ముళ్ళపూడి వెంకట రమణ గారి బుడుగు పుస్తకం చదువుతున్నంత సేపు, లేదా
గుర్తుకొచ్చినప్పుడల్లా ఒక్కసారి నేనే ఆ బుడుగుని ఏమో !! అనుకునేసే వాడిని. దానికి
కారణం నేను కాని నా గొప్పతనం లేదా నా అల్లరితనం
మాత్రం కానే కాదు. బుడుగు లాగే అన్నిటికి నన్ను సపోర్ట్ చేసే మా బామ్మ.
బహుశా నా తరం వాళ్ళ అందరి బాల్యం అలానే గడిచి ఉంటుందని నా విశ్వాసం. ఆ
రోజుల్లో బామ్మలు వాళ్ళ మనవలకి, మనవరాళ్ళకి అవ్యక్తానురాగామైన ప్రేమని, ఆప్యాయతని
పంచి ఇచ్చేవారు. ఏది ఏమైనా కాని బామ్మల చేత తిట్లు తిన్న ఒక్క మనవడు లేదా మనవరాలు
ఉండేవారని నేను అనుకోను. అలాగే బామ్మలంటే ఇష్టపడని మనవలు ఆ రోజుల్లో ఉండి ఉంటారని
నేను అనుకోను. ఆ కాలం బామ్మలకి తమ మనవలు ఏది చేసినా గొప్పే!! ఏదీ చెయ్యకపోయినా ఇంకా గొప్పే!! ప్రతీ బామ్మకి
వాళ్ళ మనవలు – కలకటేరులు, రాజా మహారాజాలు. తల్లి తండ్రుల నించి ఎన్ని తిట్లు
తన్నులు తిన్నా మనవలు వెళ్లి సేదతీరేది బామ్మ వొళ్లోనే, బామ్మ చీర చెంగులోనే!!
మేము నేర్చుకున్న పురాణేతిహాసాలు, కధలు, కాకరకాయలు ఒక్కటేమిటి అన్నిటిని నేర్పిన
పెద్ద బాల శిక్ష మా బామ్మే!! బహుశః నాకు అసలు దేముడి గురించి పరిచయం చేసి
చెప్పింది కూడా మా బామ్మే అనుకుంటా!!
చిన్నప్పుడు పొద్దున్న లేవగానే తెల్లవారగట్ల నాలుగున్నరకి లేచి పారిజాతం
పువ్వులు తెచ్చి బామ్మకి ఇవ్వడం. అవి ఇవ్వగానే ఆవిడ “హబ్బా!! మా రావు బంగారుతండ్రే“
అని మెచ్చుకుని ముద్దుపెట్టుకోగానే – అదేదో ఎవరెష్టు ఎక్కిన ఫీలింగ్ కలిగేది. ఆ
మెప్పుకోసం అ ఆవిడ కళ్ళల్లో మెరుపుకోసం ప్రతీ నిత్యం క్రమం తప్పకుండా ఆవిడకి
కావాల్సిన పనులు చెయ్యడం, ఆవిడకి నచ్చే పనులు చెయ్యడం ఒక దిన చర్య లా మారి పోయింది.
ఏదైనా పండగ వస్తే చాలు తెల్లారగట్లే లేపేసి నిద్రమత్తులోనే మాకు తల మీద చమురు
పెట్టేసి “నీ అత్త కడుపు చల్లగా – అమ్మ కడుపు చల్లగా” అని ఆవిడ మనసులోనే
ఆశీర్వదించేసుకునేది. ముందు తలంటు పోసేసుకో తర్వాత కావాలంటే మిగతా పని చేసుకో
(అంటే మొహం కడుక్కోడం, తినడం ఇత్యాది), తర్వాత ఇంట్లో పెద్ద వాళ్ళు లేచిపోతే నీకు వేన్నీళ్ళు దొరకడం కష్టం, అలీసెం
అయిపోతుంది అనేది.
మినపరోట్టి, కొయ్య రొట్టి, సున్నుండలు, అరిసెలు, చేగోడీలు, బూరెలు, బొబ్బట్లు,
ప్రతీ శుక్రవారం (సుక్కురారం అనేది) అన్నం పరవన్నం,పులిహోర, దద్దోజనం, కొబ్బరి
లస్కోరా ...ఇలాంటి అన్ని వంటలను నాకు పరిచయం చేసింది మా బామ్మే!!
ఆ రోజుల్లో ప్రతీ రోజు ఉదయం బామ్మ చెయ్యి పట్టుకుని పొద్దున్నే గోదారి
స్నానికి వెళ్లి వాడిని. స్నానం చేసి పక్కనే ఉన్న శివాలయం లో ఒక ప్రదక్షిణ -
శివుడి దర్శనం. ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుని చద్ది అన్నం తినేసి స్కూల్ కి. ఇది
రివాజు గా జరిగేది. గోదారికి, గుడికి భక్తి తో కంటే సరదాగా ఉత్సాహంగా ‘బామ్మతో
వెళ్తున్నా’ అన్న ఫీలింగ్ తో వెళ్ళే వాడిని.
మధ్యాన్నాలు మళ్ళి చిరుతిళ్ళు రెడీ చేసేది, చల్ల పుణుకులు, బజ్జీలు గట్రా!!
