Wednesday, January 23, 2013

Dubai స్వర్గం అనబడే గల్ఫ్ కష్టాలు కధ.


(ఇది నా ఆత్మ కధ కాదు, దూరపుకొండలు - part 2 లో ఆ వివరాలు ఇస్తాను) 

గల్ఫ్ లో భారతీయుల కష్టాలు అన్న వార్తలు రోజూ చూస్తున్నాం. నిజా నిజాలు ఏమిటి కాస్త వివరాల్లోకి వెళితే..........
ముందు మనం గల్ఫ్ లో ప్రభుత్వ విధానాలు ఏమిటి అన్న విషయం తెలుసుకోవాలి.
ఇక్కడ దేశం లోకి ప్రవేశించడానికి స్థూలంగా మూడు  మార్గాలు ఉన్నాయి. Visit Visa – పేరుకు తగ్గట్టే ఇది ఊరికే అలా వెళ్లి రావడానికి మాత్రమే, ఇది సాధారణం గా మనకి తెలిసిన వారు - అంటే చుట్టాలు, స్నేహితులు sponsor చేసి అక్కడికి పిలిపించుకునేది. దీని కాల పరిమితి సాధారణం గా 10 రోజుల నించి మూడు నెలల దాకా ఉండచ్చు, కాల పరిమితిని బట్టి వీసా రుసుము ఉంటుంది. రెండవది Tourist Visa...దీనిగురించి పెద్ద వివరాలు అక్కర్లేదు అనుకుంటాను (పేరులోనే అన్ని ఉన్నాయి). ఇంకా మూడోది మన  ప్రస్తుత విషయానికి సంబంధించినది... Employment Visa.
ఎంప్లాయిమెంట్ వీసాకి సంబంధించి కొన్ని రూల్సు ఉన్నాయి ఇక్కడ. మనకి ఇక్కడ ఏదైనా కంపెనీలో ఉద్యోగం దొరికితేనే ఆ కంపెని వాళ్ళు మనకి employment visa ఇస్తారు. వాళ్ళు మనకి Sponsor అన్నమాట. ఊరికే ఇక్కడికి ఎదో వీసాలో వచ్చేసి ఉద్యోగం వెతుక్కుంటాం అంటే కుదరదు అన్నమాట. (అంటే వెతుక్కోవచ్చు, దొరికింది అనుకున్నాక, మళ్ళి మనం వెనక్కి వెళ్లి వాళ్ళ కొత్త వీసా మీద ఇక్కడకి రావాలి – ఒక రకంగా) ఒక company visa లో ఉద్యోగం లో చేరాకా, మళ్ళి అక్కడా ఇక్కడా తీరిక సమయాల్లో వేరే పని చేసుకుందాం ఎదో రకంగా కష్టపడి అంటే ఇక్కడి రూల్సు ఒప్పుకోవు. అది చట్ట విరుద్దం పట్టుకుంటే భారి జరిమానా, ఒక్కోసారి జైలు కూడా. అలాగే ఒకసారి ఉద్యోగం లో చేరాకా ఇక్కడి sponsor అది ఒక company అయినా సరే మన passport వాళ్ళ దగ్గిర పెట్టేసుకుంటారు. (మనం పారిపోకుండా అన్నమాట), దీనికి ఒక కారణం ఏమిటి అంటే, sponsor కింద ఉన్న ఉద్యోగి అక్కడే దేశంలో వేరే చోటకి పారిపొయినా, కనబడకుండా పోయినా అది sponsor నెత్తి  మీదకి వస్తుంది. ఒక్కోసారి అలాంటి సందర్భం ఎదురైతే sponsor తన కింద ఉన్న ఉద్యోగి కనబడడం లేదు అని పొలిసు లో కంప్లైంట్ ఇచ్చి చేతులు దులిపేసుకుంటారు. ఇంక ఆ క్షణం నించి ఆ ఉద్యోగి ఒక అక్రమ వలస దారుడిగా పరిగణించ బడతారు. ఎవరి నైనా ఉద్యోగం లోంచి తీసేస్తే ఆ ఉద్యోగికి టిక్కెట్టు కొని airport లో విమానం ఎక్కించి వారి visa papers మీద exit స్టాంప్ కొట్టించుకునే దాకా ఆ company కి ఇమ్మిగ్రేషన్ డిపార్టుమెంటు లో క్లియరెన్స్ దొరకదు. వాళ్ళు తన company ని కూడా సరిగ్గా నడుపుకోలేరు. భారి జరిమానాలు ఉంటాయి company కి.
కొన్నికొన్ని సందర్భాల్లో company అన్యాయంగా ఉద్యోగం తీసేసి, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వక ఆ ఉద్యోగి పారిపోయాడు అని కేసు లు పెడుతుంది, అలాంటప్పుడు employee labour court కి వెళ్ళవచ్చు, సాధారణం గా 90% కేసుల్లో  న్యాయం జరుగుతుంది అక్కడ.

