Showing posts with label brahmanandam. Show all posts
Showing posts with label brahmanandam. Show all posts

Friday, September 26, 2014

లౌక్యం – సినిమా రివ్యూ
నటీ నటులు:

గోపిచంద్; రకుల్ ప్రీత్ సింగ్; బ్రహ్మానందం;చంద్రమోహన్; ప్రదీప్ రావత్; సంపత్ రాజ్; “30 years ఇండస్ట్రీ – పృథ్వి”; రఘు బాబు;ఒక బుల్లి పాత్రలో పోసాని కృష్ణ మురళి; ఇంకో బుల్లి పాత్రలో కృష్ణ భగవాన్; కాస్త ఎగష్ట్రా గా ఒక చిన్న పాత్ర కోసం మరియు ఐటెం పాట కోసం హంసానందిని.......కూడా ఉందండోయ్.
మాటలు: కోన వెంకట్; గోపి మోహన్
సంగీతం: మన తమన్ బాదుడు నుంచి విముక్తి దొరికింది మనకి.....ఇందులో సంగీతం ...అనూప్ రూబెన్స్
కెమెరా: వెట్రి.    
అస్సలు expectations లేకుండా ఉన్నపళం గా సినిమా చూద్దాం అని వెళ్ళిపోయా. నిరాశ పడలేదు.
కధా, కధనం అంతా మామూలే. హీరో గారు అతను ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ పెద్ద వాళ్ళ అనుమతితోనే పెళ్ళి  చేసుకుంటా  అని చెపుతాడు అలానే చేసుకుంటాడు చివరికి. ఇదివరకు సినిమాల్లో చూసినట్టే ఇందులో కూడా హీరో విలన్ దగ్గిరే చేరి వాళ్ళతో ఉంటూ వాళ్లకి అసలు విషయం తెలియకుండా కామెడి గా మేనేజ్ చేస్తుంటాడు. మధ్య లో హీరో గారు  వాడుకోడానికి మన బ్రహ్మ్మి ఉంటాడు. వాళ్లకి తోడుగా హీరో గారి తండ్రి చంద్ర మోహన్. ఆ కామెడి మీరు ఊహించుకోవచ్చు. కొసమెరుపు ఏమిటి అంటే? ఇందులో హంసానందిని బ్రహ్మానందం భార్య.
గోపీచంద్ పాత్ర నటనా... మామూలే, అన్నిటిలో ఉన్నట్టే ఇందులో కూడా ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ చాలా refreshing గా ఉంది. పెదాల మీద ఎదో కందిరీగ కుట్టినట్టు అనిపించేలా ఉంది మొహం, కాని అమ్మాయి బావుంది. action కూడా బాగా చేసింది. ఈ అమ్మాయిని ఇదివరకు వెంకటాద్రి ఎక్స్ ప్రెస్  లో చూసా అందులో కంటే ఇందులోనే నాజూకుగా బావుంది.   
ఇందులో అన్నిపాటలు చెవులకి అంత ఇబ్బంది కల్గించలేదు కాని ఒక్క పాట కూడా సన్నివేశానికి నప్పలేదు.
కోన వెంకట్ – గోపి మోహన్ మళ్ళి నిరూపిస్తారు వాళ్ళు కామెడి ని బాగా ఇవ్వగలరు అని.  సినిమా మొదటి భాగం లోనూ, రెండో భాగం లోనూ కామెడీ పుష్కలంగా ఉంది. నేనైతే హాయిగా నవ్వాను. బ్రహ్మానందానికి చాల ఆరోజుల తర్వాతా పెద్దగా “ఓవర్ action” లేని పాత్ర వచ్చింది. అయినా అతను తన శాయశక్తులా కాస్త ఓవర్ action చెయ్యడానికి ప్రయత్నించాడు.
హంసానందిని పాత్ర మీద అక్కడక్కడా కాస్త “ముదర  కామెడి” ఉండచ్చు. అవ్వడానికి బ్రహ్మానందం భార్య అయినా కూడా ....సన్నివేశ పరంగా  ఆవిడ మీద చంద్రమోహన్, హీరో గారు వేసే ఓవర్ action కొందరికి ఎబ్బెట్టుగా అనిపించచ్చు కాని దానిని vulgar అని అనలేను.

