Showing posts with label autograph. Show all posts
Showing posts with label autograph. Show all posts

Monday, September 1, 2014

నేను బాపు గారిని కలిసిన రోజు

అప్పుడు నాకు సరిగ్గా 24 ఏళ్ళ వయస్సు; 1986 లో మొట్టమొదట సారీ శబరి institute – అన్నాసలై లో ఎదో ఒక మూడు నెలల చిన్న కోర్సు చెయ్యడానికి మెడ్రాసు వెళ్లాను. పల్లవన్ తంగళ్ అనే నగర శివార్లలో ఉన్న ఒక కాలని లో ఒక చిన్న రూములో ముగ్గురం కలిసి ఉండే వాళ్ళం.

వాళ్ళు వీళ్ళు చెప్పగా తెలిసింది కన్నెమెరా లైబ్రరీ ఆసియా లోకెల్లా అతిపెద్ద గొప్ప లైబ్రరీ అని (ఆ రోజుల్లో), దాని చూద్దాం అని ఒకరోజు వెళ్లాను...అన్ని అంతస్తుల లైబ్రరీ లో ఎన్ని వేల, ఎన్ని లక్షల పుస్తకాలు ఉన్నాయో  నాకే తెలియదు. అలా తిరిగి, తిరిగి అలిసిపోయకా అక్కడ ఉన్న ఒకాయన చెప్పాడు “ఇక్కడి ఆర్ట్ gallery మహాద్భుతంగా ఉంటుంది చూసావా బాబూ”? అని. సరే పనిలో పని అది కూడా ఒక సారీ చూసేద్దాం అని అటువేపు కూడా వెళ్లాను.

ఆ ఆర్ట్ గేలరీ ఒక మహా ప్రపంచం. అందులో దేశ విదేశాల చిత్రకారుల బొమ్మలు నిలువెత్తు ఫ్రేముల్లో సజీవంగా ఉన్నట్టు ప్రదర్శిస్తున్నారు. అందులో నాకు తెలిసిన వాళ్ళవి రాజా రవి వర్మ గారి బొమ్మలు (originals) చాలా కళా ఖండాలు ఉన్నాయి. వాటిని దగ్గిరగా నించుని అలా చూడడం మాటల్లో వర్ణించలేని మధురానుభూతి.అలా సాయంత్రం దాకా చూసి కళ్ళనిండా, కడుపు నిండా బొమ్మల్ని మనసులో నింపుకుని రూముకి చేరాను. విచిత్రం అందులో నాకు బాపు గారిది ఒక్క బొమ్మా కనపడలేదు. నేను బాపు గారి ఏకలవ్య శిష్యుడిని. ఆయన లా అక్షరాలూ రాద్దామని, ఆయన బొమ్మలు చూసి ఆయనలా వేద్దామని తెగ తాపత్రయ పడిపోతుండే వాడిని. ఆయన వీరాభిమానిని.

అలా అక్కడే మెడ్రాసులో  ఉన్నపుడు చటుక్కున ఒక రోజు మనసులో ఆలోచన వచ్చింది, బాపు గారు ఇక్కడే ఎక్కడో మెడ్రాసు లో ఉంటారు కదా? ఒకసారి వెళ్లి కలుద్దాం అని. అనుకున్నదే తడవు ఒకరోజు ఎడ్రస్ కనుక్కుని ఎకాఎకిన బాపు గారి ఇంటికి వెళ్ళిపోయాను. నాకు చిన్నప్పటి నుంచి ఒక hard bound తెల్లకాయితాల పుస్తం లో నాకు నచ్చిన కవితలు, సూక్తులు, చలోక్తులు, కొటేషన్ లు, బొమ్మలు సేకరించే హాబీ ఉండేది. అందులో నేను ఒక బాపు గారి write up ని నా చేత్తో రాసుకుని దానికి బాపు గారి మొహం బొమ్మ వేసి పెట్టుకున్నా. ఆ బుక్కు కూడా నాతో పాటు తీసుకెళ్ళాను, ఒక వేళ బాపు గారు నిజంగానే కలిస్తే ఆయనకీ నేను వేసిన ఆయన బొమ్మ చూపించి ఆయన చేతి autograph తీసుకోవాలి అని నా ప్లాన్/ ఆశ కూడా. గుమ్మంలో నించుని తలుపు కొట్టాను. ఎవరో ఒక అమ్మాయి వచ్చి అడిగింది “ఎవరు కావాలి అండి” అని, చెప్పాను. ఇంతలో లోపల్నించి ఒకాయన గళ్ళ లుంగీ లో బయటికి వచ్చారు...ఎవరా అని  చూద్దును కదా.. సాక్షాత్తు బాపు గారు. నాకు నోటంట మాట రాలేదు ఆనందం లో. ఏం మాట్లాడాలో తెలియదు. పాపం నా అవస్థ గ్రహించి కాబోలు ఆయనే పలకరించారు, ఎక్కడనించి వచ్చావు? ఎం చేస్తుంటావు  ఇలా... అన్ని చెప్పాను. నా చేతిలో ఉన్న పుస్తకం తెరిచి ఆయన బొమ్మ చూపించి ఆయన autograph అడిగాను. దాన్ని సాంతం పరికించి ఒక బుల్లి చిర్నవ్వు నవ్వి కింద “శుభాకాంక్షలతో బాపు“ అని సంతకం పెట్టారు. అప్పుడు నా చాతీ ఆనందం తో ఒక నాలుగించీలు పెరిగి ఉంటుంది.

అప్పుడు అడిగా ఆయన్ని. “నిన్ననే కన్నెమెర లైబ్రరీ కి వెళ్లి అన్ని చూసి వస్తున్నా...అక్కడ మీ బొమ్మలు ఎందుకు లేవండీ?” అని.  దానికి ఆయన నవ్వి, ఒకింత సిగ్గుపడుతున్నట్టు మెల్లిగా అన్నారు, “అబ్బే అక్కడ అన్ని పెద్ద పెద్దవాళ్ళ వి, మహానుభావులవి పెడతారు”. ఆయన నిరాడంబరత్వానికి ఆశ్చర్యపోయా.

ఎందుకో అదేదో ఒక పాత దేవానంద్ హిందీ సినిమా పాట లో లా....”అభి నా జా ఓ చోడ్ కర్... యే దిల్ అభీ భరా నహి” అన్నట్టు ఆయన్ని వదిలి వెళ్ళ బుద్ధి కాలేదు. నా note బుక్కు లో ఇంకో ఖాళి పేజీ తీసి దానిలో ఇంకో autograph ఇమ్మని అడిగా. ఆయన నాకేసి విచిత్రంగా చూసి, నవ్వి “సరే తీస్కో ఫో” అన్నట్టుగా ఇంకో బుల్లి autograph ఆ ఫుల్లు పేజిలో మధ్యలో  పెట్టి ఇచ్చారు. అలా ఆయన్ని ఇంకాస్సేపు చూసి బయటకి వచ్చేసా.

అంతే ఆ తర్వాత మళ్ళి ఆయన్ని భౌతికంగా కలిసే అవకాశం కలగలేదు.

ఇప్పుడు మనం కలుద్దాం అన్నా మనం కలవలేని దూరాలకి ఆయన తన స్నేహితుడిని కలవడానికి వెళ్ళిపోయారు.