Friday, January 11, 2013

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తెలుగు సినిమా రివ్యూ


చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక ‘Socio fantasy’ సినిమా  చూసాను.  ఇలా ఫాంటసీ సినిమా అంటున్నా అని విస్తుపోతున్నారా? నిజమే. ఇందులో ఇప్పటి కాలం సినిమాల్లో వచ్చే ‘ధించ్చాక్ ధించ్చాక్ డప్పు బీట్లు, fights, అరుపులు, కేకలు, పగలు, కుట్రలు కుతంత్రాలు విలనీలు............ఏమి లేవాయే? ఆఖరికి కామెడికి మూసపోసినట్టు ఉండే బ్రహ్మానందం కాని ఎమ్మెస్ నారాయణ కాని లేరాయె? అయినా సరే శ్రీకాంత్ అడ్డాల సినిమా తీసేసాడు అదీ కూడా తెలుగు చిత్ర పరిశ్రమ లో ఉన్న ఇద్దరు అతిపెద్ద హీరోలతో. పోనీ ఊరికేనే తీసిపడేసాడా అనుకుంటే లేదే! అద్దిరి పోయేలా  తీసేసాడు. మనసుకు హాయిగా అనిపించిన సినిమా.
ఈ సినిమా మహేష్ బాబుది, వెంకటేష్ ది అనుకుంటే పొరపాటే.........నా ఉద్దేశం లో ఈ సినిమాలో మీకు అంతర్లీనం గా పూర్తిగా మన ‘రాజోలు పదహారణాల తెలుగమ్మాయి - అంజలి’ కనబడుతుంది. బహుశ అందుకే సినిమా పేరుకూడా ఆమె పాత్ర పేరుమీదే పెట్టారేమో? అంజలి నటించిన పాత్ర పేరు సీత. ఈ అమ్మాయి చాలా చాలా బాగా మంచి ఈజ్ తో నటించింది. సమంత మామూలే కొత్తగా ఏమి లేదు అలాగే నటించింది (అచ్చు దూకుడులో ఉన్నట్టే ఉంది).
పెద్దన్నయ్య గా వెంకటేష్  చాలా  బాగా నటించాడు. అతని చిన్న తమ్ముడిగా మహేష్ చాలా jovial గా నటించాడు. “పెద్దన్నయ్య చాలా అమాయకుడు అయితే చిన్నోడు మాటలతో బూర్లు అల్లేసే రకం”. ఇద్దరు అగ్రశ్రేణి కధా నాయకులకి ఉండాల్సిన ఇగోలు పోటీలు ఇందులో లేకుండా సాదా సీదాగా కధానుసారంగా డైలాగు లు ఉంటాయి, ఆ గొప్పదనం - హీరోలది, దర్శకుడిది. కధా పరంగా పెద్ద కదా ఏమి లేదు సినిమాలో చెప్పుకోడానికి. కధనం మాత్రం బావుంది.పాత్రల ప్రవర్తనకి పెద్దగా పొంతన .....  కారణాలు కనబడకపోయినా చూడ్డానికి చిత్రీకరణ చాలా బావుంది. కొన్ని కొన్ని చోట్ల శ్రీకాంత్ అడ్డాల డైలాగు లు చాల బాగా మంచి అర్ధవంతం గా ఉన్నాయి. నాకైతే ఆ డైలాగు లు కొన్ని  ఎప్పటికి రాసి పెట్టేసుకోవాలి అనిపించింది. (DVD రెలీస్ అయ్యాక కొనుక్కుని రాసుకుంటా- ఇప్పుడు గుర్తు లేవు సరిగ్గా).
వీళ్ళ ఇద్దరు హీరోల తల్లిగా జయసుధ చాలా బాగా ఉంది.తండ్రి గా ప్రకాష్ రాజ్. ఇలాంటివి ఎన్నో వేల పాత్రలు వేసి ఉంటాడు ఆయన. మురళి మోహన్, కోట శ్రీనివాసరావు, వేణు మాధవ్..........వీళ్ళంతా అతిధులు సినిమాలో. తనికెళ్ళ భరణి డి ఒక చిన్నతరహా పాత్ర...........ఆయన కూడా ఎన్నో వందల సార్లు అలాంటి వేషం  వేసి ఉంటాడు. రోహిణి హట్టంగడి వీళ్ళ బామ్మ.
సినిమాని ఇంకాస్త వేగంగా నడిపించి ఉండాల్సింది అనిపించింది. కొన్ని కొన్ని సన్నివేశాలు ముఖ్యంగా మహేష్ – వెంకటేష్ మధ్య ఉన్న ఎమోషనల్ సీన్లు కాస్త కావలసిన దానికన్నా ఎక్కువ సాగ తీశారా అనిపిస్తుంది (అయినా బాగానే ఉన్నాయి పర్వాలేదు). నాకైతే చివరిదాకా వెంకటేష్ కాని మహేష్ బాబు కాని బ్రతుకు తెరువు కోసం ఎంచేస్తుంటారో తెలియలేదు.
భద్రాచలం లో ప్రకాష్ రాజ్ శ్రీరాముల వారి ఉత్సవ విగ్రహాల పల్లకి మోసినప్పుడు నాకైతే కళ్ళమ్మట నీళ్లోచ్చాయి. ఆ సన్నివేశాన్ని చాలా బాగా తీసాడు దర్శకుడు.
పాటలు అన్ని చాలా చాలా బాగా తీసారు. మిక్కి J మేయర్ పాటలు అందించారు. మణిశర్మ back ground score అందించారు. rerecording చాలా వీనుల విందైన సంగీతం తో ఉంటుంది.
నాకైతే సినిమా అంతా అంజలి నటన కనబడింది. ఆమె indirect  గా మహేష్ ని వెంకటేష్ ని కూడా కవర్ చేసేసింది అంటే అతిశయోక్తి కాదేమో?[నా వ్యాఖ్య కొంతమందికి కాస్త ఎగష్ట్రా గా అనిపించినా ప్లీజ్ సర్దుకుపొండి]. దర్శకుడు కొత్త బంగారులోకం లో 'ఎకడా' అని హీరోయిన్ తో పలికిన్చినట్టు ఇందులో అంజలి చేత...అస్తమాను "ఏమో బాబు నాకు అన్ని అలా తెలిసిపోతుంటాయి అంతే" అని ఒక విచిత్రమైన గోదావరి యాసలో చెప్పిస్తాడు. ఇంతకి చెప్పడం మర్చిపోయా...సినిమా అంతా మా గోదావరి జిల్లాల్లోనే తీసారు మాటా యాసా అక్కడిదే కూడా.