సినిమా లో కామెడీ కి హైలైట్ “Boiling star – Bablu” (30 years industry fame పృథ్వి). అతను టీవీ సీరియళ్ళ లో హీరో పాత్ర ధారి. ఆలాగే రఘు బాబు కూడా బాగానే ఉన్నాడు. ఒక చోట రఘు బాబు  హీరో వెనకాల Car chasing లో ఉన్నప్పుడు హీరో లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసి కుడివేపు కారు తిప్పుకుని వెళ్ళిపోయే సీన్ నాకు చాలా నవ్వొచ్చింది. అలాగే క్లైమాక్స్ లో కూడా పృథ్వి నవ్వు తెప్పిస్తాడు.

ఏమి తోచనప్పుడు, మరీ చిరాకుగా ఉన్నపుడు......ఓ సారీ వెళ్లి చూసి రావచ్చు. 

Thursday, August 16, 2012

దేముడు చేసిన మనుషులు (రవితేజ సినిమా) రివ్యూ


చిన్నప్పుడు ఎప్పుడో చదువుకునే రోజుల్లో అక్కడా ఇక్కడా వినేవాళ్ళం ...”ఇన్కంటాక్స్  తప్పించుకోడానికి ఏవేవో నష్టాలు వచ్చే బిజినేస్సులు  అవీ చూపిస్తారు” అని. అలా బహుశా ఈ ‘దేముడు చేసిన మనుషులు సినిమా’ కూడా అలాంటి బాపతే అని నా అనుమానం. లేకపోతే మరీ అంత ఎటకారంగా ఎవరైనా ఎందుకు సినిమా తీస్తారు చెప్పండి?పూర్తిగా చూడక్కర్లేదు, అసలు థీం వింటేనే తెలిసిపోతుంది ఎంత ఎట కారమో? అసలు వారం కూడా ఆడదు అని.  లేదు ఆ కారణం కాదు అంటే మన పూరి జగన్నాధ్ కి గర్వం బాగా తలకెక్కైనా అయ్యుండాలి. “నేనేమి తీసినా చూసేస్తార్లే” అన్న తన గురుతుల్యులు రాం గోపాల్ వర్మ గారి పిచ్చి, వెర్రి తనం బాగా వంటబట్టి ఉండాలి.

అసలు సినిమాలో ఏమి ఉంది? టూకీగా చెప్పాలంటే ఏమిలేదు. అసలు విషయం ఏమిలేకుండా రెండు ఘంటల పాటు సినిమాని సాగదియ్యడం కూడా ఒక కళ. మొత్తం మీద సినిమాలో, రఘుకుంచే మ్యూజిక్....శ్యాం కే నాయుడు ఫోటోగ్రఫి తప్ప ఇంకేమి లేదు.  అన్నట్టు ఇంకో ముఖ్య విషయం ...ఇలియానా సైజు జీరో అయినా కూడా ఇందులో చాలా బావుంది. మొన్న జులాయిలో లంఖణాలు చేసిన ఇలియానాకి..ఇక్కడి ఇలియానా కి చాలా తేడా కనబడింది. ఆశ్చర్యం ఏమిటంటే? ఫోటోగ్రఫి రెండు  సినిమాలకి (జులాయి, దేముడు చేసిన మనుషులు) - శ్యాం కే నాయుడే కాని ఇందులో ఎందుకు బావుందా అని ఆలోచిస్తే........ఆమె ధరించిన కాష్ట్యూమ్స్ చాలా  Trendy గా ఉన్నాయి. ఈ విషయం లో దర్శకుడికి మార్కులు ఇవ్వాలి. 

