Showing posts with label anjali. Show all posts
Showing posts with label anjali. Show all posts

Friday, January 11, 2013

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తెలుగు సినిమా రివ్యూ


చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక ‘Socio fantasy’ సినిమా  చూసాను.  ఇలా ఫాంటసీ సినిమా అంటున్నా అని విస్తుపోతున్నారా? నిజమే. ఇందులో ఇప్పటి కాలం సినిమాల్లో వచ్చే ‘ధించ్చాక్ ధించ్చాక్ డప్పు బీట్లు, fights, అరుపులు, కేకలు, పగలు, కుట్రలు కుతంత్రాలు విలనీలు............ఏమి లేవాయే? ఆఖరికి కామెడికి మూసపోసినట్టు ఉండే బ్రహ్మానందం కాని ఎమ్మెస్ నారాయణ కాని లేరాయె? అయినా సరే శ్రీకాంత్ అడ్డాల సినిమా తీసేసాడు అదీ కూడా తెలుగు చిత్ర పరిశ్రమ లో ఉన్న ఇద్దరు అతిపెద్ద హీరోలతో. పోనీ ఊరికేనే తీసిపడేసాడా అనుకుంటే లేదే! అద్దిరి పోయేలా  తీసేసాడు. మనసుకు హాయిగా అనిపించిన సినిమా.
ఈ సినిమా మహేష్ బాబుది, వెంకటేష్ ది అనుకుంటే పొరపాటే.........నా ఉద్దేశం లో ఈ సినిమాలో మీకు అంతర్లీనం గా పూర్తిగా మన ‘రాజోలు పదహారణాల తెలుగమ్మాయి - అంజలి’ కనబడుతుంది. బహుశ అందుకే సినిమా పేరుకూడా ఆమె పాత్ర పేరుమీదే పెట్టారేమో? అంజలి నటించిన పాత్ర పేరు సీత. ఈ అమ్మాయి చాలా చాలా బాగా మంచి ఈజ్ తో నటించింది. సమంత మామూలే కొత్తగా ఏమి లేదు అలాగే నటించింది (అచ్చు దూకుడులో ఉన్నట్టే ఉంది).
పెద్దన్నయ్య గా వెంకటేష్  చాలా  బాగా నటించాడు. అతని చిన్న తమ్ముడిగా మహేష్ చాలా jovial గా నటించాడు. “పెద్దన్నయ్య చాలా అమాయకుడు అయితే చిన్నోడు మాటలతో బూర్లు అల్లేసే రకం”. ఇద్దరు అగ్రశ్రేణి కధా నాయకులకి ఉండాల్సిన ఇగోలు పోటీలు ఇందులో లేకుండా సాదా సీదాగా కధానుసారంగా డైలాగు లు ఉంటాయి, ఆ గొప్పదనం - హీరోలది, దర్శకుడిది. కధా పరంగా పెద్ద కదా ఏమి లేదు సినిమాలో చెప్పుకోడానికి. కధనం మాత్రం బావుంది.పాత్రల ప్రవర్తనకి పెద్దగా పొంతన .....  కారణాలు కనబడకపోయినా చూడ్డానికి చిత్రీకరణ చాలా బావుంది. కొన్ని కొన్ని చోట్ల శ్రీకాంత్ అడ్డాల డైలాగు లు చాల బాగా మంచి అర్ధవంతం గా ఉన్నాయి. నాకైతే ఆ డైలాగు లు కొన్ని  ఎప్పటికి రాసి పెట్టేసుకోవాలి అనిపించింది. (DVD రెలీస్ అయ్యాక కొనుక్కుని రాసుకుంటా- ఇప్పుడు గుర్తు లేవు సరిగ్గా).