Just for information, UAE Govt website link ఇక్కడ ఇస్తున్నా Visa నియమాల గురించి (ఈ లింక్ ని browser లో copy paste చేసి, కావాల్సిన సమాచారాన్ని క్లిక్ చేసి చదువుకోండి)

http://dnrd.ae/en/Rules_Reg/Pages/Rules.aspx?AudianceId=3

మనం ఇప్పుడు papers లో చూసే గల్ఫ్ భారతీయుల కధలు ఏమిటి అంటే, ఇక్కడికి వాళ్ళు తెలియక Visit visa/ tourist visa మీద వచ్చేసి ఉంటారు, ఉద్యోగం దొరికి ఉండదు, ఇంకా ఇక్కడే ఎదో ఆ పని ఈ పని చేస్కుని అక్కడా ఇక్కడా దొంగతనం గా ఉంటూ ఉండి ఉంటారు. ఇంకొన్ని ఎక్కువ కేసుల్లో ఇక్కడి లోకల్ company లు/ వ్యక్తులు  వీసాలు అమ్ముకుంటారు, అంటే మా company లో/ లేదా మా ఇంట్లో  పనిచేస్తున్నాడు అని visa ఇచ్చి వాడి దగ్గిర నించి డబ్బు తీసుకుంటారు. ఇలాంటి వాళ్ళు సాధారణం గా వంటవాళ్ళుగా, డ్రైవర్ లు గా, house maids గా, cleaner లు గా, వడ్రంగి, తాపీ మేస్త్రి, ఎలక్ట్రీషియన్, చాకలి పని.......ఇలా వస్తుంటారు. వచ్చి ఇక్కడ వల్ల ఇంట్లో వీళ్ళ ఇంట్లో అలా చాలా ఇళ్ళల్లో/ ఆఫీస్ లలో  freelancer లు గా బాగానే సంపాదిస్తారు కొన్నేళ్ళు (ఎవరైనా పట్టుబడితే, పని చేసిన వాడికి, చేయించుకున్న వాడికి జరిమానా చాలా లక్షల రూపాయల్లో ఉంటుంది, ఒక్కోసారి జైలు కూడా ఉండచ్చు) . ఇలా జరిగినంత కాలం బాగానే నడుస్తుంది, ఎప్పుడో ఒకసారి వీడికి వాడికి ఏవో లెక్కల్లో తేడా  వచ్చి, sponsor my employee is missing’ అని కేసు పెడతాడు. అప్పటి నించి మన వాళ్ళ  కష్టాలు మొదలవుతాయి. ఒక సారి వీసా గడువు పూర్తయ్యాక, అతను వెనక్కి వెళ్ళాలంటే airport లో అధికారులు పట్టుకుంటారు, అందుకని ఆ భయం తో ఇక్కడే ఉండిపోతారు బిక్కు బిక్కుమంటూ. పరిస్థితుల ప్రభావం వల్ల, చిల్లర దొంగతనాలు, దెబ్బలాటలు, హత్యలు, ఉరిశిక్షలు ఇలా...ఊబిలోకి కూరుకు పోతారు. మనవాళ్ళ పరిస్థితికి ఇక్కడి ప్రభుత్వాల్ని నిందించి ప్రయోజనం లేదు, ఉన్నతలో ఇక్కడి ప్రభుత్వాలు పాపం బాగానే చూస్తున్నాయని చెప్పాలి. తప్పులో సింహభాగం మన ప్రభుత్వాలది, మన అమాయక జనాలది.

Gulf News Photo
ఇక్కడ గల్ఫ్ లో ముఖ్యంగా ఖర్చుల గురించి చెప్పుకోవాలి... పేరుకి tax లేదు అన్న మాట అంతే. అన్ని ఖర్చులు గూబ గుయ్యి మనిపించేలా ఉంటాయి. పైన చెప్పిన చిన్న చిన్న ఉద్యోగాలకి ఇచ్చే జీతం నెలకి 800 – 1200 Dirhams. దీనికి మనవాళ్ళు మన రూపాయల్లో చూసుకుని.......”మా వాడు అక్కడ నెలకి పదిహేను వేలు సంపాదిస్తున్నాడు అని చెప్పేసుకుంటారు. పాపం ఒక చిన్న పని వాడికి, వినడానికి అది ఒక పెద్ద మొత్తమే కావచ్చు, కానీ నిజంగా చూస్తే ఇక్కడ అది ఎందుకు సరిపోదు. ఒక రూములో 4 గురు (కాస్త మంచి ఉద్యోగం అయితే) లేదా 6 గురు, 8 మంది  (మరీ చిన్న ఉద్యోగం అయితే) కలిసి ఉండాలి. దీన్నే ఇక్కడి వాడుక భాషలో Bed space అంటారు. ఒక bedspace ఖరీదు కనీసం 500 dirhams (మన భాషలో Rs.7500).  ఇప్పుడు చెప్పండి మనకి వచ్చే  1200 లలో bedspace కి అది పోగా ఇంకా మిగిలేది ఎంత? తిండి, బట్టలు, తిరుగుడు, మందులు, రోగాలు  మిగతావి?? “మా వాడు దుబాయ్ లో ఉద్యోగం..........లక్షల్లో సంపాదించేస్తునాడు “ అనుకునే వాళ్లకి నెల నేలా ఎంతో కొంత పంపాలి కదా మరి? అదెలా? ఏడాదికో, రెండేళ్ళకో ఇంటికి వెళ్ళాలి అంటే flight ticket? (కొన్ని కంపెనీలు టిక్కెట్టు ఇస్తాయి కొన్ని ఇవ్వవు, ఉద్యోగ షరతుల బట్టి).

ఉదాహరణకి నేను చేసే ఉద్యోగం చాలా మంచిది, ఇక్కడ – అక్కడ మనవాళ్ళ భాషలో చెప్పుకునేలా చాలా పెద్ద ఉద్యోగం. నేను ఉండే ఇల్లు ఒక పెద్ద ఇంట్లో చాలా చిన్న వాటా మాత్రమే. ఒక బెడ్రూము, బుల్లి హాలు, అందులోనే వంట స్నానం అన్ని.....దీనికి నేను కట్టే అద్దె నెలకి అక్షరాలా...4000 dirhams మన లెక్కల్లో 60,000/- (నీళ్ళు కరెంటు, ఇంటర్నెట్  కాకుండా)దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు మనకి వచ్చే లక్షలు ఏ మూలకి సరిపోతాయో... ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం ఇక్కడ కూడా ఈ ఇంట్లో నేను ఉండకూదదుట...ఇలా ఇళ్ళల్లో వాటాలు తీసుకుని ఉండడం చట్ట విరుద్దం ట ఇప్పుడు. ప్రతీ వాడు తప్పని సరిగా ఒక separate flat లో ఉండాలి ట. దానికి నెల అద్దె కనీసం 5000 – 6000 dirhams (అంటే 75000 – 90000 నెలకి) ఇది కూడా single bedroom flat ఊరికి ఒక 50 కిలోమీటర్ల దూరం లో దొరుకుతాయి. నాకు వచ్చే ఏప్రిల్ నెల గడువు. ఇల్లు మరి తీరాలి. అంత దూరం వెళితే పనికి రాను పోను transport ...అదొక ఖర్చు.

ఇన్ని విషయాలు చెప్పినా ఎవరైనా వింటారా అంటే.........”ఊహు..నువ్వేమో లక్షలు సంపాదించేస్తున్నావు, కోట్లు కూడా బెట్టేసావ్, నేను వస్తా అంటే మాత్రం ఏడుస్తున్నావు” అని అనుకుంటారు.

