Friday, February 20, 2015

వర్షం (2014) - మలయాళం సినిమా రివ్యూ.

వర్షం (2014)మలయాళం సినిమా
తారాగణం: మమ్మూట్టి, ఆశా శరత్, మమతా మోహన్ దాస్, T G రవి తదితరులు.
సంగీతం: బిజిబల్ ; ఎడిటింగ్: సాగర్ దాస్; సినిమాటోగ్రఫి: మనోజ్ పిళ్ళై;
దర్శకుడు: రంజిత్  శంకర్
మమ్ముట్టి ఒక అద్భుతమైన కళాకారుడు  అని విన్నాం...కొన్ని కొన్ని సినిమాల్లో  (కండుకొండేన్ కండుకొండేన్; స్వాతి కిరణం ఇత్యాది...) అతని ప్రతిభని చూసి కూడా ఉంటాం.

ఈ సినిమా వర్షం లో మాత్రం అతని నటన హిమాలయ శిఖరాలని తాకిందని నేను నిస్సందేహంగా చెప్పగలను. ఇందులో అతని నటన ‘ఎవరెస్ట్ శిఖరం’ అయితే..... అతని భార్య పాత్రలో నటించిన ఆశా శరత్  నటన ‘కాంచన్ జంగా పర్వత శిఖరం’ లా ఉందని చెప్పచ్చు. ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు.
సినిమా కధ క్లుప్తంగా:
వేణు (మమ్మూట్టి) అతని భార్య (ఆశా శరత్) వాళ్ళ ఒక్కగానొక్క కొడుకు ...ఇదీ వాళ్ళ చిన్న సంసారం. వీళ్ళది బాగా డబ్బున్న కుటుంబం. ఆ ఉన్న డబ్బుతో వేణు ఊళ్ళో ఒక ఫైనాన్సు వ్యాపారం నడుపుతూ ఉంటాడు. కొడుకు ని మెడిసిన్ లో చేర్పించాలని అతని ఉద్దేశం. వాళ్ళ అమ్మకి అందరి తల్లి తండ్రుల్లానే చుట్టుపక్కల వాళ్ళని  చూసి...కొడుకుకి గుర్రపు స్వారి, స్విమ్మింగ్, కరాటే...ఇలా  ఇంకేవేవో తాము చెయ్యలేనివి అన్ని కొడుక్కి  నేర్పించేయ్యాలని  ఉంటుంది. మమ్మూట్టి కి అతని కొడుకు అంటే బాగా ప్రేమ. వాళ్ళ అమ్మకి అంతే. మామూలు కుటుంబాల్లో ఉన్నట్టే చిన్న చిన్న కలహాలు, రుస రుసలు అన్ని ఉంటాయి వీళ్ళ జీవితాల్లో కూడా. అయినా సరే వల్ల జీవితం హాయిగా గడిచిపోతూ ఉంటుంది.
ఆ క్రమం లో  ఒకసారి పనివాడికి ఎదో డబ్బు ఊరికే ఇచ్చేసాడు అన్న మాట మీద మమ్మూట్టి కొడుకుని బాగా గదమాయిస్తాడు. ఆ రాత్రి తెల్లవారి లేవగానే చూసుకుంటే .........వీళ్ళ ఒక్కగానొక్క కొడుకు చనిపోయి కనబడతాడు. హాస్పిటల్...కి తీసుకువెళతారు కాని అక్కడ ప్రయోజనం శూన్యం. ఆత్మ హత్య అనేమో  అని అందరు అనుమాన పడతారు. కాని post మార్టం రిపోర్ట్ వల్ల అది హార్ట్ ఎటాక్ అని తెలుస్తుంది.