మరీ సూపర్ డూపర్ హిట్టు 100 కోట్ల కలెక్షన్ అని చెప్పను కాని ఖచ్చితంగా చాలా ఏళ్ల తర్వాత వచ్చిన ఒక మంచి ఆహ్లాదకరమైన సినిమా అని ఘంటా పధంగా చెప్పగలను. కుటుంబం లో అందరు అంటే భార్యా భర్తా, పిల్లా పీచూ, బామ్మా - తాతా అంతా కలిసికట్టుగా వెళ్లి చూసి రావాల్సిన సినిమా............నిజంగా సంక్రాంతి కుటుంబ చిత్రం. (ఇప్పుడే నా Facebook లో ఒక ఫ్రెండ్ అన్నట్టు ఇది నిజంగా సినిమాకి వెళ్లి వచ్చినట్టు లేదు అలా మన పక్కింట్లోకి కాస్సేపు వెళ్లి కూర్చుని వచ్చినట్టు అనిపించింది) 

Rating 3.75/5  

12 comments:

  1. మీరు చెప్పిన దానికి నేను నూరు శాతం వొప్పుకుంటున్నాను. కాని ఎందుకనో జనాల్లో చాలమందికి ఎక్కలేదు ఈ సినిమా. ఈ సాయంకాలం నేను ఈ సినిమా చూసి బైటికి వస్తూ ఉంటే నాకు తెలిసిన ఆవిడ (మా గుడికి రెగ్యులర్ గా వచ్చే భక్తురాలు)...అంతమందిలో నన్ను చూసి గుర్తుపట్టి..."పంతులుగారు సినిమా ఎలా ఉంది అండి?" అని అడిగింది.సినిమాకేమ్మా బావుంది కదా. నాకు తెగ నచ్చేసింది అని చెప్పాను. దానికావిడ "ఎమో పంతులుగారు మహేష్ బాబు సినిమా కదా అని ఎన్నో ఊహించుకుని వచ్చాను...ఎమి లేవు...చాలా డిసప్పాయింట్ అయ్యాను" అంది. ఆ మూసలోంచి ఎప్పుడు బైటికొస్తారో ఎమో.

