Friday, September 27, 2013

త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ - అత్తారింటికి దారేది

ఒక facebook మిత్రుడు శ్రీనివాసరావు గారు అన్నట్టు, ఇప్పటిదాకా ఒక అత్తా, అల్లుడు ఇద్దరు మరదళ్ళు కధా చిత్రం అనగానే రోతపుట్టించే బూతు ద్వందార్ధాలహాస్యం గుర్తొచ్చే ఈ రోజుల్లో, అవే పాత్రలతో హాయిగా నవ్వుకునే ఒక మంచి కుటుబ కధా చిత్రం మలిచారు త్రివిక్రమ్పవన్ కలిసి.

సినిమా ఆద్యంతం పవన్ కళ్యాణ్ చాలా బావున్నాడు. చాలా చక్కటి controlled నటన కనబరిచాడు.

త్రివిక్రమ్ ‘పంచ్’ డైలాగు లు బాగా పేలతాయి. సమంత ఎదో so - so గా ఉంది. 

ఉన్నంతలో నాకు ప్రణీత కాస్త అందంగా ఉన్నట్టు అనిపించింది (సమంతతో పోలిస్తే). “దేవ దేవం భజే దివ్య ప్రభావం” అన్న పాటలో ప్రణీత చాలా నాజూకుగా, అందంగా కనబడింది. 

ఎందుకో అక్కడక్కడ సమంత పెదాలు ఎదో చీమో/ కందిరీగో  కుట్టి కాస్త వాచినట్టు ఉన్నాయి lipstick లో కవర్ చెయ్యల్సింది.  

HAMSA NANDINI
MUMTAZ
Item song (“ఓరి దేముడో దేముడో – ఎం పిల్లగాడే? మిల్లి మీటరైనా వదలకుండా దిల్లో (దిల్ లో) నిండి నాడే”)లో కనబడిన ఇద్దరు మగువలు (హంసా నందిని, ముంతాజ్) మెరుపు తీగల్లా చాలా బావున్నారు. వాళ్ళ పక్కన ఇద్దరు హీరోయిన్ లు వెల వెల పోయారు అని చెప్పవచ్చు.


కధ క్లుప్తంగా చెప్పాలంటే:
బోమన్ ఇరాని వేసిన పాత్ర ఒక అమిత కొటిశ్వరుడిది మిలన్ (ఇటలీ)లో ఉంటారు . అతనికి ఒక కొడుకు (ముకేష్ రిషి) కూతురు (నదియా), ఒక మనవడు (పవన్). తన కూతురు ఎవరో ఒక బీద లాయర్ని పెళ్లి చేసుకుందని ఇంట్లోంచి పొమ్మంటాడు (కొన్ని ఏళ్ల క్రితం). తర్వాతా తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం తో కుమిలిపోతూ ఉండగా ఆయన మనస్సుని సంతోష పెట్టడానికి మన హీరో ఇండియా వచ్చి తన మేనత్తని ఒప్పించి తిరిగి ఇంటికి తీసుకు రావడానికి బయలుదేరతాడు.   మిగిలిన కధ మీరు ఈ పాటికి ఊహించుకుని ఉంటారు లెండి.
పవన్ వాళ్ళ అత్త ఇంట్లో ఒక డ్రైవర్ గా పనిలోకి చేరతాడు.
పవన్ assistant పాత్రలో ఎమ్మెస్ నారాయణ ‘అద్దరగొట్టాడు’. బ్రహ్మాండమైన టైమింగ్. awesome action. అలీ కూడా బావున్నాడు. సినిమాలో బ్రహ్మానందం కాస్త వేష్టు గా అనిపించాడు నాకు. ఎందుకో ఈ మధ్య ఆయన టైమింగ్ తో కాకుండా - loud comedy చేస్తున్నారు. అప్పుడు అప్పుడు కాస్త ఓవర్ గా అనిపిస్తుంది అయినా కాని బావుంది చూసేయ్యచ్చు అతన్ని. అహల్య, ఇంద్రుడు ఎపిసోడ్ లో వేరే లా అర్ధాలు వెతకక పోతే మంచి నవ్వుతెప్పించే సన్నివేశాలు ఉన్నాయి.
Fights చాల చాల నచ్చేసాయి నాకు. ‘అతను ఆరడుగుల బుల్లెట్టు’ పాట చిత్రీకరణ చాలా బావుంది (అక్కడక్కడ శ్రీను వైట్ల లా అనిపిస్తుంది).
అత్తగారి పాత్రలో - పూర్వపు హీరోయిన్ నదియా చాలా హుందాగా, అందంగా, matured గా ఉంది.
ఈ సినిమాలో చాలా పాత్రలు ఎందుకు పెట్టారో తెలియలేదు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు: ఉదాహరణకి, కోట శ్రీనివాసరావు, ఆహుతి ప్రసాద్, బ్రహ్మాజీ, హేమ, ఇత్యాది.
“అబ్బ మీ eyebrows!! reverse లో ఉన్న Nike సింబల్ ల ఉన్నాయి”. “సింహం జూలుతో జడేయ్యకూడదురోయ్”. “పాము పరధ్యాన్నం లో ఉంది కదా అని పడగ మీద కాలేయ్యకూడదు రోయ్” ఇలా పంచ్ లు చాల చాల ఉన్నాయి ఒకటా రెండా? రేపు మళ్ళి ఇంకో సారి చూసాక బాగా గుర్తు పెట్టుకుని మళ్ళి రాస్తాను.