ఒక రకంగా ఇక్కడి పరిస్థితి “గోదావరి ఈత లంక మేత” అన్న సామెతలా ఉంటుంది. గోదావరి నది మధ్యలో చిన్న చిన్న లంకలు (ఇసుక తిన్నెలు) ఉంటాయి. వాటి మీద పచ్చటి గడ్డి చాలా మొలిచి ఉంటుంది. తీరం ఇవతలి పక్కనించి చాలా మనోహరంగా కనబడుతుంది ఆ దృశ్యం. ఇవతలి వేపు ఉన్న గేదెలు వాటిని చూసి, ఝామ్మంటూ గోదాట్లోకి దూకేసి ఆవేశంగా అంత దూరం గోదావరి మధ్య దాకా ఈదేసుకుంటూ వెళ్ళిపోయి....హాయిగా కడుపారా, మనస్సుకి తృప్తి కలిగే దాకా ఆ పచ్చటి గడ్డిని తింటాయిట. అంత అయ్యాకా...మళ్ళి అంత గోదావరి ని ఈదుకుని వెనక్కి గట్టుకి వచ్చేసరికి, అంత సేపు తిన్న గడ్డి, ఆ శ్రమకి హరాయించేసుకు పోయి...మళ్ళి ఆ గేదేలకి  వెంటనే ఆకలి దంచేస్తుందిట. మళ్ళి కధ మొదటికి. అలా ఇక్కడ లక్షలు సంపాదించేసి..........మళ్ళి లక్షల్లో ఖర్చుపెట్టేసి చివరకి మిగిలేది అప్పుల్లో.

పోనీ ఇవన్ని వదిలేసి వెనక్కి వెళ్ళిపోతేనో అని అనుకుంటే? వెనక్కి వెళ్లి ఏమి చెయ్యాలి? మనకి ఇప్పుడు ఎవరు ఉద్యోగం ఇస్తారు? వయస్సు మీరిపోయింది కదా? ఇలాంటి సవా లక్ష ప్రశ్నలు. చివరకి కష్ట నష్టాలు బేరీజు వేసుకుంటే, ఇక్కడే ఉంది ఎదో రకంగా కాలం వెళ్ళ దీయడం బెటర్, అన్న జ్ఞానోదయం అవుతుంది.  
ఇన్ని విన్నా కూడా మనం అసలు విషయం గ్రహిస్తామా? అబ్బే “మనవాళ్ళు ఒట్టి వెధవాయిలోయ్” అని ఒక డైలాగు పారేసి మళ్ళి మన పనిలో మన ప్రయత్నాల్లో మనం నిమగ్నమైపోతాము.
WELCOME TO DUBAI.

