతిపక్షనేత...పాత్ర పేరు అదేదో నాయుడు గారు.
తెలంగాణా ఉద్యమాన్ని ఏదో indirect గా వేరే పేరుతో (తెలుగు వాళ్ళు మిగతా భాషల వాళ్ళు అన్న థీం తో) ఏదో భాషా ఉద్యమం అన్నట్టు చూపించే ప్రయత్నం చేసాడు. పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి ఆ సన్నివేశాలు.
సినిమా చివరలో చాల నాటకీయంగా వేలాది ప్రజలు స్వచ్చందంగా ఒక్కచోటకి మన రాంబాబు కి సపోర్ట్ గా వచ్చి నిలబడతారు...ఆ సీన్ చిరంజీవి ఠాగోర్  సినిమాని స్ఫురింప చేస్తుంది. అప్పుడు కొన్ని మూస డైలాగులు ఉంటాయి...తర్వాత............Climax dialogue…..
“మా కుటుంబాన్ని జనం పట్టించుకోలేదు కాని – ‘నేను’ మాత్రం ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తుంటాను” . ఇందులో ఏదో శ్లేష కనబడుతోందా మీకు? ఇది సినిమా శుభం కార్డు పడేముందు ఆఖరి డైలాగు. అంటే మళ్ళి ఇంకో సినిమా (sequel) తీసుకోడానికి తలుపు కాస్త ఓరువాకిలిగా తెరిచి పెట్టుకున్నాడన్నమాట  మన పవన్ కళ్యాణ్. బయటకి వచ్చేసకా నాకు తట్టిన ఊహ ఏమిటంటే..బహుశ మన పవర్ స్టార్ జగన్ బాబు వైపు ఏమైనా చూస్తున్నాడా అని? ఎందుకంటే..రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన పాత్ర విలన్ ఇందులో. రాజశేఖర్ రెడ్డి గారి పాత్ర లో ఉన్న వ్యక్తి మంచివాడు. చివరాఖరు డైలాగు లో మర్మం.......మా కుటుంబాన్ని జనం పట్టించుకోలేదు కాని........(చిరు అన్నయ్యని వదిలేసారు అని కామోసు) “నేను మాత్రం ఎప్పుడు మీ గురించే ”..గమనించండి “మేము” అనలేదు మరి.......!!!!

“దర్శకుడు పూరి జగన్నాధ్ సినిమా నిర్మాతపై తనకి రావలసిన బాకీ పారితోషకం వివాదం పై డైరెక్టర్ల సంఘం లో సినిమా విడుదలకి ముందే ఫిర్యాదు చేసారు “ – వార్త. నిజమే మరి బొమ్మ రిలీస్ అయ్యేముందే దర్శకుడు విషయం అర్ధం చేసుకున్నాడు కాబట్టి ఆ మాత్రం జాగ్రత్త పడడం లో తప్పులేదు.

వ్యక్తిగతంగా నాకు, ఈ సినిమా కంటే...గబ్బర్ సింగ్ సినిమా బాగా నచ్చింది.

Sunday, October 14, 2012

AIYYA HINDI సినిమా రివ్యూ



తారాగణం: ముసలిదైపోతున్న ..రాణి ముఖర్జీ, పృథ్విరాజ్.
సంగీతం: అమిత్ త్రివేది

మన తెలుగు సినిమా సూపర్ (నాగార్జునది) లో బ్రహ్మానందం - అలీ మొదటి పరిచయం లో ఒక డైలాగు ఉంటుంది. అదే ఈ సినిమా రివ్యూకి మూలం.

“మన ఖర్మ కాలిపోయి....సగం జీవితం సంకనాకి పోయి...పొజిషన్ క్రిటికల్ గా ఉంటె తప్ప.......ఇలాంటి సినిమాకి వెళ్ళకూడదు”

ఇంత దరిద్రం గా ఉంటుందని కల్లో కూడా అనుకోలేదు సుమా.....థూ!!!!

Friday, October 12, 2012

చిత్రమైన ఫ్రెండ్స్ - అందరికి ఎవడో ఒకడు ఉంటాడేమో?


“ఏరా మొన్న నా పెళ్ళికి రాలేదే?” అడిగాడు శ్రీరాం కోపంగా.............”సారీ రా ఒక ముఖ్యమైన పని ఉండి రాలేక పోయాను...ఈ సారి వస్తాలే” సంజాయిషీ ఇచ్చుకున్నాడు రాజా.