    ReplyDelete
  2. అవునండి భార్గవ గారు ముమ్మాటికి నిజం.

    ReplyDelete
  3. ఒక్క మాటలో చెప్పాలంటె, మళ్ళీ మళ్ళీ విడుదలకు నోచుకునే సినిమా ఒకటి తెలుగులో వచ్చిందన్నమాట.

    ReplyDelete
    Replies
    1. చెప్పలేము శివరామప్రసాద్ గారు, it may be a bit early to come to that conclusion. ఒక ఫ్రెండ్ చెప్పాడు 'మహేష్ బాబు సినిమా అనుకుని వెళ్ళాము, అయ్యో అలా లేదు" అని ఒకావిడ అన్నారుట..... ఇదీ మన వరస.

      Delete
  4. జనానికి తామసిక తిండి ,తామ్సిక ఆలోచనలు పెరగటం వలన ఇలాంటీ సాత్విక కథలు, చక్కని కుటుంబబంధాలు నచ్చవు. అమ్దరికీ కాదనుకోండి .ఎక్కువమంది పరిస్థితి ఇలాఉంది మరి

    ReplyDelete
    Replies
    1. చూడగా చూడగా.........అలాగే అనిపిస్తోంది దుర్గేశ్వర్ గారు

      Delete
  5. ఈ సినిమా చూశాను. చాలా రోజుల తరువాత వచ్చిన మంచి సినిమా ఇది. మీ రివ్యూ బాగుంది. అంజలి నటన హైలెట్ అంటే ప్రకాష్ రాజ్ నటన బాగోలేదా? మరొకరి నటన బాగోలేదా? అనుకోవాల్నా? అనిపించేంతగా అన్ని పాత్రలు బాగా నటించారు. మహేష్ - వెంకటేష్ లను అభినందించాలి. మంచి సంప్రదాయానికి బాట చూపినందుకు. తెలుగు హీరోయిన్లను కావాలనే ప్రోత్సహించడం లేదన్న విషయం అంజలి సింప్లీ సుపర్బ్ నటన తెలియజేస్తుంది. ఎక్కడా బోర్ కొట్టలేదు. కానీ ఏదో అసంతృప్తి ఉంది. దర్శకుడుకి ఇంకొంచెం అనుభవం ఉండాలనిపించింది ఇలాంటి వేల్యుబుల్ సబ్జెక్ట్ తీయడానికి. మంచి వ్యక్తిత్వం - మంచి కుటుంబం ద్వారా మంచి సమాజం ఉంటుందన్న సందేశం బాగుంది. కేవేలం ఏం చేస్తున్నారు? ఎంత సంపాదిస్తున్నారు? అనేదే గొప్పగా చూపుతున్నారనేది వెంకటేష్ - రావు రమేష్ పాత్రల ద్వారా చూపించి , ఇతరులకు సాయపడడమే అన్నింటికీ మించిన గొప్ప పని అని ప్రకాష్ రాజ్ పాత్ర ద్వారా చూపించారు. ఇంకా బాగా చూపితే బాగుండేది అనిపించింది.

    ReplyDelete
    Replies
    1. Kondalarao garu, I can not agree more than what you have added. You are 100% correct Sir. In my opinion editing could have been little more crisper

      Delete
  6. నాకు బాగ నచ్చింది

    ముఖ్యంగా ప్రకాష్ మరియు రావు రామేష్ నటన బాగుంది
    గుడి లొ మురళి మోహన్ తో పరిచయం సంభాషణలు.........మరియు బద్రాద్రి లొ మహేష్ ,వెంకటెష్ తో సంభాషణలు గుర్తు పెట్టుకొనేల వున్నాయి

    ReplyDelete
    Replies
    1. అవును సూర్య గారు నాకు చాలా సన్నివేశాల్లో సంభాషణలు నచ్చేసాయి.

      Delete
  7. hahahah.......great andi meeru naaku asalu nachhaledu.........anjali acting chaala artificial anipinchindi..may be migatavaallu(heroines) aa maatramu kooda cheyaru kaabatti andariki ala anipinchindemonani nenu anukuntunnanu.

    ReplyDelete
    Replies
    1. @Vinay garu, ఎదో పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అండి.......ఈ సారికి ఇలా కానిచ్చేద్దాం.......

      Delete