Sunday, January 13, 2013

'ఆస్కార్ అవార్డ్' - అనబడు బ్రహ్మ పదార్ధము


ఇన్నాళ్ళు OSCAR AWARD అంటే అదేదో బ్రహ్మ పదార్ధం అని అనుకునే వాడిని. మనకి ముఖ్యం గా మన భారతీయులకి Oscar ఎలా వస్తుంది అని అనుకునే వాడిని. కాని గత కొద్ది అవార్డుల ట్రెండ్ చూస్తే విషయం అర్ధం అయిపొయింది. మన నిర్మాతలు దర్శకులు కూడా కాస్త దాని మీద కన్నేసి మరికొన్ని ఆస్కార్లు కొట్టెయ్యగలరు అని ఆశ పడుతున్నా.
బంగారు పళ్ళాని కైనా గోడ చేర్పు కావాలి అని ఒక సామెత. అలాగే మనవాళ్ళు  తీసిన ఎంత గొప్ప కళాఖందమైనా దానికి ఒక గోడ చేర్పు కావాలి. ఇక్కడ ఈ గోడ అంటే ఏమిటి ? అని కాస్త పరిశోధిస్తే ఏతా వాతా తేలింది ఏమిటయ్యా అంటే? ఒక తెల్లోడు మనకి కావాలి. తెల్లోడు ఉంటె చాలు మనకి పని జరిగిపోయినట్టే. అందుకే నా దృష్టిలో తెల్లోడే ఒక గోడ మనకి ఆస్కార్ తెచ్చుకోడానికి.
అది ఎలా అంటారా? చెపుతా...చెపుతా...
ఇప్పటిదాకా మనకి Oscar nominations  వచ్చిన సినిమాలు చూడండి, తెల్లోడి ప్రమేయం మీకు అందులో తప్పకుండా కనబడుతుంది. అది Gandhi, Slum Dog Millionaire లేదా ఇప్పటి Life of Pi. అంటే మీ ఉద్దేశం లో మనకి ఇంతకంటే మంచి సినిమాలు రాలేదనా? వచ్చాయి మరి వాటికి రాని Oscar nomination వీటికి ఎందుకు వచ్చింది? విషయం సింపుల్....ఒక తెల్లోడి పేరు (ఇక్కడ తెల్లోడు అనగా ఒక విదేశీయుడు అని చదువరులు చదువుకోగలరు) ఉంది ఆ సాంకేతిక నిపుణుల పేరులో, ముఖ్యంగా దర్శకుడిగా.
ఇప్పుడు కొత్తగా Life of Pi చిత్రం లో ‘Original music score’ కి బొంబాయి జయశ్రీ గారికి నామినేషన్ వచ్చిందిట. మహా సంతోషం కారణం ఏదైనా మన వాళ్లకి గుర్తింపు వచ్చింది, అందుకు నేను మనస్పూర్తిగా ఆమెని అభినందిస్తున్నా (కేరళ లోని ఒక కుటుంబం వారు ఆవిడ ఆ పాటని తమ వంశస్తుల స్వరపరచిన పాటనుంచి  యదా తధంగా కాపి కొట్టేసారని గగ్గోలు పెడుతున్నారు, అది వేరే విషయం అనుకోండి). మీరు  చెప్పండి గుండెల మీద చెయ్యేసుకుని, ఆవిడ పాడిన ఆ పాట కంటే కొన్ని వేల రెట్ల మంచి అమృత భరితమైన పాటలు మన భారతీయ భాషల్లో రాలేదా ఇంతకు ముందు? ‘జయహో పాట’ కంటే మంచి సంగీతం మన సంగీత దర్శకులు అన్ని రకాల భాషల్లో అందించలేదా ఇంతకుముందు, మన A R Rahman పాటలలోనే జయహో పాట అత్యుత్తమమైనదా? అన్నిటికి సమాధానం మీకు తెలుసు, నేను వేరే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
మన తెలుగు సినిమాల్లో Ghost writers ఉన్నట్టే (అంటే కధ ఎవడో రాస్తాడు పేరు ఇంకేవరిదో వేసుకుంటారు) మనం కూడా ఇంక మన భారతీయ సినిమాల్లో Ghost Directors ని పెట్టేసుకోవాలి, ఒక తెల్లోడిని వాడుకుని (అదేనండి వాడి పేరుని) ఒకటి రెండు International film festivals  కి పంపిస్తే ఒకటో రెండో ఆస్కార్లు రాకపోవంటారా?

