Friday, June 15, 2012

ఎవరికీ చెప్పద్దు


మా మేన మామ గారి అబ్బాయి, పేరెందుకు లెండి ఇప్పుడు. వాడి చిన్నప్పుడు చాలా అమాయకంగా బాగా ముద్దోస్తూ ఉండేవాడు. నేను చెప్పే ఈ విషయం అప్పుడు - వాడికి బహుశా ఒక అయిదారేళ్ళుప్పుడు అవ్వచ్చు.

మేమందరం తిరపతి వెళ్ళాము - శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి. అప్పుడు మా అందరితో పాటు వాడికి కూడా గుండు కొట్టిద్దాము అని సర్వ జనులు తీర్మానించేశారు. అప్పటి మా లో (అంటే నాకు, వాడి నాన్నకి) కొందరికి గుండు కొట్టే కార్యక్రమం పూర్తయ్యింది. అంతే వాడు మమ్మల్ని చూసి ఝడుసుకున్నాడు. 'అయ్యబాబోయ్ గుండు అంటే ఇలా ఉంటుందా అని'. వెంటనే వాడు తన ఒప్పందాన్ని రద్దు చేసేసాడు. "నేను గుండు చేయించుకోను అంతే!". మేమందరం  "అదేంటి ఉన్నట్టుండి ఇలా మాట మార్చేస్తే ఎలా? తప్పు కదా? పాపం వస్తుంది అదీ అని కోప్పడేసాము". అప్పుడు వాడు నెమ్మదిగా చెప్పాడు, గుడు చేయించుకుంటే బాగోదు,స్కూల్లో అందరు వాడిని చూసి నవ్వుతారు అని, వాడి క్లాసులో అమ్మాయిలు కూడా ఉన్నారు లెండి.

చివరికి నేను వాడికి ఒక సలహా ఇచ్చాను. "సరే ఒరేయ్,అమ్మా వాళ్ళు చెప్పినట్టు నా మాట విని గుండుచేయించుకో, పుణ్యం వస్తుంది, దేముడు మెచ్చుకుంటాడు కూడా. ఇంక స్కూల్లో సంగతి అంటావా? నువ్వు గుండు చేయిన్చుకున్నట్టు ఎవరికీ చెప్పకు అంతే!! ఇంక ఎలా తెలుస్తుంది? ఓకే నా?"

కాస్సేపు బాగా ఆలోచించాడు, నా మాట బాగానే అనిపించింది వాడికి , " సరే అలా అయితే గుండు చేయించుకుంటా కాని మీరు కూడా ఎవరితో చెప్పకూడదు" అని అందరికి ఒక షరతు పెట్టాడు. వచ్చే నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ అందరం వోప్పేసుకున్నాం.

తర్వాత క్షవర కళ్యాణం విజయవంతంగా పూర్తయ్యింది వాడికి.

కుర్రాడు ఇప్పుడు అమెరికా పౌరుడు.

5 comments: