Showing posts with label childhood memories. Show all posts
Showing posts with label childhood memories. Show all posts

Thursday, February 6, 2014

మా బామ్మ - నా జ్ఞాపకాలు


ముళ్ళపూడి వెంకట రమణ గారి బుడుగు పుస్తకం చదువుతున్నంత సేపు, లేదా గుర్తుకొచ్చినప్పుడల్లా ఒక్కసారి నేనే ఆ బుడుగుని ఏమో !! అనుకునేసే వాడిని. దానికి కారణం నేను కాని నా  గొప్పతనం లేదా నా అల్లరితనం మాత్రం కానే కాదు. బుడుగు లాగే అన్నిటికి నన్ను సపోర్ట్ చేసే మా బామ్మ.
బహుశా నా తరం వాళ్ళ అందరి బాల్యం అలానే గడిచి ఉంటుందని నా విశ్వాసం. ఆ రోజుల్లో బామ్మలు వాళ్ళ మనవలకి, మనవరాళ్ళకి అవ్యక్తానురాగామైన ప్రేమని, ఆప్యాయతని పంచి ఇచ్చేవారు. ఏది ఏమైనా కాని బామ్మల చేత తిట్లు తిన్న ఒక్క మనవడు లేదా మనవరాలు ఉండేవారని నేను అనుకోను. అలాగే బామ్మలంటే ఇష్టపడని మనవలు ఆ రోజుల్లో ఉండి ఉంటారని నేను అనుకోను. ఆ కాలం బామ్మలకి తమ మనవలు ఏది చేసినా గొప్పే!!  ఏదీ చెయ్యకపోయినా ఇంకా గొప్పే!! ప్రతీ బామ్మకి వాళ్ళ మనవలు – కలకటేరులు, రాజా మహారాజాలు. తల్లి తండ్రుల నించి ఎన్ని తిట్లు తన్నులు తిన్నా మనవలు వెళ్లి సేదతీరేది బామ్మ వొళ్లోనే, బామ్మ చీర చెంగులోనే!! మేము నేర్చుకున్న పురాణేతిహాసాలు, కధలు, కాకరకాయలు ఒక్కటేమిటి అన్నిటిని నేర్పిన పెద్ద బాల శిక్ష మా బామ్మే!! బహుశః నాకు అసలు దేముడి గురించి పరిచయం చేసి చెప్పింది కూడా మా బామ్మే అనుకుంటా!!
చిన్నప్పుడు పొద్దున్న లేవగానే తెల్లవారగట్ల నాలుగున్నరకి లేచి పారిజాతం పువ్వులు తెచ్చి బామ్మకి ఇవ్వడం. అవి ఇవ్వగానే ఆవిడ “హబ్బా!! మా రావు బంగారుతండ్రే“ అని మెచ్చుకుని ముద్దుపెట్టుకోగానే – అదేదో ఎవరెష్టు ఎక్కిన ఫీలింగ్ కలిగేది. ఆ మెప్పుకోసం అ ఆవిడ కళ్ళల్లో మెరుపుకోసం ప్రతీ నిత్యం క్రమం తప్పకుండా ఆవిడకి కావాల్సిన పనులు చెయ్యడం, ఆవిడకి నచ్చే పనులు చెయ్యడం ఒక దిన చర్య లా మారి పోయింది.