Friday, January 11, 2013

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తెలుగు సినిమా రివ్యూ


చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక ‘Socio fantasy’ సినిమా  చూసాను.  ఇలా ఫాంటసీ సినిమా అంటున్నా అని విస్తుపోతున్నారా? నిజమే. ఇందులో ఇప్పటి కాలం సినిమాల్లో వచ్చే ‘ధించ్చాక్ ధించ్చాక్ డప్పు బీట్లు, fights, అరుపులు, కేకలు, పగలు, కుట్రలు కుతంత్రాలు విలనీలు............ఏమి లేవాయే? ఆఖరికి కామెడికి మూసపోసినట్టు ఉండే బ్రహ్మానందం కాని ఎమ్మెస్ నారాయణ కాని లేరాయె? అయినా సరే శ్రీకాంత్ అడ్డాల సినిమా తీసేసాడు అదీ కూడా తెలుగు చిత్ర పరిశ్రమ లో ఉన్న ఇద్దరు అతిపెద్ద హీరోలతో. పోనీ ఊరికేనే తీసిపడేసాడా అనుకుంటే లేదే! అద్దిరి పోయేలా  తీసేసాడు. మనసుకు హాయిగా అనిపించిన సినిమా.
ఈ సినిమా మహేష్ బాబుది, వెంకటేష్ ది అనుకుంటే పొరపాటే.........నా ఉద్దేశం లో ఈ సినిమాలో మీకు అంతర్లీనం గా పూర్తిగా మన ‘రాజోలు పదహారణాల తెలుగమ్మాయి - అంజలి’ కనబడుతుంది. బహుశ అందుకే సినిమా పేరుకూడా ఆమె పాత్ర పేరుమీదే పెట్టారేమో? అంజలి నటించిన పాత్ర పేరు సీత. ఈ అమ్మాయి చాలా చాలా బాగా మంచి ఈజ్ తో నటించింది. సమంత మామూలే కొత్తగా ఏమి లేదు అలాగే నటించింది (అచ్చు దూకుడులో ఉన్నట్టే ఉంది).
పెద్దన్నయ్య గా వెంకటేష్  చాలా  బాగా నటించాడు. అతని చిన్న తమ్ముడిగా మహేష్ చాలా jovial గా నటించాడు. “పెద్దన్నయ్య చాలా అమాయకుడు అయితే చిన్నోడు మాటలతో బూర్లు అల్లేసే రకం”. ఇద్దరు అగ్రశ్రేణి కధా నాయకులకి ఉండాల్సిన ఇగోలు పోటీలు ఇందులో లేకుండా సాదా సీదాగా కధానుసారంగా డైలాగు లు ఉంటాయి, ఆ గొప్పదనం - హీరోలది, దర్శకుడిది. కధా పరంగా పెద్ద కదా ఏమి లేదు సినిమాలో చెప్పుకోడానికి. కధనం మాత్రం బావుంది.పాత్రల ప్రవర్తనకి పెద్దగా పొంతన .....  కారణాలు కనబడకపోయినా చూడ్డానికి చిత్రీకరణ చాలా బావుంది. కొన్ని కొన్ని చోట్ల శ్రీకాంత్ అడ్డాల డైలాగు లు చాల బాగా మంచి అర్ధవంతం గా ఉన్నాయి. నాకైతే ఆ డైలాగు లు కొన్ని  ఎప్పటికి రాసి పెట్టేసుకోవాలి అనిపించింది. (DVD రెలీస్ అయ్యాక కొనుక్కుని రాసుకుంటా- ఇప్పుడు గుర్తు లేవు సరిగ్గా).
వీళ్ళ ఇద్దరు హీరోల తల్లిగా జయసుధ చాలా బాగా ఉంది.తండ్రి గా ప్రకాష్ రాజ్. ఇలాంటివి ఎన్నో వేల పాత్రలు వేసి ఉంటాడు ఆయన. మురళి మోహన్, కోట శ్రీనివాసరావు, వేణు మాధవ్..........వీళ్ళంతా అతిధులు సినిమాలో. తనికెళ్ళ భరణి డి ఒక చిన్నతరహా పాత్ర...........ఆయన కూడా ఎన్నో వందల సార్లు అలాంటి వేషం  వేసి ఉంటాడు. రోహిణి హట్టంగడి వీళ్ళ బామ్మ.
సినిమాని ఇంకాస్త వేగంగా నడిపించి ఉండాల్సింది అనిపించింది. కొన్ని కొన్ని సన్నివేశాలు ముఖ్యంగా మహేష్ – వెంకటేష్ మధ్య ఉన్న ఎమోషనల్ సీన్లు కాస్త కావలసిన దానికన్నా ఎక్కువ సాగ తీశారా అనిపిస్తుంది (అయినా బాగానే ఉన్నాయి పర్వాలేదు). నాకైతే చివరిదాకా వెంకటేష్ కాని మహేష్ బాబు కాని బ్రతుకు తెరువు కోసం ఎంచేస్తుంటారో తెలియలేదు.
భద్రాచలం లో ప్రకాష్ రాజ్ శ్రీరాముల వారి ఉత్సవ విగ్రహాల పల్లకి మోసినప్పుడు నాకైతే కళ్ళమ్మట నీళ్లోచ్చాయి. ఆ సన్నివేశాన్ని చాలా బాగా తీసాడు దర్శకుడు.
పాటలు అన్ని చాలా చాలా బాగా తీసారు. మిక్కి J మేయర్ పాటలు అందించారు. మణిశర్మ back ground score అందించారు. rerecording చాలా వీనుల విందైన సంగీతం తో ఉంటుంది.
నాకైతే సినిమా అంతా అంజలి నటన కనబడింది. ఆమె indirect  గా మహేష్ ని వెంకటేష్ ని కూడా కవర్ చేసేసింది అంటే అతిశయోక్తి కాదేమో?[నా వ్యాఖ్య కొంతమందికి కాస్త ఎగష్ట్రా గా అనిపించినా ప్లీజ్ సర్దుకుపొండి]. దర్శకుడు కొత్త బంగారులోకం లో 'ఎకడా' అని హీరోయిన్ తో పలికిన్చినట్టు ఇందులో అంజలి చేత...అస్తమాను "ఏమో బాబు నాకు అన్ని అలా తెలిసిపోతుంటాయి అంతే" అని ఒక విచిత్రమైన గోదావరి యాసలో చెప్పిస్తాడు. ఇంతకి చెప్పడం మర్చిపోయా...సినిమా అంతా మా గోదావరి జిల్లాల్లోనే తీసారు మాటా యాసా అక్కడిదే కూడా.