తప్పక ఒకసారి సకుటుంబ సపరివారం గా వెళ్లి చూసేసి హాయిగా నవ్వుకుని రావచ్చు. నాదీ హామీ.

Friday, August 23, 2013

చరిత్ర - దాని కధా కమామిషు


 



ఈ మధ్యన ఎక్కడ చూసినా ప్రతీవాడూ “చరిత్రని మరవద్దు” అని హెచ్చరిస్తూ ఉన్నారు. లేదా చరిత్ర చూస్తే మనకి తెలుస్తుంది అందుకే ‘అలా ఉండాలి, ఇలా ఉండాలి’ అని లెక్చర్లు దంచేస్తున్నారు. ఒక్కసారి సరిగ్గా కూర్చుని అసలు చరిత్రలో ఏముందా  అని ఆలోచిస్తే అన్ని విషయాలు మనకి బోధపడతాయి. చరిత్రని మనం ఒక టిష్యూ పేపర్ లాగా వాడుకుంటున్నాం అన్న విషయం సుష్పష్టంగా కనబడుతుంది. (చరిత్ర)నచ్చితే మడత పెట్టి దాచుకోవడం లేదా సుబ్బరంగా తుడిచి పడెయ్యడం.
రెండు జర్మనీలు పోలో మని చరిత్ర మీదే ఆధార పడితే, దాన్నే పట్టుకు వేళ్ళాడితే – ఇవ్వాళ ఆ బెర్లిన్ వాల్ కూలగొట్టబడేది  బడేది కాదు. అదే చరిత్రని నిజంగా నమ్మి ఉంటె ఇవ్వాళ ఇండియా పాకిస్తాన్ విడిపోయేవే కాదు. గుడ్డిగా ఇదే మా పాత చరిత్ర అని ఇంకా పట్టుకు వేళ్ళాడితే ఇంకా దేశం లో అస్పృశ్యత ఎక్కడ బడితే అక్కడ కనబడేది. అసమానతలు ఇంకా పెచ్చరిల్లెవి. కాలానుగుణంగా పద్దతులు చారిత్రాత్మక నిర్ణయాలు మారాలి, మారుతున్నాయి కూడా. కన్యాశుల్కం పోయి కట్నాలు వచ్చాయి, ఇప్పుడు కట్నాలు కూడా పోయే రోజులు బాగా దగ్గరలోనే ఉన్నాయి. గట్టిగా మాట్లాడితే అబ్బాయిలకి ఇప్పుడు సరైన జోడి దొరకడం కాస్త కష్టం అయ్యిందేమో కూడా!!
రాజకీయాల్లో ఈ చరిత్రలని ఎంత తొందరగా మర్చిపోతే అంత దేశానికి మంచిది. ఎప్పుడో సినిమాల్లో ఉన్నప్పుడు NTR జై ఆంధ్రా అని ఉద్యమించి ఉండవచ్చు, కానీ తర్వాత ఆయన కోట్లాది తెలుగు వాళ్లకి ఏకైక నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు వెనక్కి వెళ్లి ‘చరిత్రని తవ్వుకుని’ అదిగో అప్పుడు NTR జై ఆంధ్రా అన్నాడు అందుకని ఇప్పుడు ఇచ్చెయ్యండి అంటే బాగోదు. అప్పటికి అది ఇప్పటికి ఇది అనుకోవాలి. కాలానుగుణంగా ఆయన ఆలోచనా తీరు మారింది అనుకోవాలి. తెలుగు దేశం లో మంత్రిగా ఉండగా ‘ప్రభుత్వోద్యోగాల్లో జోనల్ సిస్టం సుద్ధ వేష్టు పీకి పారెయ్యాలి, అది రాష్ట్రానికి మంచిది’ అని శ్రీ కల్వకుంట చంద్రశేఖర్ రావు గారు అసెంబ్లీ లో గట్టిగా ఉపన్యసించారు. ఇప్పుడు అదే పాయింటు మీద తెలంగాణా ఉద్యమం ఉవ్వెత్తున లేవతీసింది ఆయనే (G.O. లో 14F గురించి). ఇప్పటి కాలానుగుణంగా ఈ పాయింటు కావాలి పాత చరిత్ర అక్కర్లేదు.
అప్పుడు జై ఆంధ్రా అన్నారు కొందరు, ఇప్పుడు వాళ్ళే సమైక్య ఆంధ్రా అంటున్నారు. మరి చరిత్ర సంగతి? అప్పుడు తెలంగాణా ఊసే లేదు (అరవై ఏళ్ల ఉద్యమం అని అందరు అంటున్నా... చెన్నారెడ్డి ముఖ్య మంత్రి అయిపోయాకా, నిజానికి ఏక ధాటిన 20-30 ఏళ్ళు ఎక్కడా ఒక్క ప్రస్తావన కూడా తెలంగాణా గురించి రాలేదు. కొందరు ఒప్పుకోపోయినా ఇది పచ్చి నిజం?) ఇప్పుడు మాకు వేరే రాష్ట్రం కావాలి అంటున్నాం, ఎందుకంటే ఇది అరవై ఏళ్ల ఉద్యమం అంటున్నాం, పాత చరిత్ర తవ్వుకుంటున్నాం మనకి అవసరం కాబట్టి తప్పు లేదు ఇందులో.