పుండు మీద కారం చల్లినట్టు ఇంకా కోపం వచ్చింది శ్రీరాం కి. “అంటే నీ ఉద్దేశం మళ్ళి మళ్ళి పెళ్ళిచేసుకుంటా అనా?”
ఒకసారి శ్రీరాం మొహం లోకి చూసి తాపీగా చెప్పాడు రాజా:”ఒరేయ్ నువ్వు విజయని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా?”
“అవును”.  
“మొదట్లో ఇంట్లో ఒప్పుకోరని మీరు ఇద్దరూ గుళ్ళో దండలు మార్చుకున్నారు కదా? అప్పుడు నేను కాస్త భయపడి మీ గుళ్ళో పెళ్ళికి రాలేక పోయా...తర్వాత, గుళ్ళో పెళ్ళికి గుర్తింపు ఉంటుందో లేదో అని మీరు రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నారు కదా? అప్పుడు నన్ను సాక్షి సంతకాలకి రమ్మన్నారు కదా మీరు..కాని నాకు కాస్త సహజంగా ఇలాంటి విషయాల్లో ధైర్యం తక్కువ కాబట్టి నేను మీ రిజిస్టర్ మ్యారేజికి రాలేదు. అన్ని విషయాలు సర్డుకున్నాకా మీ అమ్మా నాన్నా మామూలుగా కార్డులు అవీ అచ్చేయించి ఇప్పుడు ఈ కళ్యాణ మండపం పెళ్లి చేసారు కదా? నిజంగా నేను పని ఉండి రాలేకపోయా...ఇన్నిసార్లు ఏదో వంకన పెళ్లి చేసుకున్నవాడివి మళ్ళి ఇంకేదైనా వంకన చేసుకోకపోతావా అని అలా అన్నా కాని వేరే ఉద్దేశం లేదు ఇంకోలా అనుకోవద్దు” నచ్చ చెప్పే ప్రయత్నం చేసాడు రాజా. పక్కనున్న మేము నవ్వాపుకోలేక చచ్చాం.

అలాగే ఇంకోడు ఉన్నాడు మాకు....ఒకసారి వాడు హాస్పిటల్ కి ఏదో పని ఉందని వెళ్ళాడు, కూడా మమ్మల్ని తీసుకెళ్ళాడు బైకు మీద . అక్కడ వాడు ఒక కళ్ళు చెదిరే అందంతో ఉన్న ఒక నరసమ్మని చూసాడు. 
 ఇంక ఆపుకోలేక ఆవిడ దగ్గిరకి వెళ్లి మనసులో ఉన్న మాట చెప్పేసాడు – తెగించి: “నాకు ఈ హాస్పిటల్ లో మీ చేత సపరిచర్యలు చేయించుకునే అదృష్టం ఎప్పుడు వస్తుందో”. ఆ మాటకి ఆవిడ కళ్ళు ఒక్కసారి ఆశ్చర్యంతో విప్పారినట్టయ్యి, ముసి ముసి నవ్వులు నవ్వుతూ......”ఒక్క అదృష్టం చాలదండీ......ఒక అద్భుతం జరగాలి ............. ఎందుకంటే నేను ప్రసూతి వార్డులో నర్సుని.”

Friday, October 5, 2012

Facebook wall - మా ఇంట్లో గోడమీద ఫోటోలు


మా చిన్నప్పుడు అమ్మమ్మ గారు, తాతగారి ఇంట్లో పెరిగాను. ఇప్పుడు కూర్చుని ఆలోచిస్తుంటే ఒక విషయం జ్ఞాపకం వస్తోంది....... ఇప్పుడైతే ఫేస్ బుక్కులు అవీ వచ్చి, walls మీద ఫోటోలు పెట్టుకోడం మనం మనం చూసుకోడం అదీను వచ్చింది ....... కాని ఆ రోజుల్లోనే మా ఇంట్లో గోడ మీద వరసగా మావాళ్ళ వి ఫోటోలు చాల ఉండేవి. అన్ని ఫోటోలు పెద్ద పెద్ద ఫ్రేం లో కట్టించి చక్కగా అన్ని ఒకే సైజులో ఉండేలా చూసి..అన్నిటికి వరసగా ఎగుడు దిగుడులు లేకుండా ఉండేలా ఉండడం కోసం ఒక బేస్ లైన్ లా ఒక చెక్క బద్దలాంటిది గోడమీద కొట్టి వాటిమీద ఈ ఫోటో ఫ్రేములని  వరసగా కూర్చోపెట్టేవారు.
ఇంట్లోకి అడుగు పెడుతూనే ఎదురుగా మొదటి గదిలో పద్మావతిసమేత కళ్యాణ శ్రీనివాసుడు గోడమీద ఫోటో రూపం లో దర్శనం ఇచ్చేవారు. ఈ మధ్య నేను ఎక్కువగా వింటున్నా ...వేంకటేశ్వరుడు మన ఇంట్లోంచి వీధి గుమ్మం చూడకూడదు మంచిది కాదు అని....మరి అ రోజుల్లో మా తాతగారు చాలా బాగా Rich గా బ్రతికారు. ఆయన సకల ఐశ్వర్యాలని అనుభవించారు - మరి ఆయన ఆ ఇంట్లో ఉన్నన్నినాళ్ళు వేంకటేశ్వరుడు వీదిగుమ్మం వేపే చూసేవాడు మరి. “ఆ మంచిది కాదు అన్న సెంటిమెంట్ ఆయనకి మరి ఎందుకో అడ్డు రాలేదు”. అంటే ఆయన కృషీవలుడు కూడాను, కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి..అలాంటి వాళ్ళ ముందు బహుశా ఈ నమ్మకాలు కూడా పనిచేయ్యవేమోలెండి. ఆ ముందు గదిలోంచి హాల్లోకి వెళితే ఎదురుగా గోడమీద తాతగారి అమ్మగారిది నాన్నగారిది ఫోటోలు ఉండేవి. అవి చాల పెద్ద సైజులో ఉండేవి. తాతగారి తల్లి తండ్రులు పాత తరం వారు కావడం చేత సహజంగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు అవి. వాటి కింద మా అమ్మమ్మ గారి ఫోటో - దానికి ఒక దండ వేసి ఉండేది. ఇంకా హాల్లో నాలుగు గోడల మీద రక రకాల చుట్టాలవి, పెద్ద పెద్ద వాళ్ళవి, ఎన్నెన్నో ఫోటో లు ఉండేవి. పండగలు వచ్చినప్పుడు ఇల్లుదులపడం తో బాటు వాటిని కూడా నిచ్చెన వేసుకుని తడిగుడ్డతో తుడవడం ఒక వరుసక్రమం లో జరిగేవి. ఏవైనా కొత్త ఫోటోలు, ప్రత్యెక ఫోటోలు వస్తే పాత ఫోటోలు కిందకి దింపి కొత్త ఫోటోలు పైకి ఎక్కిన్చేవాళ్ళం. తర్వాతి కాలంలో...నేను కూడా రాజారవివర్మ paintings, Monalisa photo కూడా పెట్టేసా వాటి పక్కన.
అంటే ఇంతకి చెప్పొచ్చేది ఏమిటంటే...Walls మీద ఫోటోలు పెట్టుకోడం షేర్ చేసుకోడం Mark Zuckerberg వచ్చి ఏమి కనిపెట్టలేదు అని.