ఏదైనా పండగ వస్తే చాలు తెల్లారగట్లే లేపేసి నిద్రమత్తులోనే మాకు తల మీద చమురు పెట్టేసి “నీ అత్త కడుపు చల్లగా – అమ్మ కడుపు చల్లగా” అని ఆవిడ మనసులోనే ఆశీర్వదించేసుకునేది. ముందు తలంటు పోసేసుకో తర్వాత కావాలంటే మిగతా పని చేసుకో (అంటే మొహం కడుక్కోడం, తినడం ఇత్యాది), తర్వాత ఇంట్లో పెద్ద వాళ్ళు  లేచిపోతే నీకు వేన్నీళ్ళు దొరకడం కష్టం, అలీసెం అయిపోతుంది అనేది.
మినపరోట్టి, కొయ్య రొట్టి, సున్నుండలు, అరిసెలు, చేగోడీలు, బూరెలు, బొబ్బట్లు, ప్రతీ శుక్రవారం (సుక్కురారం అనేది) అన్నం పరవన్నం,పులిహోర, దద్దోజనం, కొబ్బరి లస్కోరా ...ఇలాంటి అన్ని వంటలను నాకు పరిచయం చేసింది మా బామ్మే!!
ఆ రోజుల్లో ప్రతీ రోజు ఉదయం బామ్మ చెయ్యి పట్టుకుని పొద్దున్నే గోదారి స్నానికి వెళ్లి వాడిని. స్నానం చేసి పక్కనే ఉన్న శివాలయం లో ఒక ప్రదక్షిణ - శివుడి దర్శనం. ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుని చద్ది అన్నం తినేసి స్కూల్ కి. ఇది రివాజు గా జరిగేది. గోదారికి, గుడికి భక్తి తో కంటే సరదాగా ఉత్సాహంగా ‘బామ్మతో వెళ్తున్నా’ అన్న ఫీలింగ్ తో వెళ్ళే వాడిని.
మధ్యాన్నాలు మళ్ళి చిరుతిళ్ళు రెడీ చేసేది, చల్ల పుణుకులు, బజ్జీలు గట్రా!!
సాయంత్రం మళ్ళి బామ్మ చెయ్యి పట్టుకుని గుడికి రెడీ అయిపోయేవాడిని. గుడిలో రోజూ పురాణ శ్రవణం వినే వాళ్ళం. అందులో ఉన్న విషయాలు మళ్ళి  ఇంటికి వచ్చాకా నాకు అర్ధం అయ్యే భాషలో కధల రూపంలో చెప్పేది. అలా వింటూ బామ్మని పట్టుకుని నిద్రలోకి జారిపోయే వాడిని. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఆవిడ చివరి శ్వాశ తీసుకునే దాకా ఆవిడ ప్రతీ ఏకాదశి రోజున, ప్రతీ శివరాత్రి రోజునా ఉపవాసం ఉండేది. మేము కూడా ఉత్సాహంగా ఉపవాసం ఉంటాం అని మొదలు పెడితే అలానే అని ఒప్పుకుని, మధ్యాన్నం అవ్వగానే మాకు పులిహోర చేసి ‘ప్రసాదం - తినెయ్’ అనేది. “అయ్యో ఉపవాసం కదా? ఎలా తినడం?” అని  అడిగితే.. “పర్వాలేదు పసుపు వేసాను కదా పులిహోరలో శుద్ధి, తప్పులేదు ఇది దేవుడి ప్రసాదం తో సమానం” అని మా చేత తినిపించేసేది. (అసలు విషయం మేము ఉపవాసం పేరుతో ఎక్కడ కడుపు మాడ్చుకుంటామో అన్న బెంగ ఆవిడకి)