ఒక్కగానొక్క ఒక్క కొడుకుని పోగొట్టుకున్న ఆ విషాదం వల్ల ఆ తల్లి తండ్రుల జీవితాల్లో ఒక రకమైన నిస్సత్తువ, నిశ్శబ్దం, శూన్యం చోటు చేసుకుంటాయి. ఇద్దరికీ దేని మీద ఆశక్తి ఉండదు. జీవితం యాంత్రికమై పోతుంది. ఎందుకు బ్రతుకుతున్నారో తెలియని స్థితి లోకి వెళ్ళిపోతారు.
మధ్యలో కొన్ని రాజకీయ పరమైన గొడవలు, చికాకుకులు వీలని ఇబ్బంది పెడతాయి. ఒక స్థాయిలో మమ్మూట్టి కి గుండె సంబంధిత వ్యాధి ఉంది, బై పాస్ చెయ్యాలి అని చెబితే అతను ఒప్పుకోడు. ఇప్పుడు నేను బ్రతికి ఏమి చెయ్యాలి అని ఊరుకుంటాడు. తర్వాత తర్వాత కొన్ని అనుకోని సంఘటనలు మమ్మూట్టి ని తిరిగి జీవితం వైపుకి మళ్ళిస్థాయి. అతనిలో ఒక  బలమైన ఆశయం కోసం బ్రతకాలి  అన్న కోరిక అతనికి జీవితం మీద ఆశక్తి పెంచుతుంది. అతని భార్య కూడా మామూలు జీవితం లోకి రావడానికి ప్రత్నిస్తుంది.
చివరికి వాళ్ళు ఇద్దరూ............వాళ్లకి ఇష్టమైన పని పూర్తిచేయ్యడం లో సఫలమౌతారు.    
నటీ నటుల విశ్లేషణ:
మమ్మూట్టి ని అందరు ఎందుకు గొప్ప నటుడు అంటారో ఈ సినిమా చూస్తే మనకి కూడా బాగా అర్ధం అవుతుంది. కన్నకొడుకు చనిపోయిన సన్నివేశం లో అతను కనబరచిన నటన అసామాన్యం. మనిషిలో ఎక్కడా తొణుకుడు, అతి నటనా ప్రదర్శన, ఏడ్పులు పెడబొబ్బలు కనబడవు. ఒక్క ముఖ కవళికల తోనే మన గుండెల్ని పిండేసే నటన కనబరుస్తాడు.  అతని భార్య గా వేసిన ఆశా నటన కూడా అనితర సాధ్యం అనిపిస్తుంది. ఇంకా ఇలాంటి నటులు, దర్శకులు  ఉన్నారు కాబట్టే అక్కడో....... ఇక్కడో కొన్ని మంచి సినిమాలు వస్తునాయి అని అనిపిస్తుంది నాకు.
సినిమా మొత్తం మీద కేవలం 40-45% సన్నివేశాల్లోనే మనకి నేపధ్య సంగీతం వినపడుతుంది. మొత్తం సినిమాలో ఎక్కడ ఒక్క శబ్దం చెవులకి కఠోరంగా వినబడదు. సున్నితమైన సుతిమెత్తని డైలోగులు, voice modulation మరియు ఆహ్లాదకరమైన సంగీతం.
మా అతెలుగు సినిమా హీరోలు, నిర్మాతలు, దర్శకులు, ఇలాంటి సినిమాలు చూస్తే తెలుస్తింది. సినిమా అంటే తొడలు కొట్టుకోవడం, సుమోలు పేల్చుకోవడం మాత్రమే కాదు అని.
ఈ సినిమా మంచి మానవ సంబంధాల గురించి  తీసిన ఒక చక్కటి జీవన యాత్ర.
మీదగ్గిర 2.20 గంటల సమయం ఉంటె తప్పక చూడాల్సిన సినిమా. మలయాళం సినిమా అని బాధ పడక్కర్లేదు. భాష రావక్కర్లేదు మనకి, ఇంగ్లీష్ sub-titles ఉన్నాయి. సుబ్బరంగా follow అయిపోవచ్చు.
నా రేటింగ్: 4.50 / 5.00 

No comments:

Post a Comment