ఏతా వాతా ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే చరిత్ర అన్నది ఒక సాకు, మనకి నచ్చితే – చరిత్రని చూపించి వాడుకుంటాం, నచ్చక పోతే ఎదుటివాడికి “ఎవడో ఎదో తెలిసో తెలియకో తప్పుచేసాడని మనం కూడా అదే తప్పు చేస్తామా” అని క్లాసుపీకుతాం.        

Saturday, August 10, 2013

Veg - Non veg సాంప్రదాయాలు - నా సందిగ్ధం




ఒక్కోసారి కొన్ని విషయాలు మనం అస్సలు పట్టించుకోము, సరిగ్గా చెప్పాలంటే అన్ని మనకి తెలుసు అనుకుంటాం కాని మనకే కొన్ని విషయాలు సరిగ్గా తెలియవు కూడాను. మన చుట్టుపక్కల మనం పుట్టి పెరిగిన వాతావరణం, పరిసరాలు ఆచార సాంప్రదాయాలు పుట్టుకతో వచ్చిన అలవాట్లు మనల్ని అసలు అలాంటి తర్కం వైపు తీసుకెళ్లవు కూడాను.
నా విషయం లో కూడా సరిగ్గా ఇలాంటిదే ఒక సన్నివేశం జరిగింది.
బహుశా మీకు తెలిసే ఉంటుంది నేను ఉద్యోగ రీత్యా అబూ ధాబి (U A E) లో పనిచేస్తున్నా. ఇది ఒక పూర్తి  ఇస్లామిక్ దేశం. ఇక్కడి అలవాట్లు కట్టుబాట్లు మనకి పూర్తిగా విరుద్ధం గా ఉంటాయి.
ఒకసారి మా బాంక్ లో మా మానేజర్ (ఆయన ఇక్కడి స్థానిక అరబ్ జాతీయుడు) ఒక మధ్యాన్నం రోజు అందరికి లంచ్ ఆర్డర్ ఇచ్చారు. స్వచ్చమైన సాంప్రదాయ అరబిక్ లంచ్ వచ్చేసింది. తినే వాళ్లకి, ఇష్టం ఉన్నవాళ్ళకి...వాసనలు ఘుమ ఘుమ లాడిపోతున్నాయి. నాకేమో ఏది తినడానికి పాలుపోవడం లేదు (నేను శుద్ధ శాఖాహారం తింటాను). అయినా బాగోదు అని సభా మర్యాద కోసం కాస్త నాలుగు సలాడ్ ముక్కలు ప్లేట్లో వేసుకుని కూర్చున్నా (తింటున్నట్టు పోజ్ కొడుతూ). ఎదురుగా మా బాసు కూర్చున్నాడు. నన్ను చూసి ఒకింత ఆశ్చర్యంతో... “అయ్యో ఏమి వేసుకోలేదే ఇది వేస్కో” అని చాలా ఆప్యాయంగా అడుగుతూ చేతిలో ఉన్న మటన్ బిర్యాని నా ప్లేట్లో వెయ్య బోయారు. అనుకోని ఆ చర్యకి ఒక్క ఉదుటున ఈ లోకం లోకి వచ్చిన నేను ఆదరా బాదరాగా నా ప్లేటు వెనక్కి లాగేసుకుని “అయ్యో వద్దులెండి సార్, ఇది (సలాడ్) చాలా బావుంది”  అని ఎదో కాస్త కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసాను. “అదేంటి” అని ఆయన కుసింత ఆశ్చర్యంగా అడిగారు. అప్పుడు (ఆయన్ని నొప్పిస్తానేమో అని కాస్త మొహమాటం తో) “అబ్బే వద్దులెండి నేను నాన్-వెజ్ తినను” అని నసిగాను. అసలు ఆయనకీ నాన్-వెజ్, వెజ్ కి మధ్య తేడా తెలియదు. ఆయన ఉద్దేశం లో అంతా భోజనమే!! కాస్త క్లుప్తం గా వివరించా వెజ్ అంటే ఏంటో? ప్రపంచం లో ఉన్న ఆశ్చర్యాన్ని అంతా  పోగేసి, “ఆహ్ అలాగా కూడా ఉంటారా జనం  ప్రపంచంలో” “ఎందుకలా?” అన్నారు. ఎంచేప్పాలా అని అనుకుంటూ ఉంటె, ఆయనే అన్నారు: “Is it for some Religious purpose?” అని, “హమ్మయ్య బ్రతికించారు” అనుకుని, అవును అదే అదే అని క్లుప్తంగా ముగించేసాను సంభాషణ. కాని అప్పుడు నేను ఆ సమాధానం తో ఇంకా పెద్ద సందిగ్ధంలో లో పడబోతున్నా అని అనుకోలేదు సుమా.  What is your Religion? అని అడిగారు. నేను చెప్పాను Hindu అని.