Thursday, October 4, 2012

ఇంగ్లీష్ - వింగ్లిష్ (శ్రీదేవి) సినిమా రివ్యూ


అలనాటి అందాల సుందరి, భారత దేశపు లక్షలాది మొగవారి కలల రాణి శ్రీదేవి పదిహేనేళ్ళ తర్వాత నటించిన ఇంగ్లీష్ –వింగ్లిష్ చూసాకా నా గుండె ఎక్కడో పిండేసినట్టయ్యింది. ‘ఆ శ్రీదేవికి – ఈ శ్రీదేవికి’ ఎక్కడ పోలిక? మొహం అంతా పీక్కు పోయినట్టు ఉన్న అలనాటి అందాల సుందరి... వాడెవడో వెధవ plastic surgeon మా శ్రీదేవి ముక్కు మీద ఆడుకుని ఆవిడ ముక్కుని పూర్తిగా తగలేసాడు. క్లోస్ అప్ లో మొహం చూడలేక పోయాను. ఒక్క విషయం మాత్రం ఒప్పుకోవాలి, ఇద్దరు పిల్లల తల్లి అయిన కూడా ఇప్పటి చాలా మంది హీరోయిన్ ల కంటే శ్రీదేవి చాలా నాజూకుగా ఉంది.
కధ క్లుప్తంగా....
మన శ్రీదేవి ఒక సామాన్య సగటు మధ్య తరగతి కుటుంబ మహిళ. ఆవిడకి హిందీ తప్ప ఇంగ్లీష్ బొత్తిగా రాదు. దానివల్ల ఇంట్లో కాన్వెంట్ చదువులు చదువుకునే పిల్లలకి కూడా వెటకారం, లోకువ. భర్త కూడా అప్పుడప్పుడు అలానే ప్రవర్తిస్తూ ఉంటాడు. ప్రతీ స్కూల్లో జరిగే parent – teacher meetings లాగే ఇందులో  కూడా ఒక సన్నివేశం ఉంటుంది అందులో .. అమ్మని తీసుకెళ్ళడానికి కూతురు నామోషి గా  ఫీల్ అవుతుంది. మన ఇల్లాలు బూంది లడ్డు చెయ్యడం లో చాలా సిద్ధహస్తురాలు. లడ్డూలు   చేసి ఇంటి ఇంటికి అమ్ముతూ ఉంటుంది. ఇంతలో ఉన్నట్టుండి అమెరికా  లో ఉన్న తన అక్క కూతురు పెళ్ళికి సహాయం చెయ్యడానికి శ్రీదేవిని ఒంటిన్నర నెలల ముందే రమ్మని పిలిచి టిక్కట్టు ఇచ్చి పంపుతుంది అక్క. అమెరిక లో కూడా ఇంగ్లీష్ రాణి కారణంగా కొన్ని అవమానాలు ఎదురుకుంటుంది. అక్కడికి వెళ్ళాకా అనుకోకుండా ఒక బస్సు మీద ‘నాలుగు వారాల్లో ఇంగ్లీష్ నేర్చుకోండి’ అన్న బోర్డు చూసి, ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్న తపనతో ఎవరికీ తెలియకుండా ఆ క్లాస్ లో జాయిన్ అవుతుంది. అలా నెమ్మదిగా అక్కడ ఇంగ్లీష్ లో కాస్త కాస్త ప్రావీణ్యం సంపాదించుకుంటుంది . ఈ విష్యం ఇంట్లో ఎవరికీ తెలియదు...ఒక్క తన మేనకోడలికి తప్ప (ప్రియ ఆనంద్ మేనకోడలిగా నటించింది).  ఆఖరు క్లైమాక్స్ సీన్ లో శ్రీదేవి ఇంగ్లీష్ లో ఒక బుల్లి స్పీచ్ ఇచ్చి అందరిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచేస్తుంది. అప్పుడు సీను కాస్త ఎమోషనల్ గా ఉంటుంది. కర్చీపులు అవీ ఉంటె బయటకు తీసి పెట్టుకోండి....ఎందుకైనా మంచిది. మధ్యలో కాస్త మెలో డ్రామా...సున్నిత మైన హాస్యం...............అన్నిటికి మించి శ్రీదేవి నటన సినిమాకి ఆయువు పట్లు. మా శ్రీదేవి లాంటి నటి ఈ రోజుల్లో లేదు అంటే అతిశయోక్తి కాదు.
సినిమాలో అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య ఆకర్షణ. అమెరిక వెళ్ళే విమానం లో అతను శ్రీదేవి కి సహ ప్రయాణికుడు. ఉన్న అయిదు నిమిషాలు అమితాభ్ నాకు నచ్చాడు. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ వాడు అడిగిన ప్రశ్నకి అతను చెప్పిన సమాధానం నచ్చింది. “What is the purpose of your visit to USA”. “To help USA…….. What?...............  Yes to spend some dollars here and try to help and revive your sagging economy” అలాగే శ్రీదేవితో కూడా అంటాడు...”ఈ తెల్లోళ్ళని చూసి భయపడే రోజులు పోయాయి అమ్మా...గట్టిగా మాట్లాడితే వీళ్ళే మనలని చూసి భయపడాలి ఇప్పుడు”    
శ్రీదేవి భర్త పాత్ర పోషించినవాడు ఎవరో ఒక అనామకుడు – అదృష్టవంతుడు కూడా. శ్రీదేవి కోడు పాత్ర వేసిన కుర్రాడు చాల బాగా నటించాడు. అచ్చు మన ఇళ్ళల్లో ఉండే చిన్న గారాబు పిల్లల్లా బాగా నటించాడు. శ్రీదేవి కూతురు పాత్రలో ఉన్న అమ్మాయి కూడా ఒక typical teenaged daughter లా బావుంది. ప్రియ ఆనంద్ బావుంది – చిన్న పాత్ర అయినా సరే.