మరీ సూపర్ డూపర్ హిట్టు 100 కోట్ల కలెక్షన్ అని చెప్పను కాని ఖచ్చితంగా చాలా ఏళ్ల తర్వాత వచ్చిన ఒక మంచి ఆహ్లాదకరమైన సినిమా అని ఘంటా పధంగా చెప్పగలను. కుటుంబం లో అందరు అంటే భార్యా భర్తా, పిల్లా పీచూ, బామ్మా - తాతా అంతా కలిసికట్టుగా వెళ్లి చూసి రావాల్సిన సినిమా............నిజంగా సంక్రాంతి కుటుంబ చిత్రం. (ఇప్పుడే నా Facebook లో ఒక ఫ్రెండ్ అన్నట్టు ఇది నిజంగా సినిమాకి వెళ్లి వచ్చినట్టు లేదు అలా మన పక్కింట్లోకి కాస్సేపు వెళ్లి కూర్చుని వచ్చినట్టు అనిపించింది) 

Rating 3.75/5  

Thursday, January 10, 2013

రాం చరణ్ నాయక్ - తెలుగు సినిమా రివ్యూ


నిన్న కాక మొన్న అంటే జనవరి 8 న దుబాయ్ నించి అబూ ధాబి మాకు తెలుసున్న ఒక మలయాళీ అబ్బాయి టాక్సీ లో వస్తున్నా.. వస్తు దారిలో ఉండగా నేను అబూ ధాబి లో ఒక అతనికి ఫోన్ చేసి “ఒరేయ్ బాబు ఇవ్వాళ సాయంత్రం 7.30 షో కి ‘నాయక్’ ఒక టిక్కెట్టు కొను” అని ఫోన్ లో చెపుతుండగా... మా డ్రైవర్ అష్రఫ్ నాకేసి ఎగాదిగా చూసాడు.  ఫోన్ మాట్లాడడం అయ్యాకా “సార్ ఆ సినిమా ఎవరిదీ? అల్లు అర్జున్ దా”? అన్నాడు. అంటే వాళ్ళ కేరళా లో అల్లు బాగా ఫేమస్ ట. “లేదు నాయనా ఇతను వాళ్ళ చుట్టాలబ్బాయి, ఇతను కూడా పెద్ద హీరో మా state లో” అని చెప్పాను. “ఇప్పుడే కాల్ చేసి చేపుతున్నారంటే చాలా బాగా ఉంటుందేమో సినిమా” అన్నాడు మా వాడు. “లేదు బాబు ఇదేమి పెద్ద కళాత్మక సినిమా కాదు, ఏవో నాలుగు fights, ఒక అయిదు పాటలు, యాభైమంది గ్రూపు డాన్సర్ లు, కొన్ని మూస డైలాగు లు ఉంటాయి” అని చెప్పాను. “కాని కాస్త టైం పాస్ కి వెళ్తాను తప్పదు“ అని అన్నా.
మీకు అనుమానం వస్తోంది కదా? మలయాళీ వాడు అన్నాడు, మరి తెలుగులో దంచేస్తున్నాడు వాడితో అని? “[ఇక్కడ సంభాషణలు వాడితో హిందీ లో జరిగినా జనసామాన్యానికి అనుకూలంగా ఉంటుందని అన్ని సంభాషణలు తెలుగులోనే తెలియపరచదమైనది ]”
సరిగ్గా మన నాయక్ సినిమా మొదలయ్యేముందు ఇలాగే చూపిస్తాడు. “సినిమా లో సన్నివేశాలు కలకత్తా లో జరిగినా ప్రేక్షకుల వీలుగురించి అన్ని సంభాషణలు తెలుగులో జరపడమైనది” (కాస్త అటూ ఇటూగా ఇలాగే రాసారు).
ఇంక సినిమా గురించి:
టాక్సీ వాడితో తప్పు చెప్పాను. ఏవో నాలుగు fights అన్నాను, కాని ఇందులో ఒక నలభై fights ఉన్నాయి. ఆరు పాటలు ఉన్నాయి కాని ఎందుకో సినిమాలో చూస్తున్నప్పుడు మాత్రం అవసరం ఉన్నా లేకపోయినా నిమిషానికో పాటలా అనిపించింది.
రాం చరణ్ మొహం లో పెద్దగా హావ భావాలు పలికిన్చలేకపోయినా హట్టా కట్టా గా fights బాగా చేసాడు. కొన్ని చోట్ల fights కాస్త మరీ అసహజంగా అనిపించినా సినిమాటిక్ గా బాగానే ఉన్నాయి. (కొంతమందికి fights కొండొకచో బోర్ కొట్టినా కొట్టొచ్చు)
హీరోయిన్ కాజల్ - షరా మామూలే వచ్చి మీద పడి అబ్బాయిని ప్రేమించడం వెనకాల పడి తిరగడం. అంతకు మించి పెద్దగా ఏమిలేదు విషయం. ఇద్దరి మీద చిత్రీకరించిన పాట... “ఒక చూపుకే పడిపోయా” పాటలో స్టెప్పులు భలే బాగా నచ్చేసాయి నాకు. బాగా ఉంది ఆ పాట చిత్రీకరణ. 