“సరేలే నాన్-వెజ్ తినోద్దులే” అని ఆ మటన్ బిర్యాని ప్లేట్ లో అన్నం మీద వారగా పడుకోబెట్టిన లేత మేక కాలుని ఒక చేత్తో కాస్త ఎత్తి పట్టుకుని, దాని కింద ఉన్న బాస్మతి రైస్ ని చూపిస్తూ “come take this rice” అని సౌంజ్ఞ చేసారు. “అబ్బే వద్దులెండి సార్” అని నసుగుతున్నా... “ఏంటి ఆలోచన, మీ భారతీయులు కూడా అన్నం తింటారు కదా? రా తీసుకో- తిను” అన్నారు. ఆయనకీ ఎలా చెప్పను ఆ మాంసం ప్లేట్ లోంచి నేను అన్నం విడిగా తీసుకుని తినలేను అని?  నా బాధ ఆయనకీ అర్ధం అవ్వట్లేదు. సరే చివరకి ఆయనకీ విడమరచి చెప్పేసా, అలా మేము తినము అది మా ఆచారం ఒప్పుకోదు అని. “ఆహ్ అయ్యో సారి నాకు తెలియదు” అని ఆయన అక్కడికి వదిలేసారు. అక్కడే మా ఇంకో కొలీగ్ సజిష్ అని మలయాళీ అతను సుబ్బరంగా చికెన్, మటన్ దట్టించి లాగించేస్తున్నాడు. మా బాసు అతన్ని చూపించి నాతో అన్నారు: “what is Sajish’s Religion?” “హిందూ అండి” – చెప్పాను. చెపుతూనే నాకు అర్ధం అయ్యింది తర్వాతి ప్రశ్న ఏమి రాబోతోందో? “మరి అతను తింటున్నాడే? నువ్వెందుకు తినట్లేదు?” కుతూహలం తో అడిగేసాడు ఆయన. ఆయనకీ కాస్త విడమర్చి చెప్పాను, “మేము బ్రాహ్మలం, అతను వేరే కులం వాళ్ళు, వాళ్ళ కులం లో వాళ్ళు తినొచ్చు తప్పులేదు, ఆచారం ఒపుకుంటుంది” అని. ఆయనకీ ఆ కులం అన్న concept అర్ధం కాలేదు, అయినా సరే కాస్త అనుమానం తో OK అని తలూపేసాడు.
ఇంకోసారి మా బ్రాంచ్ లో ఎవరిదో పుట్టిన రోజు అయ్యింది. అప్పుడు లోకల్ ఇండియన్ హోటల్ నించి ఏవో తినడానికి తెప్పించారు. అందరు తింటున్నారు అన్ని వెజ్ డిష్ లే. ఇడ్లి/ దోశా/ సమోసా అవీను. ఆయనకీ కూడా అవి బాగా నచ్చాయి తింటున్నాడు. ఉన్నట్టుండి ఆయన కళ్ళు ఒక స్టాఫ్ మీద పడ్డాయి. మా ఇంకో కొలీగ్ శ్రీనివాసన్ (తమిళుడు – అయ్యంగార్లు) ఏమి తినట్లేదు ఖాళీగా కూర్చున్నాడు. ఆయన అతని దగ్గిరకి వెళ్లి అడిగాడు, “అదేంటి శ్రీని ఏమి తినట్లేదే?”. అతను మొహమాటంగా మొహం పెట్టి ఎదో అస్పష్టంగా నసిగాడు. చివరకి అర్ధం అయ్యింది ఏమిటి అంటే? ఆ రోజు వచ్చిన అన్ని ఐటమ్స్ లో వెల్లుల్లి ఉందిట. వాళ్ళు వెల్లుల్లి తినరు. ఇప్పుడు జుట్టు పీక్కోడం మా మేనేజర్ వంతు అయ్యింది. ఆయనకీ ఎక్కడా లెక్కలు కుదరడం లేదు. “వీళ్ళు హిందూ అంటారు – కాని కొంతమంది వెజ్ తింటున్నారు, నాన్-వెజ్ కొంతమంది తింటున్నారు. మరి వెజ్ వాళ్ళల్లో కొంతమంది వెల్లుల్లి తినరుట”. “అసలు మీకు ఇవన్ని ఎలా తెలుస్తాయి, తెలిసినా ఎలా గుర్తుంటాయి? ఎలా మేనేజ్ చేస్తారు జీవితం, పెళ్ళిళ్ళు, సంబంధాలు అవీ ఎలా?” అని ఒక సవాలక్షా ప్రశ్నలు సంధించేసాడు.
అప్పుడు నాకు అనిపించింది మనం ఇక్కడ ఇండియా లో పుట్టి పెరగడం వల్ల అసలు ఎప్పుడు మనకి ఇలాంటి సందిగ్ధాలు ఎదురుపడలేదు. మనకి అన్ని auto pilot లో నడిచిపోతాయి. కాని మన ఆచార సాంప్రదాయాలు (మంచైనా సరే చెడైనా సరే) తెలియని వాళ్లకి ఇవన్ని అర్ధం చేసుకోవాలి అంటే ఒక జీవిత కాలం పడుతుంది.