సినిమా అంతా శ్రీదేవే ఇంకేమి లేదు – ఒక్క అమెరికా తప్ప. సినిమా అంతా శ్రీదేవి చీరలే కట్టింది. అందులో అన్ని కాటన్ చీరలే....ముఖ్యంగా ఈ పక్కన ఉన్న చీరలో చాలా బావుంది శ్రీదేవి.

సినిమాలో పెద్ద కధ ఏమి లేకపోవడం వల్ల దర్శకుడు కాస్త కధనం మీద దృష్టి, శ్రద్ధ పెట్టాల్సింది. చాలా చోట్ల సినిమా బాగా నెమ్మదిగా నడుస్తుంది........ఎడిటర్ కత్తి బండబారిపోయినట్టు నాకు అనుమానం. సరిగ్గా ఫిల్ముని కోయ్యలేదు. Editing could have been much crisper.

ఒక్కసారి మన శ్రీదేవి నటన గురించి వెళ్లి చూసిరండి....నిరాశ పడరు. నాదీ హామీ.

Friday, September 28, 2012

ప్రభాస్ – రెబెల్ సినిమా రివ్యూ



ప్రభాస్ ఒక నిజమైన “రెబెల్ మాస్ స్టార్” లా అవతారమెత్తిన చిత్రం - రెబెల్ సినిమా. చాలా రఫ్ గా, సరైన మొగాడిలా అతనిని చూపించే ప్రయత్నం చేసిన సినిమా - రెబెల్.  