మేము పెద్దవాళ్ళం అయిపోయాం, చదువులు అయిపోయాయి, ఉద్యోగాలు వచ్చేసాయి, ఆఖరుకి పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. కాని మా బామ్మ మాత్రం మారలేదు. అలానే ఉండేది, అదే ఆప్యాయతా, అదే ప్రేమా, అదే పిచ్చి నమ్మకం – ‘మా రావు బంగారు తండ్రి’. ఆవిడ గొప్పతనం ఏమిటి అంటే నా మీద ఎంత ప్రేమా, ఆప్యాయతా చూపించేదో అదే ప్రేమా, ఆప్యాయతా నా భార్య మీదా కూడా చూపించేది. మా పెద్దమ్మాయి పుట్టినప్పుడు నా భార్య ఇంకా అప్పుడు ఆస్పత్రిలోనే ఉంది. డెలివరి వచ్చి ఇంకా అయిదు రోజులు కూడా కాలేదు కామోసు, బామ్మ ఆస్పత్రికి వచ్చి చీర చెంగులో దాచిపెట్టుకున్న ఒక ఆపిల్ పండు, ఇంకేవో కాస్త తినుబండారాలు సీక్రెట్ గా నా భార్య చేతిలో పెట్టి “ఇవి తినీ పర్వాలేదు ఏమి కాదులే, చాలా పురుళ్ళు పోసాను నేను - నాకు బాగా తెలుసు, డాక్టర్లు వాళ్ళ మొహం అలానే అంటారులే”. మా బామ్మ నాకు ఇష్టం ఎప్పటికి గుర్తుండిపోతుంది, అదేమీ పెద్ద విషయం కాదు. కాని నా భార్య కి కూడా మా బామ్మ బాగా బాగా గుర్తు ఉంది బాగా ఇష్టం కూడాను. అది మా బామ్మ గొప్పతనం నా భార్య మంచితనం అనుకుంటాను నేను.
ఈ రోజుల్లో ఎంత మంది మోడరన్ బామ్మలు మా బామ్మలా ఉన్నారు? ప్రతీ బామ్మ వాళ్ళ మనవలని విమర్శించడం, వెటకరించడం, దేప్పిపొడవడం ఇవే చూస్తున్నా!! బామ్మలు ఆ రోజుల్లో కంటే ఈ రోజుల్లో మరీ అవసరం మన పిల్లలకి అని నా గట్టి నమ్మకం. తల్లి తండ్రుల వల్ల pressure, స్కూల్లో pressure, కెరీర్ pressure, peer pressure, ఇన్ని pressure ల మధ్య బామ్మ అన్న ఒక నిజాయితీ ప్రేమ లేకపోవడం వల్లనే ఈ రోజుల్లో పిల్లలు అలా తయారవుతున్నారు అని నా అభిప్రాయం.
బామ్మ ప్రేమలో నిజాయితీ ఉంటుంది, ప్రతిఫలాపేక్ష ఉండేది కాదు. ఈ కాలం లో చాలా మంది తల్లి తండ్రులే అంటుంటారు వాళ్ళ పిల్లలతో “మీకు చాలా చేసాం, అది చేసాం ఇది చేసాం ...మా పట్ల మీరు కృతజ్ఞతా భావం తో ఉండాలి” అని.  జీవితాన్ని నిస్స్వార్ధంగా సర్వంధారపోసాకా  కూడా ఏనాడూ బామ్మ నోట ఆమాట నేను ఎప్పుడూ వినలేదు. ఆవిడ ఋణం తీర్చుకోవాలి అని నాకు ఎన్నడూ తట్టలేదు, ఆవిడ ఎప్పుడూ ఆ కోణం లో మాట్లాడలేదు కూడా !!!
ఏమిచ్చినా సరే ఈ నిస్స్వార్ధ జీవి ఋణం తీర్చుకోగలనా?