[చదువరులకి ఒక మనవి – ఇక్కడ నేను ఒక చిన్న సన్నివేశం ఆధారంగా నడిచిన కొన్ని సంఘటనలు మాత్రం గుర్తుచేసుకుంటున్నా, ఇందులో కులప్రస్తావనలు, మత ప్రస్తావనలు తీసుకు రావద్దు ప్లీజ్. మనం చాలా సామాన్యంగా తీసుకునే విషయాలు అవతలి వాళ్లకి ఎలా కనబడతాయి అన్న విషయం మీదనే నేను దృష్టి కేంద్రీకరించాను అని మనవి చేసుకుంటున్నా] 

Friday, May 31, 2013

ఇద్దరమ్మాయిలతో (అల్లు అర్జున్) సినిమా రివ్యూ

మనతెలుగు సినిమాకి మంచిరోజులు వచ్చేస్తున్న సూచనలు చాలా బాగా కనబడుతున్నాయి. అవును నిజమే అండి. పెద్ద పెద్ద హీరోలవి 40 – 50 కోట్లు పెట్టి తీసే పెద్ద పెద్ద బేనర్ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయిపోతున్నాయి. ఇలా తీస్తూ పోతే కొన్నాళ్ళకి ఈ పెద్ద బేనర్లు, ఈ సోకాల్డ్  పెద్ద హీరోలు కాల గర్భం లో నష్టాలతో మట్టి కొట్టుకుపోయి కలిసిపోతారు. అప్పుడు ఆ మట్టిలోంచి మళ్ళి మామూలు మంచి సినిమాలు వస్తాయని నాకు నమ్మకం.
మీరు బాగా షార్ప్, ఇప్పటికే కనిపెట్టేసి ఉంటారు. అవును ఈ బ్లాక్ బస్టర్ “ఇద్దరమ్మాయిలతో” చాలా పరమ చెత్తగా చాలా బోరింగ్ గా ఉంది.