సినిమా మొదలయ్యిన కాస్సేపటి దాకా మనకి ఏమి జరుగుతోందో పెద్దగా అర్ధం అవ్వదు కాని బాగా గ్రిప్పింగ్ గా ఉంటుంది.
సినిమా అంతా ప్రభాసే!!!
మొదటి భాగం చాలా బావుంది. హాయిగా నవ్వుకోవచ్చు. చాల రోజుల తర్వాత బ్రహ్మానందం కి కాస్త మంచి నిడివి గల  పాత్ర ఇచ్చారు.బ్రహ్మానందం, ప్రభాస్, తమన్నా, కోవై సరళ అందరు కలిసి కాస్సేపు బాగానే నవ్విస్తారు మనల్ని. 
తమన్నా introduction పాట చాలా catchy  గా తీసారు. పాటలో బీట్లు foot tapping గా ఉంటాయి. ఈ పాటలో తమన్నా కి చాలా మంచి స్టెప్పులు, కాష్ట్యూమ్స్ కూడా ఇచ్చాడు లారెన్స్. ఈ పాట చూసాక నేను ఒక నమ్మకానికి వచ్చేసా......తెలుగు తెరకి ఇంక ఇలియానా అవసరం లేదు. తమన్నా వచ్చేసింది....పిట్టనడుముతో.  ఇంక మన దర్శకులు హీరోలు అంతా ఆ నడుము చుట్టూ తిరుగుతారు. http://www.youtube.com/watch?v=UqOlSp4qKjU
బ్రహ్మానందం – కోవై సరళ హాస్యం అనుకున్నట్టే ఉంటుంది. కోవై సరళ ఉన్నంతలో అరవ హాస్యం బాగానే పండించింది. బ్రహ్మానందం, కోవై సరళ Hip – Hop dance steps ఊహించుకుంటేనే నవ్వొస్తుంది...ఇంకా చూస్తే..?? కొన్ని డైలాగులు – “అబ్బ ఊరుకోండి సార్...మనదేశం లో యాభై శాతం నాలాంటి పోట్టున్నోళ్ళు (పొట్ట చూపించి) బట్టున్నోళ్ళు (బట్ట తల చూపించి).” “నాపేరు నరస రాజు అండి ...అందరు నన్ను ‘నస’ రాజు అంటారు”. జెట్ ఎయిర్ వేస్ రిసెప్షన్ అమ్మాయి “నేను మీకు ఏ రకంగా సహాయ పడగలను” అన్నప్పుడు, బ్రహ్మి “ ఓ యాభై వేలు అప్పుంది ఏమైనా సద్దుతావా”?
రెండో భాగంలో మన కమెడియన్ అలీ ఒక డాన్స్ మేష్టారిలా ఎంట్రి ఇస్తాడు. ఉన్న పది నిమిషాలు బాగా నవ్వుకుంటాం. ఆ పదినిమిషాల్లో ఓంకార్ ‘అన్నియ్య’ మీదా, శివశంకర్ మాస్టర్ మీద కాస్సేపు జోకులు...
రెండో భాగం లో మీరు అనుకున్నట్టే కధ నడుస్తుంది. ఇంక ఇందులో అన్ని లారెన్స్ ట్రేడ్ మార్క్ అరవ fightings, అరవ ఎమోషన్స్ చూపిస్తాడు. ప్రభాస్ ఎమోషనల్ సీన్లు కూడా బాగా చేసాడు అనిపించింది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బాక్ లో వచ్చే దీక్షా సేథ్ ...ఫేస్ బుక్ లో ఉన్న చాలా మంది ఆడపిల్లలు పెట్టుకునే ఒక అందమైన display profile picture లా ఉంటుంది...కస్సేపయ్యాక చచ్చిపోతుంది.
సినిమాకి కాస్త Hype create చేద్దామని కామోసు పాత తరం రెబెల్ స్టార్ కృష్ణం రాజుని ఒక పాత్రలో తీసుకువస్తాడు లారెన్స్. అది మన హీరో గారి తండ్రి పాత్ర..సహజంగానే అది ఒక ఊరిపెద్ద, ఉదాత్త మైన పాత్ర. అతన్ని చంపగానే మన హీరో గార రెబెల్ గా అయిపోతారు. ఒక ఫైట్ లో ప్రభాస్ కండలు చాల బాగా చూపించారు మంచి ఎఫెక్ట్ వచ్చింది...నేల, బెంచి జనాల్లో ఈలలు, కేకలు పుష్కలంగా వస్తాయి.
మొదటి భాగం చూసి ఇంటికి క్షేమంగా వచ్చెయ్యండి – హాయిగా నవ్వుకుంటారు. మరీ యుద్ధాలు, రక్తాలు ఉన్నా  పర్వాలేదు అంటే రెండో భాగం కూడా చూడండి. యుద్ధాలు రక్తాలు మనకి కొత్త కాదు కాని, వాటితో పాటు వెనక్కాల అరవ మ్యూజిక్ = కొత్త మనకి, నాకు కాస్తంత గుండె దడ వచ్చింది.
సినిమా బాగా ఆడి మంచిపేరు వస్తే అది మొదటి భాగం వల్ల. ఒకవేళ ‘సినిమా పోయింది – వేష్టు’ అని పేరువస్తే అది రెండో భాగం వల్ల.
మొత్తం మీద ఇది ప్రభాస్ సినిమా.

Friday, September 7, 2012

నా చిన్న నాటి జ్ఞాపకాలు (ఉమ్మడి కుటుంబం)