ఎందుకో ఇవాళ పొద్దున్నే లేవగానే బామ్మ గుర్తొచ్చి ఇదంతా రాసేసాను. మా బామ్మ లేట్. బాలాంత్రపు మాణిక్యాంబ గారు (బామ్మ అంటే ఇక్కడ ఆవిడ మా మాతామహులు లేట్. దేవగుప్తాపు శ్రీరామమూర్తి గారి చెల్లెలు)

Friday, October 5, 2012

Facebook wall - మా ఇంట్లో గోడమీద ఫోటోలు


మా చిన్నప్పుడు అమ్మమ్మ గారు, తాతగారి ఇంట్లో పెరిగాను. ఇప్పుడు కూర్చుని ఆలోచిస్తుంటే ఒక విషయం జ్ఞాపకం వస్తోంది....... ఇప్పుడైతే ఫేస్ బుక్కులు అవీ వచ్చి, walls మీద ఫోటోలు పెట్టుకోడం మనం మనం చూసుకోడం అదీను వచ్చింది ....... కాని ఆ రోజుల్లోనే మా ఇంట్లో గోడ మీద వరసగా మావాళ్ళ వి ఫోటోలు చాల ఉండేవి. అన్ని ఫోటోలు పెద్ద పెద్ద ఫ్రేం లో కట్టించి చక్కగా అన్ని ఒకే సైజులో ఉండేలా చూసి..అన్నిటికి వరసగా ఎగుడు దిగుడులు లేకుండా ఉండేలా ఉండడం కోసం ఒక బేస్ లైన్ లా ఒక చెక్క బద్దలాంటిది గోడమీద కొట్టి వాటిమీద ఈ ఫోటో ఫ్రేములని  వరసగా కూర్చోపెట్టేవారు.
ఇంట్లోకి అడుగు పెడుతూనే ఎదురుగా మొదటి గదిలో పద్మావతిసమేత కళ్యాణ శ్రీనివాసుడు గోడమీద ఫోటో రూపం లో దర్శనం ఇచ్చేవారు. ఈ మధ్య నేను ఎక్కువగా వింటున్నా ...వేంకటేశ్వరుడు మన ఇంట్లోంచి వీధి గుమ్మం చూడకూడదు మంచిది కాదు అని....మరి అ రోజుల్లో మా తాతగారు చాలా బాగా Rich గా బ్రతికారు. ఆయన సకల ఐశ్వర్యాలని అనుభవించారు - మరి ఆయన ఆ ఇంట్లో ఉన్నన్నినాళ్ళు వేంకటేశ్వరుడు వీదిగుమ్మం వేపే చూసేవాడు మరి. “ఆ మంచిది కాదు అన్న సెంటిమెంట్ ఆయనకి మరి ఎందుకో అడ్డు రాలేదు”. అంటే ఆయన కృషీవలుడు కూడాను, కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి..అలాంటి వాళ్ళ ముందు బహుశా ఈ నమ్మకాలు కూడా పనిచేయ్యవేమోలెండి. ఆ ముందు గదిలోంచి హాల్లోకి వెళితే ఎదురుగా గోడమీద తాతగారి అమ్మగారిది నాన్నగారిది ఫోటోలు ఉండేవి. అవి చాల పెద్ద సైజులో ఉండేవి. తాతగారి తల్లి తండ్రులు పాత తరం వారు కావడం చేత సహజంగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు అవి. వాటి కింద మా అమ్మమ్మ గారి ఫోటో - దానికి ఒక దండ వేసి ఉండేది. ఇంకా హాల్లో నాలుగు గోడల మీద రక రకాల చుట్టాలవి, పెద్ద పెద్ద వాళ్ళవి, ఎన్నెన్నో ఫోటో లు ఉండేవి. పండగలు వచ్చినప్పుడు ఇల్లుదులపడం తో బాటు వాటిని కూడా నిచ్చెన వేసుకుని తడిగుడ్డతో తుడవడం ఒక వరుసక్రమం లో జరిగేవి. ఏవైనా కొత్త ఫోటోలు, ప్రత్యెక ఫోటోలు వస్తే పాత ఫోటోలు కిందకి దింపి కొత్త ఫోటోలు పైకి ఎక్కిన్చేవాళ్ళం. తర్వాతి కాలంలో...నేను కూడా రాజారవివర్మ paintings, Monalisa photo కూడా పెట్టేసా వాటి పక్కన.
అంటే ఇంతకి చెప్పొచ్చేది ఏమిటంటే...Walls మీద ఫోటోలు పెట్టుకోడం షేర్ చేసుకోడం Mark Zuckerberg వచ్చి ఏమి కనిపెట్టలేదు అని.

Friday, September 7, 2012

నా చిన్న నాటి జ్ఞాపకాలు (ఉమ్మడి కుటుంబం)