సినిమాలో కాస్తో కూస్తో బావున్నది అల్లు అర్జున్ నటన, ఆ కొత్తమ్మాయి కేథరిన్ తెరెసా. ఎందుకో నాకు ఈ అమ్మాయిని చూస్తున్నంత సేపు కొత్త బంగారు లోకం లో నటించిన శ్వేతా బసు ప్రసాద్ గుర్తుకు వచ్చింది. ఇంతోటి సినిమాకి అక్కడికేక్కడికో యూరప్ వెళ్లి సినిమా తియ్యవలసిన అవసరం ఏమిటో నాకైతే అర్ధం కాలేదు. బోలెడు డబ్బు ఖర్చు తప్ప. మళ్ళి ఇంతోటి సినిమాకి అన్ని అయ్యాకా మళ్ళి ఏవో కొన్ని రీషూట్ కూడా చేసారుట..!!!
ఇంక బ్రహ్మానందం ఎంత తొందరగా సినిమాలు మానేసి ఇంట్లో కూర్చుంటే అంత మంచిది. ఈ సినిమాలో అతని కామెడి చాలా విసుగొచ్చింది. ఎంత మొహమాటం గా నవ్వుదామన్నా నవ్వు రాలేదు. అలీ కూడా వేష్టే ఇందులో. ఇందులో ఈ కామెడి చాలా loud గా ఉంది అయినా కూడా అస్సలు నవ్వు తెప్పించలేకపోయింది. చాలా మంది జనం మధ్యలో అసహనానికి లోనవ్వడం మనం గమనించ వచ్చు.
చిత్ర సంగీతం నవతరానినికి నచ్చుతుందేమో? నాకు ఏ పాటా కూడా పెద్దగా చెప్పుకోదగ్గట్టు అనిపించలేదు. దేవీశ్రీ ప్రసాద్ కూడా, తమన్ లాగా అన్ని వాయిద్యాలు వేసి బాదుడు తప్ప.
ఈ మధ్య ఒక కొత్త ట్రెండ్ చూస్తున్నా – తెలుగు చిత్ర సీమలో....” సినిమా ఫుల్లు మాస్సు గురూ” అంటున్నారు. ఈ మాస్ అంటే ఏమిటో ఇందులో కొంచం నాకు అర్ధం అయ్యింది. హీరో హీరోయిన్ లు ఎంత చదువుకున్నా, ఎంత సంస్కారం ఉన్నా... తెలుగు భాషనీ కాస్త ఒక మెట్టు కిందకి దింపి మాట్లడడం అన్న మాట – “మాస్” అంటే. “లేసిపోద్ది  (లేచిపోతుంది అనడానికి), లెగు – (లేవరా అనడానికి), సచ్చిపోతావు (చచ్చిపోతావు అనడానికి). అలాగే ఈ మధ్య ప్రతీ సినిమాలో పెడుతున్నట్టే...ఇందులో కూడా పెట్టాడు దర్శకుడు.. హీరోయిన్ హీరోతో అంటుంది...”నీకు ఎప్పుడో పడిపోయాన్రా”, “నువ్వు నాకు నచ్చావు రా”, “నువ్వు వొద్దన్నా నేను నువ్వంటే పడి సస్తారా,” ఇలాంటి పదాలు తన ప్రేమని వ్యక్తీకరించడానికి ఉపయోగిస్తూ ఉంటుంది.
సినిమా మొదటి భాగం బాగా సాగాతీసినట్టు అనిపిస్తుంది... రాం చరణ్ ఆరెంజ్ లాగా మొదటి భాగం అంతా కలర్ ఫుల్ గా ఎదో అలా నడిచిపోతూ ఉంటుంది కాని ఎందుకో ఏమిటో ...... సెకండ్ హాఫ్ కాస్త బెటర్, ఎదో కాస్త కధ కదులుతుంది (నమ్మ శక్యంగా లేకపోయినా) ఎదో ఒకటి నడుస్తుంది. చివర్లో ఇద్దరు అమ్మాయిలతో ఏమి చెయ్యాలో తెలియక – కొత్తమ్మయితో ఒక డైలాగు చెప్పిస్తాడు దర్శకుడు..”ఏమోనమ్మ మీరు ఇద్దరూ కొట్టుకుని ఎప్పుడైనా విడిపోకుండా ఉనటారా? నేను మధ్యలో దూరకపోతానా? ఇది ఇక్కడితో ఆగలేదు, ఇంకా ఉంది” అంటుంది. వేచి చూడండి ఇద్దరంమాయిల పార్ట్ 2.
ఈ సినిమాలో converted brahmins – “బాప్నీస్” ట  అన్న ఒక కొత్త పదం coin చేసాడు దర్శకుడు కామెడీగా (అనుకుని). దాని అర్ధం ఏమిటో ఆ దర్శకునికి ఆయనకీ మాటలు రాసిపెట్టే కొసరు కధకుడికి మాత్రమె తెలియాలి.

సినిమా అయిపోయాకా ఆఖరున స్క్రీన్ మీద మన పూరి గారి టైటిల్ కార్డ్ వస్తుంది THANKS FOR WATCHING THIS MOVIE – PURI JAGANNADH”. అవును నిజమే, ఇంత రిస్క్ తీసుకుని ఇలాంటి సినిమాని చివరి దాకా కూర్చుని చూసినందుకు మనకి ఆ మాత్రం థాంక్స్ చెప్పద్దూ??

Friday, April 5, 2013

బాద్షా - తెలుగు సినిమా రివ్యూ


దూకుడు సినిమా ..దూకుడు తర్వాత శ్రీను వైట్ల తీసిన సినిమా “బాద్షా”.

ఈ సినిమా ఎదో చాకులా ఉంది అన్నారు, కొందరు కత్తి అన్నారు మరికొందరు తోపు అన్నారు...ఇంకొందరు తురుము...పుడింగ్ అన్నారు. ఈ రివ్యు రాసేటప్పటికి కూడా ప్రతి చానెల్లో, వార్తల్లోకూడా చాలా మంది అదే అంటున్నారు. మరి అంత మంది అలా అంటుంటే నేను మాత్రం “అబ్బే ఈ సినిమా ఎదో ఒక మాదిరిగా ఉంది” అంటే వాళ్ళంతా మీద పడి నన్ను పీకుతారేమో? అయినా పర్వాలేదు చెప్పేస్తాను..నాకైతే ఈ సినిమా చాలా సదా సీదా గా ఉన్న ఒక మాస్ - మూస సినిమాలా ఉంది. గట్టిగా మాట్లాడితే మన శీను గారు తీసిన ‘రెడీ’, దూకుడు’ లానే ఉంది కాస్త actors మారారేమో అంతే!

