ఇన్నాళ్ళు OSCAR AWARD అంటే అదేదో బ్రహ్మ పదార్ధం అని అనుకునే వాడిని. మనకి
ముఖ్యం గా మన భారతీయులకి Oscar ఎలా వస్తుంది అని అనుకునే వాడిని. కాని గత కొద్ది
అవార్డుల ట్రెండ్ చూస్తే విషయం అర్ధం అయిపొయింది. మన నిర్మాతలు దర్శకులు కూడా
కాస్త దాని మీద కన్నేసి మరికొన్ని ఆస్కార్లు కొట్టెయ్యగలరు అని ఆశ పడుతున్నా.
బంగారు పళ్ళాని కైనా గోడ చేర్పు కావాలి అని ఒక సామెత. అలాగే మనవాళ్ళు తీసిన ఎంత గొప్ప కళాఖందమైనా దానికి ఒక గోడ
చేర్పు కావాలి. ఇక్కడ ఈ గోడ అంటే ఏమిటి ? అని కాస్త పరిశోధిస్తే ఏతా వాతా తేలింది
ఏమిటయ్యా అంటే? ఒక తెల్లోడు మనకి కావాలి. తెల్లోడు ఉంటె చాలు మనకి పని
జరిగిపోయినట్టే. అందుకే నా దృష్టిలో తెల్లోడే ఒక గోడ మనకి ఆస్కార్ తెచ్చుకోడానికి.
అది ఎలా అంటారా? చెపుతా...చెపుతా...
ఇప్పటిదాకా మనకి Oscar nominations
వచ్చిన సినిమాలు చూడండి, తెల్లోడి ప్రమేయం మీకు అందులో తప్పకుండా
కనబడుతుంది. అది Gandhi, Slum Dog Millionaire లేదా ఇప్పటి Life of Pi. అంటే మీ ఉద్దేశం లో మనకి ఇంతకంటే మంచి సినిమాలు రాలేదనా? వచ్చాయి మరి వాటికి
రాని Oscar nomination వీటికి ఎందుకు వచ్చింది? విషయం సింపుల్....ఒక తెల్లోడి పేరు
(ఇక్కడ తెల్లోడు అనగా ఒక విదేశీయుడు అని చదువరులు చదువుకోగలరు) ఉంది ఆ సాంకేతిక నిపుణుల
పేరులో, ముఖ్యంగా దర్శకుడిగా.
ఇప్పుడు కొత్తగా Life of Pi చిత్రం లో ‘Original music score’ కి బొంబాయి జయశ్రీ
గారికి నామినేషన్ వచ్చిందిట. మహా సంతోషం కారణం ఏదైనా మన వాళ్లకి గుర్తింపు
వచ్చింది, అందుకు నేను మనస్పూర్తిగా ఆమెని అభినందిస్తున్నా (కేరళ లోని ఒక కుటుంబం
వారు ఆవిడ ఆ పాటని తమ వంశస్తుల స్వరపరచిన పాటనుంచి యదా తధంగా కాపి కొట్టేసారని గగ్గోలు
పెడుతున్నారు, అది వేరే విషయం అనుకోండి). మీరు చెప్పండి గుండెల మీద చెయ్యేసుకుని, ఆవిడ పాడిన ఆ
పాట కంటే కొన్ని వేల రెట్ల మంచి అమృత భరితమైన పాటలు మన భారతీయ భాషల్లో రాలేదా
ఇంతకు ముందు? ‘జయహో పాట’ కంటే మంచి సంగీతం మన సంగీత దర్శకులు అన్ని రకాల భాషల్లో
అందించలేదా ఇంతకుముందు, మన A R Rahman పాటలలోనే జయహో పాట
అత్యుత్తమమైనదా? అన్నిటికి సమాధానం మీకు తెలుసు, నేను వేరే ప్రత్యేకంగా
చెప్పక్కర్లేదు.
మన తెలుగు సినిమాల్లో Ghost writers ఉన్నట్టే (అంటే కధ
ఎవడో రాస్తాడు పేరు ఇంకేవరిదో వేసుకుంటారు) మనం కూడా ఇంక మన భారతీయ సినిమాల్లో
Ghost Directors ని పెట్టేసుకోవాలి, ఒక తెల్లోడిని వాడుకుని (అదేనండి వాడి పేరుని)
ఒకటి రెండు International film festivals కి పంపిస్తే ఒకటో రెండో ఆస్కార్లు రాకపోవంటారా?
No comments:
Post a Comment