కధ క్లుప్తంగా .. వైకుంఠం లో అక్షయ తృతీయ రోజున విష్ణుమూర్తి (బ్రహ్మానందం) శ్రీ మహా లక్ష్మి (కోవై సరళ) కూర్చుని  ఉండగా, లక్ష్మి దేవి ‘ఏదైనా ఒక మంచి కధ చెప్పండి స్వామి ‘ అని అడిగినప్పుడు, విష్ణుమూర్తి, కింద భూలోకం లో జరిగే ఒక నిజ జీవిత కధ చూపిస్తా అని...మనకి సినిమా చూపిస్తాడు.  బ్రహ్మానందం, కోవై సరళ బావున్నారు, మొట్ట మొదటి సారి భగవంతుడిని చూడగానే ఫక్కున నవ్వొచ్చింది నాకు (క్షమించు తండ్రి, ఆపుకోలేకపోయాను) . ‘ఇండియా లో ఉన్న రవితేజ, బ్యాంకాక్ లో ఉన్న ఇలియనా ఎలా కలుస్తారు స్వామి ‘అని అడిగినందుకు..... ప్రభువు చూడు...అని ఎమ్మెస్ నారాయణ అరటిపండు తిని తొక్క తీసి కింద పడవేస్తున్న సీను చూపిస్తాడు. అక్కడినించి దాని మీద ఒకడు కింద పడి, వాడి మీద ఇంకోడు పడి ...అలా ఎక్కడెక్కడికో పిచ్చిలా తీసుకుపోయి ఇంటర్వెల్ ముందు ఇలియానా  రవితేజని రెండు కాళ్ళ మధ్య కొడుతుంది. “అమ్మా” అని బాధతో మెలికెలు తిరుగుతున్న మన హీరో ని చూసి లక్ష్మి దేవి “ అయ్యో స్వామి చూసారా ఒక అరటి తొక్క ఎంత పని చేసిందో” అంటుంది. దానికి విష్ణు మూర్తి, “ఆ తొక్కదేముంది  తొక్క పడెయ్యకుండా ఉంటె ఏమవుతుందో  మళ్ళి చూద్దాం “అంటాడు.  INTERVAL. మళ్ళి బొమ్మ వెనక్కి తిరిగి మళ్ళి ఎమ్మెస్ నారాయణ అరటిపండు తినేదగ్గిరకి వెళుతుంది. మళ్ళి ఏదో ఒక పిచ్చి లింకులు అవి ............. మళ్ళి మనం బ్యాంకాక్ వచ్చేస్తాం అక్కడికే, మళ్ళి ఇలియానా రవితేజని కాళ్ళ మధ్య తంతుంది.... ప్రకాష్ రాజ్ ని అంత చెత్త పాత్రలో అంత చెత్త నటనతో చూడడం నాకు ఇదే మొదటి సారి. అసలు అలాంటి పాత్ర ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో అతనికి ......., ఏమైనా మొహమాటాలో, బెదిరింపులో  తెలియదు. రవితేజని భరించడం కాస్త కష్టమే ఇందులో, సెటిల్మెంట్లు అవీ చేస్తున్తాదుట ఇందులో.  ఒక పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ – సుబ్బరాజు కి ప్రకాష్ రాజ్ తో సెటిల్మెంట్ చెయ్యడానికి బ్యాంకాక్ వెళతాడు (వినడానికి కాస్త వేళాకోళంగా ఉంది కదా?). సినిమా మొత్తానికి కాస్త బావున్న క్యారెక్టర్స్ : అలీ , Fish వెంకట్ (సాధారణం గా చిన్న సైడ్ రౌడీ పాత్రలు వేస్తుంటాడు). సుబ్బలక్ష్మి పాట  బాగా క్యాచీ గా ఉంది.  ఫైట్లు అవీ మామూలే, పెద్దగా చెప్పుకోడానికి ఏమి లేదు.

చూస్తుండగానే సినిమా అయ్యిపోయింది అనేస్తారు. మరీ మానసిక వత్తిడిలో ఉంది ఇంట్లో ఉండలేని పరిస్థితి అయితే తప్ప ఈ సినిమాకి వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదేమో ఆలోచించుకోండి.