ఉమ్మడి కుటుంబాలు...... ahh..What does it mean? How do they look like? “అమ్మా  చూడవే ఈయనేదో ఉమ్మడి or maybe something like Gummadi అంటున్నారు?”
అవునండి ఈ కాలం పిల్లల దగ్గిర ఇలాంటి పదం వాడితే అలానే అంటారేమో సాధారణం గా. ఈ రోజుల్లో అన్నీ nuclear families, ఎక్కడ చూసినా  2 + 1 మహా అయితే  2 + 2 అంతే – కుటుంబం అక్కడే మొదలయ్యి అక్కడే పూర్తైపోతుంది.
అమ్మమ్మ - తాతగారు మేము 
మా చిన్నప్పుడు మేము ఒక ఉమ్మడి కుటుంబంలో పెరిగాము. మా తాతగారి ఇంట్లో పెరిగాము. తాతగారు, అమ్మమ్మ, బామ్మగారు, మేనమామలు, వారి భార్యలు, వాళ్ళ పిల్లలు కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. తాతగారి చెల్లెళ్ళు వాళ్ళ కుటుంబాలు (ఉండేది వేరే ఇంట్లో అయినా పొద్దున్న రాత్రి మకాం ఇక్కడే కబుర్లకి, కాలక్షేపాలకి). అరమరికలు ఉండేవి కావు. ఎంతమంది వచ్చారు? ఎంతమంది తిన్నారు? ఎన్ని సార్లు వచ్చారు?ఎంత ఖర్చు అయ్యింది? అసలు ఆ ప్రశ్నలు ఉత్పన్నమే అయ్యేవి కాదు. “అయ్యో వాడు/ అది  ఈ సారి ఎందుకు రాలేదు అనుకునే రోజులు అవి.”
అదే ఇప్పుడు ఎవరూ ఇంటికి కూడా రావక్కర్లేదు, వాళ్ళనించి ఒక్క ఫోన్ వస్తే చాలు, పరి పరి విధాల ఆలోచనలు, తర్క- వితర్కాలు. “అసలు ఉన్నట్టుండి ఎందుకు చేసాడో? ఎం గొడవో ఏమిటో? డబ్బెమైన అడుగుతాడో? మన డ్రైవర్ ని కాస్సేపటికి ఇమ్మంటాడో? మన కారే అడుగుతాడో? అసలు వాళ్ళని కాస్త దూరం పెడితే మంచిది. మళ్ళి వెధవ మొహమాటాలు, మర్యాదలు, టైం వేష్ట్ – డబ్బులు బొక్క”. ఇవీ ఠక్కున మనస్సులోకి వచ్చే ఆలోచనలు ఈ రోజుల్లో. అదే తాను ముక్కలు - మన నించి మనపిల్లలికి అవే బుద్దులు అబ్బుతున్నాయి. దీనివల్ల మంచి చెడుల మాట ఎలా ఉన్నా మన మీద negative stress చాల పడుతోంది. అవతలి వాడిని తప్పించుకోడానికి ఎత్తులు పైఎత్తులు వేస్తూ ఎప్పుడూ ..ఏదో ఒక అబద్దం, ఏదో ఒక కధ... ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటూ దాన్ని అన్ని సందర్భాలలో అందరిముందు అతికేలా ఉండేలా ప్రయత్నిస్తూ.............వెధవ జీవితం తెల్లారిపోతోంది. హాయిగా మనసారా నలుగురితో కలిసి నవ్వుకుని ఎన్నాళ్ళయ్యింది మీరంతా? ఎందుకు ఇలా బ్రతుకుతున్నాం?
ఒక బుల్లి ఫ్లాష్ బాక్ స్టొరీ....
మా ఇంట్లో వీధిలో ఉండే అరుగు (మా ఆఖరి తమ్ముడు వాసు)
మా ఇంట్లో బయట ఒక పెద్ద హాలు లాంటి అరుగు ఉండేది, దానిలో ఒక పది కుర్చీల దాకా ఉండేవి. అందులో ఒకటి కాళ్ళు చాపుకుని కూర్చునే పడక కుర్చీ, అందరికి అది ఒక favourite కుర్చీ. పొద్దున్నే ఇంట్లో నాలుగో ఐదో  తెలుగు/ ఇంగ్లీషు  వార్తా  పత్రికలూ వచ్చేవి. తాతగారు ఆ పడక కుర్చీలో, మిగతా వాళ్ళు అనగా నేను నా తమ్ముళ్ళూ, పిన్నిలూ , మా మేనమామలు మిగతా కుర్చీల్లో సర్దుకుని, వార్తలు చదివేసేవాళ్ళం.