వీళ్ళ ఇద్దరు హీరోల తల్లిగా జయసుధ చాలా బాగా ఉంది.తండ్రి గా ప్రకాష్ రాజ్. ఇలాంటివి ఎన్నో వేల పాత్రలు వేసి ఉంటాడు ఆయన. మురళి మోహన్, కోట శ్రీనివాసరావు, వేణు మాధవ్..........వీళ్ళంతా అతిధులు సినిమాలో. తనికెళ్ళ భరణి డి ఒక చిన్నతరహా పాత్ర...........ఆయన కూడా ఎన్నో వందల సార్లు అలాంటి వేషం  వేసి ఉంటాడు. రోహిణి హట్టంగడి వీళ్ళ బామ్మ.
సినిమాని ఇంకాస్త వేగంగా నడిపించి ఉండాల్సింది అనిపించింది. కొన్ని కొన్ని సన్నివేశాలు ముఖ్యంగా మహేష్ – వెంకటేష్ మధ్య ఉన్న ఎమోషనల్ సీన్లు కాస్త కావలసిన దానికన్నా ఎక్కువ సాగ తీశారా అనిపిస్తుంది (అయినా బాగానే ఉన్నాయి పర్వాలేదు). నాకైతే చివరిదాకా వెంకటేష్ కాని మహేష్ బాబు కాని బ్రతుకు తెరువు కోసం ఎంచేస్తుంటారో తెలియలేదు.
భద్రాచలం లో ప్రకాష్ రాజ్ శ్రీరాముల వారి ఉత్సవ విగ్రహాల పల్లకి మోసినప్పుడు నాకైతే కళ్ళమ్మట నీళ్లోచ్చాయి. ఆ సన్నివేశాన్ని చాలా బాగా తీసాడు దర్శకుడు.
పాటలు అన్ని చాలా చాలా బాగా తీసారు. మిక్కి J మేయర్ పాటలు అందించారు. మణిశర్మ back ground score అందించారు. rerecording చాలా వీనుల విందైన సంగీతం తో ఉంటుంది.
నాకైతే సినిమా అంతా అంజలి నటన కనబడింది. ఆమె indirect  గా మహేష్ ని వెంకటేష్ ని కూడా కవర్ చేసేసింది అంటే అతిశయోక్తి కాదేమో?[నా వ్యాఖ్య కొంతమందికి కాస్త ఎగష్ట్రా గా అనిపించినా ప్లీజ్ సర్దుకుపొండి]. దర్శకుడు కొత్త బంగారులోకం లో 'ఎకడా' అని హీరోయిన్ తో పలికిన్చినట్టు ఇందులో అంజలి చేత...అస్తమాను "ఏమో బాబు నాకు అన్ని అలా తెలిసిపోతుంటాయి అంతే" అని ఒక విచిత్రమైన గోదావరి యాసలో చెప్పిస్తాడు. ఇంతకి చెప్పడం మర్చిపోయా...సినిమా అంతా మా గోదావరి జిల్లాల్లోనే తీసారు మాటా యాసా అక్కడిదే కూడా.

మరీ సూపర్ డూపర్ హిట్టు 100 కోట్ల కలెక్షన్ అని చెప్పను కాని ఖచ్చితంగా చాలా ఏళ్ల తర్వాత వచ్చిన ఒక మంచి ఆహ్లాదకరమైన సినిమా అని ఘంటా పధంగా చెప్పగలను. కుటుంబం లో అందరు అంటే భార్యా భర్తా, పిల్లా పీచూ, బామ్మా - తాతా అంతా కలిసికట్టుగా వెళ్లి చూసి రావాల్సిన సినిమా............నిజంగా సంక్రాంతి కుటుంబ చిత్రం. (ఇప్పుడే నా Facebook లో ఒక ఫ్రెండ్ అన్నట్టు ఇది నిజంగా సినిమాకి వెళ్లి వచ్చినట్టు లేదు అలా మన పక్కింట్లోకి కాస్సేపు వెళ్లి కూర్చుని వచ్చినట్టు అనిపించింది) 

Rating 3.75/5