హీరో ఎంట్రీ మామూలుగా అనుకున్నట్టే ఉంది. ఆ గొలుసులు, గొళ్ళాలు, అవన్నీ ఎలా విరగ్గొట్టుకుని బంధన నించి వెలువడతాడో..మనకి అనవసరం కాని, తెరతియ్యగానే ఒక ఫైట్. అలా ప్రతి అయిదు నిమిషాలకి ఒక ఫైట్ ఉంటుంది మొదటి భాగం లో.  మనకి ఇంక చిరాకు వేసి లేచి బయటకి పోదామా అనుకునే లోపు అదృష్టవశాత్తు ఇంటర్వెల్ వచ్చేస్తుంది.

మొదటి భాగం లో చెప్పుకోవాల్సిన వి ముఖ్యంగా కాజల్...చాల refreshing గా కనబడుతుంది. అమాయకపు తెలివితేటల నటన బాగా చేసింది, కొన్ని ‘బంతి’ ఆధారిత డవిలాగులు బాగా పేలతాయి. వెన్నెల కిషోర్ సన్నివేశాలు కూడా పర్వాలేదు. 

అనుకున్నంత లేకపోయినా ఎదో ఉన్నంతలో ఎమ్మెస్ నారాయణ కూడా పర్వాలేదు అనిపించాడు. సినిమా రంగం లో తనకి నచ్చని  వాళ్ళ అందరి మీదా సెటైర్లు వేసాడు ఎమ్మెస్ పాత్ర ద్వారా...అసలు ఆ పాత్రే రాంగోపాల్ వర్మది. అలాగే దిల్ రాజు మీదా కొన్ని జోకులు ఉంటాయి. జూనియర్ కాస్త మీసం గెడ్డం, క్రాపు మార్చాడు కాని మిగతా తేడా ఏమి లేదు.

రెండో భాగం లో బ్రహ్మి వచ్చాక కాస్త జీవం వస్తుంది సినిమాకి. నాజర్ చాలా బాగా చేసాడు కామెడి. కాని అన్ని పాత్రలు రెడి సినిమా నించి, దుబాయ్ శీను సినిమా నించి, దూకుడు నించి వచ్చేస్తాయి. కొన్ని సన్నివేశాలు కూడా అచ్చు అలానే వచ్చేస్తాయి. చివర్లో మన జూనియర్ - సీనియర్ ఎన్టీఆర్ పాటలు కొన్నిటికి స్టెప్పులు వేస్తాడు, కాని అది అనుకున్నంత comedy ఎఫెక్ట్ రాలేదు అని నా అభిప్రాయం. సినిమా - అందులో సగం flashback , మళ్ళి సినిమా, మళ్ళి flashback...ఉన్నట్టుండి చివర్లో  మనవాడు పెద్ద పోలీస్ ఆఫీసర్ ..IPS ట.

పేరుకు చాలా మంది కళాకారులు ఉన్నారు ఇందులో..మహేష్ బాబు (వాయిస్ ఓవర్), నవదీప్, సిద్ధార్థ్, కెల్లి దోర్జీ, తనికెళ్ళ భరణి, చంద్రమోహన్, సుహాసిని, ఆశిష్ విద్యార్థి, ముకేష్ రిషి, ఎవరికీ ఒక పావు గంట పాత్ర లేదు.
ఇలాంటి సినిమాల్లో పెద్దగా కధ, కాకరకాయ అవి చూడకూడదు అని తెలుసు కాని, మరీ ఇంత ఎటకారంగా కూడా ఉండకూడదు కదండీ మరి?

తమన్ సంగీతం చాలా పేలవంగా ఉంది. అన్నిపాతల్లో స్టెప్పులు ఒక్కలాగానే ఉన్నాయి. ఆ “కనకం” పాట కాస్త పర్వాలేదు అనిపించినా...చిత్రీకరించిన తీరు మాత్రం దూకుడులో పార్వతి మెల్టన్ పాటని గుర్తు తెస్తుంది. నాకైతే మక్కి కి మక్కి అలానే అనిపించింది.

“Success breeds success” అని విన్నా కాని మరీ ఇలా success అయిన సినిమాలని ఇలా దింపేస్తారు అని అనుకోలేదు.

చెప్పాల్సింది చెప్పాను, చూసేది మానేది మీ ఇష్టం. (2/5)

Tuesday, March 12, 2013

మిధునం - తెలుగు సినిమా



శ్రీరమణ రచించిన మిధునం కధ ని సినిమా గా తీసిన తనికెళ్ళ దశ భరణి గారి చిత్ర రాజములోని కొన్ని అధ్బుతమైన డైలాగులు, నలుగురికి చెప్పి వాళ్ళని ఆ అద్భుత కళా ఖండాన్ని చూసేలా చెయ్యాలన్న తాపత్రయమే తప్ప, ఏవో copy rights అవీ ఉల్లంఘించాలని కాదుసుమా!!!