అలాగే చెప్పడం మరిచిపోయాను మొట్టమొదటి పాట “లైలా ఓ లైలా” పాటలో రామ్చరణ్ స్టెప్పులు బాగున్నాయి. అక్కడ అక్కడ స్టెప్పుల్లో ఎదో కృత్రిమత్వం లా అనిపించినా  బాగా చేసాడు అని ఒప్పుకోవాలి.

రెండో హీరోయిన్ అమలా పాల్ పాపం ఎందుకు తీసుకున్నారో ఏమిటో? ఆవిడ పాత్ర నాకు పెద్దగా అర్ధం అవ్వలేదు రెండో హాఫ్ లో ఎదో ఒకటి రెండు పాటల్లో చూపించడానికి తప్ప.


పాపం మన బొద్దు పంజాబీ పిల్ల చార్మి బతుకు ఆఖరికి item songs కి పరిమితం అయ్యిపోయిందన్నమాట . “యవ్వారమంటే ఎలూరే, నవ్వారు మంచం నెల్లూరే” అన్న item song లో ఒక మెరుపు మెరిసింది...........ఇందులోనూ స్టెప్పులు ఊపుగా ఉన్నాయి.
అక్కడెక్కడో చదివా ఇంటర్వెల్ బ్రేక్ will be like earth shattering type”  అని. build up ఇచ్చినంత సీను లేదు అక్కడ.  రాం చరణ్ డబల్ ఫోటో వాడు కనబడతాడు అప్పుడు అంతే!!
ఇంతోటి సినిమాకి కధంతా కలకత్తాలోనే తియ్యల్సిన అంత అవసరం పెద్దగా కనబడలేదు. బహుశా ఏదైనా సెంటిమెంట్ కావచ్చు.
బ్రహ్మానందం comedy అనుకుని వెళ్ళద్దు ఇందులో అతను పెద్దగా మెప్పించలేకపోయాడు. కానీ మన జయప్రకాష్, పోసాని కృష్ణ మురళి కనబడినప్పుడల్లా మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు. తమన్ సంగీతం ఎలా ఉంటుందో అలాగే ఉంది.
వెళ్తే వెళ్ళండి లేదన్నా పర్వాలేదు.
Rating: 3 (2.5)/5