మా తాతగారి ఇంట్లో  మేమందరం 
మా ఫ్రెండ్స్ – “ఒరే ఎప్పుడైనా మీ ఇంటికి రావాలంటే భయంగా ఉందిరా” అనే వాళ్ళు. ఎందుకంటే, ఇంటికి వచ్చినప్పుడు వీధి అరుగు హాల్లో మా చిన్న మావయ్య కంట వీళ్ళు బడితే వెంఠనె ఆయన వీళ్ళని లెక్కల్లో పైథాగరస్ సిద్ధాంతం, లేదా ఏదో ఒక ఆల్జీబ్రా సూత్రం అడిగే వారు. ఆ దెబ్బకి వాళ్ళు ఆయన వీధి అరుగు మీద  కనబడితే తప్పుకుని మళ్ళి ఎప్పుడైనా వచ్చి నన్ను కలిసే వారు. సజహంగా ఆయనకి  మహా  వేళాకోళం, వెటకారం. ఎప్పుడూ ఏదో ఒక జోకు వేసి అందర్నీ నవ్విస్తూ ఉండేవారు (ఇప్పుడూ ఉన్నారు). అలాగే మా బామ్మ గారు, ఆవిడకి అందరు బామ్మల్లాగే దైవ భక్తి ఎక్కువ. పూజలకి పువ్వులు/ పెరట్లో మొక్కలు  – ఆవిడ favourite subject. దానికోసం ఇంట్లో ఎక్కడో అక్కడ ఒక మొక్క, చెట్టు, పందిరి, పాదు, అంటూ ఇలా ఏదో ఒక project ఎప్పుడూ running లో ఉండేది.  మాకు వెనక కాస్త దొడ్డి ఉండేది అందులో మొక్కలు వేసేది ఆవిడ. మా ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా ఇంటికి, వాడికి ఒక చేగోడినో, జంతికలో కాస్త ఇచ్చి రెండు మామూలు కబుర్లు అడిగి, వెంటనే “బాబూ కాస్త ఇలా వచ్చి ఆ బీర పాదు ఆ పందిరి మీదకి ఎక్కించు” అని పని అప్పచెప్పేవారు. మా ఫ్రెండ్ ఎవరు కనబడితే వాడికి తప్పకుండా ఆవిడ ఈ facility ఇచ్చేవారు. ఒక్కోసారి ఒక్కో ఫ్రెండ్ – “ఇదిగో వస్తున్నా అండి” అని జంప్ అయ్యేవారు కూడా. అలాంటప్పుడు ఆవిడ నాతో “ఒరే రావూ ఆ వుండవల్లిగాడు ఉన్నాడే ఒఠి కబుర్లపోగురోయ్, ఇదిగో బామ్మగారు అంటాడు మళ్ళి కనబడడు.”
వేసంగుల్లో అప్పుడు ఏ. సి. లు లేవు కాబట్టి, అందరం పొలోమని పైడాబా (రెండో అంతస్తు) మీదకి పోయేవాళ్ళం పడుకోడానికి. దానికో పెద్ద డెకరేషన్ ఉండేది. పెద్దవాళ్ళు (తాతగారికి, బామ్మగార్లకి) మడత మంచాలు, మిగిలిన మా అందరికి పరుపులు, చాపలు, జంపఖానాలు, దుప్పట్లు, తలగడాలు, మంచినీళ్ళ చెంబులు, విసనకర్రలు. ఇవన్ని రాత్రి పడుకోబోయే ముందు మొదటి అంతస్తునించి పోలో మని రెండో అంతస్తుకి మోసుకువెల్లడం. మధ్య రాత్రిలో ఖర్మ కాలి ఎప్పుడైనా వర్షం వస్తే, గోలోమని అన్ని ఎత్తుకుని కిందకి దిగడం. భలేగా ఉండేది...విసుగు విరామం ఉండేది కాదు. ఇప్పుడు కాస్త దాహం వేస్తే గ్లాసు మంచినీళ్ళు ఎవరు ఇవ్వాలి అని ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటున్నాం. (పెద్ద పని మరి?)
ఉమ్మడి కుటుంబాల్లో ఇంకొక సుగుణం ఏమిటంటే మనకి భోజనానికి ఢోకా ఉండేది కాదు. ఇంట్లో ఒకరికి కోపం వస్తే ఇంకొకళ్ళు ఉంటారు మనకి ఫుడ్డు సంగతి చూడ్డానికి. ఒకళ్ళ కోపాలు, అలకలు మనకి పెద్దగా effect ఇచ్చేవి కాదు ఆ రోజుల్లో.ఉమ్మడి కుటుంబాల్లో ఇంకో పెద్ద సుగుణం, మా అందరికి అన్ని అందరితో ఇచ్చిపుచ్చుకునే మనస్తత్వం అలవాటు అయ్యింది. There used to be lot of feel good factor in sharing whatever we have. ఇప్పుడు అది ఎక్కడ కనబడడం లేదు. ఒక్క Facebook లో status లు  share చేసుకోడం తప్ప.
"మన జీవిత నాటకం చాలా చిన్నది...గడిచిపోయిన నిన్న మనది కాదు !! రాబోయే రేపు - ఒక ఊహ మాత్రమె!! నిజంగా చూస్తామో లేదో..నిజంగా చూసేదాకా మనకి తెలియదు...!!! ఇంకా మిగిలింది ఇప్పుడు, మన చేతుల్లో ఉన్న ఈ అద్భుత మైన ఎన్నో సుందర అనుభూతులున్న - వర్తమానం. అందుకే మన ఈ వర్తమానాన్ని హాయిగా ఆనందిస్తూ జీవిద్దాం అంతే కాని ఏదో " ఇలా ఈ జీవితాన్ని ఈసురోమని వెళ్ళదీయద్దు "