Ø దాంపత్యమూ - ధప్పళము (గుమ్మడికాయ ముక్కల పులుసు )....మరిగిన కొద్దీ రుచి"

Ø దొంగ బెల్లం ...దొంగ ముద్దు, అనుభవిస్తే కాని తెలియదు"

Ø అంతే కాని ఇప్పుడు? ప్రతీ వాడికి శంఖు చక్రాల్లా బీపీ, షుగరూ....!!!
ఎందుకు రావు? 
నీళ్ళకి స్విచ్చి, నిప్పులకి స్విచ్చి, పచ్చడికి స్విచ్చి, పిండికి స్విచ్చి....ఆఖరికి ఆ స్విచ్చివేసుకోడానికి ఓపిక లేకుండా దానికి కూడా ఓ రిమోటు స్విచ్చి!!!!"

Ø మనిషిగా పుట్టడం సులువేనయ్యా...కాని మనిషిలా బ్రతకడమే కష్టం"

Ø ఒక్కడ్నో ఇద్దర్నో కంటా వనుకుని పెద్దవాడికి కృష్ణా అని పేరు పెట్టాను...ఏడాది తిరగకుండా పుట్టుకోస్తుంటే.. ప్రతీ సంవత్సరం పేర్ల కోసం ఎక్కడ అఘోరించడం అనీ.............ఇంకా నావల్లకాక...కేశవ నామాలు అందుకున్నా...!!"

Ø ఊరగా............ఊరగా....ఊరగాయ.
కోరగా ....కోరగా.........కొబ్బరి"

Ø కలలు కన్న దేశానికి వెళ్ళాకా ...కన్న దేశం కలలోకి వస్తుంటుంది"

Ø " అదే మనం Air-India flight ఎక్కామనుకోండి? మన air-hostess కాఫీ తెచ్చేలోపు అమెరికా వచ్చేస్తుంది



Friday, February 22, 2013

జబర్దస్త్ - తెలుగు సినిమా రివ్యూ



జబర్దస్త్ - సిద్దార్థ్ & సమంత (నిత్యా మీనన్ ప్రత్యెక పాత్రలో), నందిని రెడ్డి(అలామోదలయ్యింది ఫేమ్)- దర్శకత్వం

హిందీ లో వచ్చిన Band Bajaa Baraat చిత్రానికి నకలు ప్రయత్నం. మొదటి భాగం వరకు పూర్తిగా ఆ హిందీ చిత్రంకి అనువాదం కాబట్టి చాలా బాగా తీసింది దర్శకురాలు. చిత్రం కూడా బాగానే సాగిపోతుంది కాస్త నవ్వుకోవచ్చు. సమంత సిద్దార్ద్ బావున్నారు.

రెండో భాగం వచ్చేసరికి దర్శకురాలు తన స్వంత బుర్ర ఉపయోగించి తనదైన సినిమాని చిత్రకల్పన చేసారు. పూర్తిగా కుక్కలు చింపిన విస్తరిలా తయారయ్యింది సినిమా. ఎక్కడికి వెళ్తున్నామో? ఎంచూస్తున్నామో అర్ధం కాని పరిస్థితి. రెండో భాగం లో సినిమా చాలా వెర్రి మొర్రి మలుపులు తిరుగుతుంది..చాలా చోట్ల చిరాకువేస్తుంది కూడా.

తాగుబోతు రమేష్ ని ఒక హాస్య నటుడు అని అనుకోమంటే నేను ఒప్పుకోను. ఇతన్ని ఇలాగే చూస్తూ చూస్త్హూ ఉంటె ...... చాలా చిరాకు వేస్తోంది. అతను ఎంత త్వరగా అలాంటి పాత్రలు మానేస్తే అతనికి అంత మంచిది అని నా అభిప్రాయం.

సాయాజీ షిండే, శ్రీహరి పాత్రలు అసలు ఎందుకో నాకు అర్ధం కాలేదు. నిత్యా మీనన్ పాత్ర చిన్నదే  కాస్సేపు బావుంది, అదృష్టం కలిసివచ్చి  సీక్వెల్ గా రెండో సినిమా తీస్తే ఎందుకైనా ఉంటుందని శుభం కార్డులో నిత్యా మీనన్ మొహం అలా చూపిస్తారు అని అనుకుంటా!!!

మరీ ఖర్మ కాలిపోతే తప్ప ఈ సినిమాని వెళ్లి చూడక్కర్లేదు. లేదా వెళ్లి మొదటి భాగాన్ని చూసేసి రండి.

2.5/ 5