ఉమ్మడి కుటుంబాలు...... ahh..What does it mean? How do they look like? “అమ్మా  చూడవే ఈయనేదో ఉమ్మడి or maybe something like Gummadi అంటున్నారు?”
అవునండి ఈ కాలం పిల్లల దగ్గిర ఇలాంటి పదం వాడితే అలానే అంటారేమో సాధారణం గా. ఈ రోజుల్లో అన్నీ nuclear families, ఎక్కడ చూసినా  2 + 1 మహా అయితే  2 + 2 అంతే – కుటుంబం అక్కడే మొదలయ్యి అక్కడే పూర్తైపోతుంది.
అమ్మమ్మ - తాతగారు మేము 
మా చిన్నప్పుడు మేము ఒక ఉమ్మడి కుటుంబంలో పెరిగాము. మా తాతగారి ఇంట్లో పెరిగాము. తాతగారు, అమ్మమ్మ, బామ్మగారు, మేనమామలు, వారి భార్యలు, వాళ్ళ పిల్లలు కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. తాతగారి చెల్లెళ్ళు వాళ్ళ కుటుంబాలు (ఉండేది వేరే ఇంట్లో అయినా పొద్దున్న రాత్రి మకాం ఇక్కడే కబుర్లకి, కాలక్షేపాలకి). అరమరికలు ఉండేవి కావు. ఎంతమంది వచ్చారు? ఎంతమంది తిన్నారు? ఎన్ని సార్లు వచ్చారు?ఎంత ఖర్చు అయ్యింది? అసలు ఆ ప్రశ్నలు ఉత్పన్నమే అయ్యేవి కాదు. “అయ్యో వాడు/ అది  ఈ సారి ఎందుకు రాలేదు అనుకునే రోజులు అవి.”
అదే ఇప్పుడు ఎవరూ ఇంటికి కూడా రావక్కర్లేదు, వాళ్ళనించి ఒక్క ఫోన్ వస్తే చాలు, పరి పరి విధాల ఆలోచనలు, తర్క- వితర్కాలు. “అసలు ఉన్నట్టుండి ఎందుకు చేసాడో? ఎం గొడవో ఏమిటో? డబ్బెమైన అడుగుతాడో? మన డ్రైవర్ ని కాస్సేపటికి ఇమ్మంటాడో? మన కారే అడుగుతాడో? అసలు వాళ్ళని కాస్త దూరం పెడితే మంచిది. మళ్ళి వెధవ మొహమాటాలు, మర్యాదలు, టైం వేష్ట్ – డబ్బులు బొక్క”. ఇవీ ఠక్కున మనస్సులోకి వచ్చే ఆలోచనలు ఈ రోజుల్లో. అదే తాను ముక్కలు - మన నించి మనపిల్లలికి అవే బుద్దులు అబ్బుతున్నాయి. దీనివల్ల మంచి చెడుల మాట ఎలా ఉన్నా మన మీద negative stress చాల పడుతోంది. అవతలి వాడిని తప్పించుకోడానికి ఎత్తులు పైఎత్తులు వేస్తూ ఎప్పుడూ ..ఏదో ఒక అబద్దం, ఏదో ఒక కధ... ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటూ దాన్ని అన్ని సందర్భాలలో అందరిముందు అతికేలా ఉండేలా ప్రయత్నిస్తూ.............వెధవ జీవితం తెల్లారిపోతోంది. హాయిగా మనసారా నలుగురితో కలిసి నవ్వుకుని ఎన్నాళ్ళయ్యింది మీరంతా? ఎందుకు ఇలా బ్రతుకుతున్నాం?
ఒక బుల్లి ఫ్లాష్ బాక్ స్టొరీ....
మా ఇంట్లో వీధిలో ఉండే అరుగు (మా ఆఖరి తమ్ముడు వాసు)
మా ఇంట్లో బయట ఒక పెద్ద హాలు లాంటి అరుగు ఉండేది, దానిలో ఒక పది కుర్చీల దాకా ఉండేవి. అందులో ఒకటి కాళ్ళు చాపుకుని కూర్చునే పడక కుర్చీ, అందరికి అది ఒక favourite కుర్చీ. పొద్దున్నే ఇంట్లో నాలుగో ఐదో  తెలుగు/ ఇంగ్లీషు  వార్తా  పత్రికలూ వచ్చేవి. తాతగారు ఆ పడక కుర్చీలో, మిగతా వాళ్ళు అనగా నేను నా తమ్ముళ్ళూ, పిన్నిలూ , మా మేనమామలు మిగతా కుర్చీల్లో సర్దుకుని, వార్తలు చదివేసేవాళ్ళం.

మా తాతగారి ఇంట్లో  మేమందరం 
మా ఫ్రెండ్స్ – “ఒరే ఎప్పుడైనా మీ ఇంటికి రావాలంటే భయంగా ఉందిరా” అనే వాళ్ళు. ఎందుకంటే, ఇంటికి వచ్చినప్పుడు వీధి అరుగు హాల్లో మా చిన్న మావయ్య కంట వీళ్ళు బడితే వెంఠనె ఆయన వీళ్ళని లెక్కల్లో పైథాగరస్ సిద్ధాంతం, లేదా ఏదో ఒక ఆల్జీబ్రా సూత్రం అడిగే వారు. ఆ దెబ్బకి వాళ్ళు ఆయన వీధి అరుగు మీద  కనబడితే తప్పుకుని మళ్ళి ఎప్పుడైనా వచ్చి నన్ను కలిసే వారు. సజహంగా ఆయనకి  మహా  వేళాకోళం, వెటకారం. ఎప్పుడూ ఏదో ఒక జోకు వేసి అందర్నీ నవ్విస్తూ ఉండేవారు (ఇప్పుడూ ఉన్నారు). అలాగే మా బామ్మ గారు, ఆవిడకి అందరు బామ్మల్లాగే దైవ భక్తి ఎక్కువ. పూజలకి పువ్వులు/ పెరట్లో మొక్కలు  – ఆవిడ favourite subject. దానికోసం ఇంట్లో ఎక్కడో అక్కడ ఒక మొక్క, చెట్టు, పందిరి, పాదు, అంటూ ఇలా ఏదో ఒక project ఎప్పుడూ running లో ఉండేది.  మాకు వెనక కాస్త దొడ్డి ఉండేది అందులో మొక్కలు వేసేది ఆవిడ. మా ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా ఇంటికి, వాడికి ఒక చేగోడినో, జంతికలో కాస్త ఇచ్చి రెండు మామూలు కబుర్లు అడిగి, వెంటనే “బాబూ కాస్త ఇలా వచ్చి ఆ బీర పాదు ఆ పందిరి మీదకి ఎక్కించు” అని పని అప్పచెప్పేవారు. మా ఫ్రెండ్ ఎవరు కనబడితే వాడికి తప్పకుండా ఆవిడ ఈ facility ఇచ్చేవారు. ఒక్కోసారి ఒక్కో ఫ్రెండ్ – “ఇదిగో వస్తున్నా అండి” అని జంప్ అయ్యేవారు కూడా. అలాంటప్పుడు ఆవిడ నాతో “ఒరే రావూ ఆ వుండవల్లిగాడు ఉన్నాడే ఒఠి కబుర్లపోగురోయ్, ఇదిగో బామ్మగారు అంటాడు మళ్ళి కనబడడు.”
వేసంగుల్లో అప్పుడు ఏ. సి. లు లేవు కాబట్టి, అందరం పొలోమని పైడాబా (రెండో అంతస్తు) మీదకి పోయేవాళ్ళం పడుకోడానికి. దానికో పెద్ద డెకరేషన్ ఉండేది. పెద్దవాళ్ళు (తాతగారికి, బామ్మగార్లకి) మడత మంచాలు, మిగిలిన మా అందరికి పరుపులు, చాపలు, జంపఖానాలు, దుప్పట్లు, తలగడాలు, మంచినీళ్ళ చెంబులు, విసనకర్రలు. ఇవన్ని రాత్రి పడుకోబోయే ముందు మొదటి అంతస్తునించి పోలో మని రెండో అంతస్తుకి మోసుకువెల్లడం. మధ్య రాత్రిలో ఖర్మ కాలి ఎప్పుడైనా వర్షం వస్తే, గోలోమని అన్ని ఎత్తుకుని కిందకి దిగడం. భలేగా ఉండేది...విసుగు విరామం ఉండేది కాదు. ఇప్పుడు కాస్త దాహం వేస్తే గ్లాసు మంచినీళ్ళు ఎవరు ఇవ్వాలి అని ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటున్నాం. (పెద్ద పని మరి?)
ఉమ్మడి కుటుంబాల్లో ఇంకొక సుగుణం ఏమిటంటే మనకి భోజనానికి ఢోకా ఉండేది కాదు. ఇంట్లో ఒకరికి కోపం వస్తే ఇంకొకళ్ళు ఉంటారు మనకి ఫుడ్డు సంగతి చూడ్డానికి. ఒకళ్ళ కోపాలు, అలకలు మనకి పెద్దగా effect ఇచ్చేవి కాదు ఆ రోజుల్లో.ఉమ్మడి కుటుంబాల్లో ఇంకో పెద్ద సుగుణం, మా అందరికి అన్ని అందరితో ఇచ్చిపుచ్చుకునే మనస్తత్వం అలవాటు అయ్యింది. There used to be lot of feel good factor in sharing whatever we have. ఇప్పుడు అది ఎక్కడ కనబడడం లేదు. ఒక్క Facebook లో status లు  share చేసుకోడం తప్ప.
"మన జీవిత నాటకం చాలా చిన్నది...గడిచిపోయిన నిన్న మనది కాదు !! రాబోయే రేపు - ఒక ఊహ మాత్రమె!! నిజంగా చూస్తామో లేదో..నిజంగా చూసేదాకా మనకి తెలియదు...!!! ఇంకా మిగిలింది ఇప్పుడు, మన చేతుల్లో ఉన్న ఈ అద్భుత మైన ఎన్నో సుందర అనుభూతులున్న - వర్తమానం. అందుకే మన ఈ వర్తమానాన్ని హాయిగా ఆనందిస్తూ జీవిద్దాం అంతే కాని ఏదో " ఇలా ఈ జీవితాన్ని ఈసురోమని వెళ్ళదీయద్దు "

