Friday, April 5, 2013

బాద్షా - తెలుగు సినిమా రివ్యూ


దూకుడు సినిమా ..దూకుడు తర్వాత శ్రీను వైట్ల తీసిన సినిమా “బాద్షా”.

ఈ సినిమా ఎదో చాకులా ఉంది అన్నారు, కొందరు కత్తి అన్నారు మరికొందరు తోపు అన్నారు...ఇంకొందరు తురుము...పుడింగ్ అన్నారు. ఈ రివ్యు రాసేటప్పటికి కూడా ప్రతి చానెల్లో, వార్తల్లోకూడా చాలా మంది అదే అంటున్నారు. మరి అంత మంది అలా అంటుంటే నేను మాత్రం “అబ్బే ఈ సినిమా ఎదో ఒక మాదిరిగా ఉంది” అంటే వాళ్ళంతా మీద పడి నన్ను పీకుతారేమో? అయినా పర్వాలేదు చెప్పేస్తాను..నాకైతే ఈ సినిమా చాలా సదా సీదా గా ఉన్న ఒక మాస్ - మూస సినిమాలా ఉంది. గట్టిగా మాట్లాడితే మన శీను గారు తీసిన ‘రెడీ’, దూకుడు’ లానే ఉంది కాస్త actors మారారేమో అంతే!

హీరో ఎంట్రీ మామూలుగా అనుకున్నట్టే ఉంది. ఆ గొలుసులు, గొళ్ళాలు, అవన్నీ ఎలా విరగ్గొట్టుకుని బంధన నించి వెలువడతాడో..మనకి అనవసరం కాని, తెరతియ్యగానే ఒక ఫైట్. అలా ప్రతి అయిదు నిమిషాలకి ఒక ఫైట్ ఉంటుంది మొదటి భాగం లో.  మనకి ఇంక చిరాకు వేసి లేచి బయటకి పోదామా అనుకునే లోపు అదృష్టవశాత్తు ఇంటర్వెల్ వచ్చేస్తుంది.

మొదటి భాగం లో చెప్పుకోవాల్సిన వి ముఖ్యంగా కాజల్...చాల refreshing గా కనబడుతుంది. అమాయకపు తెలివితేటల నటన బాగా చేసింది, కొన్ని ‘బంతి’ ఆధారిత డవిలాగులు బాగా పేలతాయి. వెన్నెల కిషోర్ సన్నివేశాలు కూడా పర్వాలేదు. 

అనుకున్నంత లేకపోయినా ఎదో ఉన్నంతలో ఎమ్మెస్ నారాయణ కూడా పర్వాలేదు అనిపించాడు. సినిమా రంగం లో తనకి నచ్చని  వాళ్ళ అందరి మీదా సెటైర్లు వేసాడు ఎమ్మెస్ పాత్ర ద్వారా...అసలు ఆ పాత్రే రాంగోపాల్ వర్మది. అలాగే దిల్ రాజు మీదా కొన్ని జోకులు ఉంటాయి. జూనియర్ కాస్త మీసం గెడ్డం, క్రాపు మార్చాడు కాని మిగతా తేడా ఏమి లేదు.

రెండో భాగం లో బ్రహ్మి వచ్చాక కాస్త జీవం వస్తుంది సినిమాకి. నాజర్ చాలా బాగా చేసాడు కామెడి. కాని అన్ని పాత్రలు రెడి సినిమా నించి, దుబాయ్ శీను సినిమా నించి, దూకుడు నించి వచ్చేస్తాయి. కొన్ని సన్నివేశాలు కూడా అచ్చు అలానే వచ్చేస్తాయి. చివర్లో మన జూనియర్ - సీనియర్ ఎన్టీఆర్ పాటలు కొన్నిటికి స్టెప్పులు వేస్తాడు, కాని అది అనుకున్నంత comedy ఎఫెక్ట్ రాలేదు అని నా అభిప్రాయం. సినిమా - అందులో సగం flashback , మళ్ళి సినిమా, మళ్ళి flashback...ఉన్నట్టుండి చివర్లో  మనవాడు పెద్ద పోలీస్ ఆఫీసర్ ..IPS ట.

పేరుకు చాలా మంది కళాకారులు ఉన్నారు ఇందులో..మహేష్ బాబు (వాయిస్ ఓవర్), నవదీప్, సిద్ధార్థ్, కెల్లి దోర్జీ, తనికెళ్ళ భరణి, చంద్రమోహన్, సుహాసిని, ఆశిష్ విద్యార్థి, ముకేష్ రిషి, ఎవరికీ ఒక పావు గంట పాత్ర లేదు.
ఇలాంటి సినిమాల్లో పెద్దగా కధ, కాకరకాయ అవి చూడకూడదు అని తెలుసు కాని, మరీ ఇంత ఎటకారంగా కూడా ఉండకూడదు కదండీ మరి?

తమన్ సంగీతం చాలా పేలవంగా ఉంది. అన్నిపాతల్లో స్టెప్పులు ఒక్కలాగానే ఉన్నాయి. ఆ “కనకం” పాట కాస్త పర్వాలేదు అనిపించినా...చిత్రీకరించిన తీరు మాత్రం దూకుడులో పార్వతి మెల్టన్ పాటని గుర్తు తెస్తుంది. నాకైతే మక్కి కి మక్కి అలానే అనిపించింది.

“Success breeds success” అని విన్నా కాని మరీ ఇలా success అయిన సినిమాలని ఇలా దింపేస్తారు అని అనుకోలేదు.

చెప్పాల్సింది చెప్పాను, చూసేది మానేది మీ ఇష్టం. (2/5)