సాయంత్రం మళ్ళి బామ్మ చెయ్యి పట్టుకుని గుడికి రెడీ అయిపోయేవాడిని. గుడిలో
రోజూ పురాణ శ్రవణం వినే వాళ్ళం. అందులో ఉన్న విషయాలు మళ్ళి ఇంటికి వచ్చాకా నాకు అర్ధం అయ్యే భాషలో కధల రూపంలో
చెప్పేది. అలా వింటూ బామ్మని పట్టుకుని నిద్రలోకి జారిపోయే వాడిని. నాకు జ్ఞాపకం
ఉన్నంత వరకు ఆవిడ చివరి శ్వాశ తీసుకునే దాకా ఆవిడ ప్రతీ ఏకాదశి రోజున, ప్రతీ
శివరాత్రి రోజునా ఉపవాసం ఉండేది. మేము కూడా ఉత్సాహంగా ఉపవాసం ఉంటాం అని మొదలు
పెడితే అలానే అని ఒప్పుకుని, మధ్యాన్నం అవ్వగానే మాకు పులిహోర చేసి ‘ప్రసాదం - తినెయ్’
అనేది. “అయ్యో ఉపవాసం కదా? ఎలా తినడం?” అని అడిగితే.. “పర్వాలేదు పసుపు వేసాను కదా
పులిహోరలో శుద్ధి, తప్పులేదు ఇది దేవుడి ప్రసాదం తో సమానం” అని మా చేత
తినిపించేసేది. (అసలు విషయం మేము ఉపవాసం పేరుతో ఎక్కడ కడుపు మాడ్చుకుంటామో అన్న బెంగ
ఆవిడకి)
మేము పెద్దవాళ్ళం అయిపోయాం, చదువులు అయిపోయాయి, ఉద్యోగాలు వచ్చేసాయి, ఆఖరుకి
పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. కాని మా బామ్మ మాత్రం మారలేదు. అలానే ఉండేది, అదే
ఆప్యాయతా, అదే ప్రేమా, అదే పిచ్చి నమ్మకం – ‘మా రావు బంగారు తండ్రి’. ఆవిడ గొప్పతనం
ఏమిటి అంటే నా మీద ఎంత ప్రేమా, ఆప్యాయతా చూపించేదో అదే ప్రేమా, ఆప్యాయతా నా భార్య
మీదా కూడా చూపించేది. మా పెద్దమ్మాయి పుట్టినప్పుడు నా భార్య ఇంకా అప్పుడు
ఆస్పత్రిలోనే ఉంది. డెలివరి వచ్చి ఇంకా అయిదు రోజులు కూడా కాలేదు కామోసు, బామ్మ
ఆస్పత్రికి వచ్చి చీర చెంగులో దాచిపెట్టుకున్న ఒక ఆపిల్ పండు, ఇంకేవో కాస్త
తినుబండారాలు సీక్రెట్ గా నా భార్య చేతిలో పెట్టి “ఇవి తినీ పర్వాలేదు ఏమి కాదులే,
చాలా పురుళ్ళు పోసాను నేను - నాకు బాగా తెలుసు, డాక్టర్లు వాళ్ళ మొహం అలానే
అంటారులే”. మా బామ్మ నాకు ఇష్టం ఎప్పటికి గుర్తుండిపోతుంది, అదేమీ పెద్ద విషయం
కాదు. కాని నా భార్య కి కూడా మా బామ్మ బాగా బాగా గుర్తు ఉంది బాగా ఇష్టం కూడాను.
అది మా బామ్మ గొప్పతనం నా భార్య మంచితనం అనుకుంటాను నేను.
ఈ రోజుల్లో ఎంత మంది మోడరన్ బామ్మలు మా బామ్మలా ఉన్నారు? ప్రతీ బామ్మ వాళ్ళ
మనవలని విమర్శించడం, వెటకరించడం, దేప్పిపొడవడం ఇవే చూస్తున్నా!! బామ్మలు ఆ
రోజుల్లో కంటే ఈ రోజుల్లో మరీ అవసరం మన పిల్లలకి అని నా గట్టి నమ్మకం. తల్లి
తండ్రుల వల్ల pressure, స్కూల్లో pressure, కెరీర్ pressure, peer pressure, ఇన్ని
pressure ల మధ్య బామ్మ అన్న ఒక నిజాయితీ ప్రేమ లేకపోవడం వల్లనే ఈ రోజుల్లో పిల్లలు
అలా తయారవుతున్నారు అని నా అభిప్రాయం.
బామ్మ ప్రేమలో నిజాయితీ ఉంటుంది, ప్రతిఫలాపేక్ష ఉండేది కాదు. ఈ కాలం లో చాలా
మంది తల్లి తండ్రులే అంటుంటారు వాళ్ళ పిల్లలతో “మీకు చాలా చేసాం, అది చేసాం ఇది
చేసాం ...మా పట్ల మీరు కృతజ్ఞతా భావం తో ఉండాలి” అని. జీవితాన్ని నిస్స్వార్ధంగా సర్వంధారపోసాకా కూడా ఏనాడూ బామ్మ నోట ఆమాట నేను ఎప్పుడూ
వినలేదు. ఆవిడ ఋణం తీర్చుకోవాలి అని నాకు ఎన్నడూ తట్టలేదు, ఆవిడ ఎప్పుడూ ఆ కోణం లో మాట్లాడలేదు కూడా !!!
|
ఏమిచ్చినా సరే ఈ నిస్స్వార్ధ జీవి ఋణం తీర్చుకోగలనా? |
ఎందుకో ఇవాళ పొద్దున్నే లేవగానే బామ్మ గుర్తొచ్చి ఇదంతా రాసేసాను. మా బామ్మ
లేట్. బాలాంత్రపు మాణిక్యాంబ గారు (బామ్మ అంటే ఇక్కడ ఆవిడ మా మాతామహులు లేట్.
దేవగుప్తాపు శ్రీరామమూర్తి గారి చెల్లెలు)