Friday, August 31, 2012

బాలకృష్ణ – శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ


కొన్ని అనివార్య కారణాల వల్ల తప్పని సరి పరిస్థితుల్లో నేను శ్రీమన్నారాయణ సినిమా చూడాల్సి వచ్చింది. ఇంక ఎలాగో చూసేసాను కనక మీ అందరికి దాని గురించి చెప్పాల్సిందే కదా?
కధ టూకీగా చెప్పాలంటే, ప్రజల/ రైతుల పక్ష పాతి అయిన ఒక రైతు నాయకుడి (విజయకుమార్) చొరవ తో 5000 కోట్ల రూపాయలు ఒక ఫండ్ గా పోగుచేసి ఒక బ్యాంకు అకౌంట్ లో వేస్తారు. దాన్ని మన ప్రతి నాయకులు (విలన్లు) దొబ్బేస్తారు, ఈ క్రమంలో ఆ రైతు నాయకుడిని చంపేస్తారు. ఆ నేరం మన హీరో రైతు బాందవుడి  కొడుకు/ Zee 24 గంటలు ప్రముఖ జర్నలిష్టు అయిన   శ్రీమన్నారాయణ మీద మోప బడుతుంది. హీరో గారు జైలుకి వెళతారు. తర్వాత ఆయన చాక చక్యంగా వీళ్ళ భారతం పట్టి, వాళ్ళ నాన్నగారి ని ఈయన హత్యా చేసారు అన్న నింద మాపుకుని, ఆ 5000 కోట్లు దొంగిలించారు అని మోపబడిన నింద ని కూడా చెరిపేసుకుని, జనానికి నిజం తెలియజేస్తారన్నమాట.

సరే ఇంత ప్లాట్ ని నడపడానికి కావాల్సిన సంజామా లో భాగంగా ...ఒక తండ్రి (విజయ్ కుమార్), ఒక తల్లి (సుధా) ఒక మరదలు/ ప్రియురాలు – ఇషా చావ్లా, ఒక సహపాత్రికేయురాలు – పార్వతి మెల్టన్, ఒక అయిదుగురు విలన్లు అందులో మనకి చెప్పుకోతగ్గ మొహాలు – కోటశ్రీనివాసరావు, సురేష్(పాత తరం బూరి బుగ్గల హీరో), నాగినీడు ఇత్యాది. అలాగే ఇంకో పాతతరం హీరో వినోద్ కుమార్ CBI officer పాత్రలో నటించారు. ఆహుతి ప్రసాద్ జైలు వార్డెన్ పాత్రలో. ఒక పనికి మాలిన పాత్రల్లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం (అదేదో టీవి చానల్ CEO) , ఎమ్మెస్ నారాయణ, కృష్ణ భగవాన్ (అనుక్షణం అసహ్యంగా తిట్టించుకునే బ్రాహ్మణ పాత్రలు – పంతుళ్ళు)  
మొదటి భాగం అంతా వేళాకోళంగా వెటకారంగా మన బాలయ్య పాత్రికేయుడి పాత్రలో నాలుగు ఫైట్ లు ఆరు పాటలు లా గడిచిపోతుంది. 

మరదలిగా ఇషాచావ్లా బావుంది. నటన కూడా బాగా చేసింది, అమ్మాయికి భవిష్యత్తు ఉంది అనిపిస్తోంది. కాకపోతే ఆ అమ్మాయి ఒక్క విషయం లో కాస్త జాగ్రత్త తీసుకుంటే బావుండును..పాటల్లో కాస్త పొట్ట కనబడకుండా శ్రద్ద తీసుకుంటే బావుండేది...బుల్లి చిరుబొజ్జ కనబడుతుంది..నార్త్ హీరొయిన్ కి బుల్లి బొజ్జ బాగోదు కదా? బాలయ్యతో పార్వతి మెల్టన్ కొన్ని కలల్లో పాటలు పాడుకోడానికి అప్పుడప్పుడు గోకడానికి మాత్రం పెట్టారు అనిపిస్తుంది. పార్వతి మెల్టన్ ఇంకో size zero heroine – మిగతా శరీరం చిక్కిపోయింది కాని కళ్ళు మాత్రం పెద్దగా అలాగే ఉండిపోవడం తో ఒక్కోసారి రెండు కనుగుడ్లు ఇంక బయటకి వచ్చేస్తాయెమో  అన్నట్టు అనిపిస్తుంది.
పాటల్లో ఒకటి బావుంది, డాన్సులు రెండుబావున్నాయి. ఫోటోగ్రఫి చాలా బావుంది. చక్రి సంగీతం తేలిపోయింది పెద్ద సరుకు లేదు.
రెండో భాగం అంతా  మన బాలయ్య వాళ్ళని చంపే పనిలో ఉన్నది. అంతకుమించి ఏమిలేదు.

కొన్ని పంచ్ లు అక్కడక్కడ పేలీ - పేలనట్టు ఉంటాయి, మచ్చుకకు కొన్ని:
  • Ø  “అరటి పండుకి తొక్కే సెక్యురిటి ..నాకు నీ పక్కలో సెక్యురిటి – పార్వతి మెల్టన్ బాలయ్యతో”
  • Ø  “సార్ భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి ఒక్కడికే కదా చెప్పాడు, మరి ఇప్పుడు మన అందరికి ఎలా తెలిసిపోయింది అండి? అంటే ఆ రోజుల్లోనే పైరసీ ఉండేది అంటారా?” – దువ్వాసి మోహన్ (ఇంట్లో పనివాడు) విజయ్ కుమార్ తో 
  • Ø  “నాకు తాజ్మహల్ కట్టిస్తావా” పార్వతి మెల్టన్ బాలయ్యతో  – “ఆ మొన్నే రెండెకరాలు కొని పెట్టాను, ఇంక నువ్వు చావడమే అలిస్యం కట్టించేస్తా..!!!”  బాలయ్య బాబు జవాబు.
  • Ø  “ఒంద మందిలో చెయ్యెత్తి దండం పెట్టిన ఆ 99 మంది గురించి కాకపోయినా సరే, వేలెత్తి చూపిన ఆ ఒక్క చేతికోసం అయిన సరే నా నిర్దోషిత్వం నిరూపిస్తా” జైలులో బాలయ్య బాబు వాళ్ళ అమ్మతో.   
  • Ø  “చావుకి సెంటిమీటర్ దూరం లో నువ్వు ఉన్నావు, సేన్తిమేన్తుకి కిలోమీటర్ దూరంలో నేను ఉన్నా...” ఒక విలన్ని నరికేసే ముందు – వద్దు చంపొద్దు అంటున్నప్పుడు బాలయ్య బాబు డవిలాగు.
  • Ø  “నువ్విలా బొద్దింకలా లా వంటింట్లో తిరుగుతూ ఉండు అది హాల్లో సీతా కోక చిలుకలా బావ వెనక తిరుగుతోంది” – ఇషా చావ్లా తో పార్వతి మెల్టన్ గురించి దువ్వాసి మోహన్.
  • Ø  Tempting అక్కడా (పార్వతి మెల్టన్ ని చూపించి)....vomiting ఇక్కడా (ఇషా చావ్లా ని చూసి) దువ్వాసి మోహన్ బాల కృష్ణ ని ఉద్దేశించి మనస్సులో అనుకునేది.

బ్రాహ్మణ పాత్రలని తిట్టడమే కామెడి అనుకునే దౌర్భాగ్య స్థితినించి మన తెలుగు సినిపరిశ్రమ ఎప్పుడూ బయటకు వస్తుందో తెలియదు కాని, అప్పటిదాకా మనం ఇలా భరించాల్సిందే. ఇంతకి ఇందులో ఏదైనా కామెడి చచ్చిందా అనుకుంటే అదీ లేదు.
మీరి ఈ సినిమాకి వెళ్ళాలో వద్దో మీరే తేల్చుకోండి, నన్ను అడిగి ఇబ్బంది పెట్టద్దు.