Showing posts with label Abu Dhabi. Show all posts
Showing posts with label Abu Dhabi. Show all posts

Saturday, August 10, 2013

Veg - Non veg సాంప్రదాయాలు - నా సందిగ్ధం




ఒక్కోసారి కొన్ని విషయాలు మనం అస్సలు పట్టించుకోము, సరిగ్గా చెప్పాలంటే అన్ని మనకి తెలుసు అనుకుంటాం కాని మనకే కొన్ని విషయాలు సరిగ్గా తెలియవు కూడాను. మన చుట్టుపక్కల మనం పుట్టి పెరిగిన వాతావరణం, పరిసరాలు ఆచార సాంప్రదాయాలు పుట్టుకతో వచ్చిన అలవాట్లు మనల్ని అసలు అలాంటి తర్కం వైపు తీసుకెళ్లవు కూడాను.
నా విషయం లో కూడా సరిగ్గా ఇలాంటిదే ఒక సన్నివేశం జరిగింది.
బహుశా మీకు తెలిసే ఉంటుంది నేను ఉద్యోగ రీత్యా అబూ ధాబి (U A E) లో పనిచేస్తున్నా. ఇది ఒక పూర్తి  ఇస్లామిక్ దేశం. ఇక్కడి అలవాట్లు కట్టుబాట్లు మనకి పూర్తిగా విరుద్ధం గా ఉంటాయి.
ఒకసారి మా బాంక్ లో మా మానేజర్ (ఆయన ఇక్కడి స్థానిక అరబ్ జాతీయుడు) ఒక మధ్యాన్నం రోజు అందరికి లంచ్ ఆర్డర్ ఇచ్చారు. స్వచ్చమైన సాంప్రదాయ అరబిక్ లంచ్ వచ్చేసింది. తినే వాళ్లకి, ఇష్టం ఉన్నవాళ్ళకి...వాసనలు ఘుమ ఘుమ లాడిపోతున్నాయి. నాకేమో ఏది తినడానికి పాలుపోవడం లేదు (నేను శుద్ధ శాఖాహారం తింటాను). అయినా బాగోదు అని సభా మర్యాద కోసం కాస్త నాలుగు సలాడ్ ముక్కలు ప్లేట్లో వేసుకుని కూర్చున్నా (తింటున్నట్టు పోజ్ కొడుతూ). ఎదురుగా మా బాసు కూర్చున్నాడు. నన్ను చూసి ఒకింత ఆశ్చర్యంతో... “అయ్యో ఏమి వేసుకోలేదే ఇది వేస్కో” అని చాలా ఆప్యాయంగా అడుగుతూ చేతిలో ఉన్న మటన్ బిర్యాని నా ప్లేట్లో వెయ్య బోయారు. అనుకోని ఆ చర్యకి ఒక్క ఉదుటున ఈ లోకం లోకి వచ్చిన నేను ఆదరా బాదరాగా నా ప్లేటు వెనక్కి లాగేసుకుని “అయ్యో వద్దులెండి సార్, ఇది (సలాడ్) చాలా బావుంది”  అని ఎదో కాస్త కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసాను. “అదేంటి” అని ఆయన కుసింత ఆశ్చర్యంగా అడిగారు. అప్పుడు (ఆయన్ని నొప్పిస్తానేమో అని కాస్త మొహమాటం తో) “అబ్బే వద్దులెండి నేను నాన్-వెజ్ తినను” అని నసిగాను. అసలు ఆయనకీ నాన్-వెజ్, వెజ్ కి మధ్య తేడా తెలియదు. ఆయన ఉద్దేశం లో అంతా భోజనమే!! కాస్త క్లుప్తం గా వివరించా వెజ్ అంటే ఏంటో? ప్రపంచం లో ఉన్న ఆశ్చర్యాన్ని అంతా  పోగేసి, “ఆహ్ అలాగా కూడా ఉంటారా జనం  ప్రపంచంలో” “ఎందుకలా?” అన్నారు. ఎంచేప్పాలా అని అనుకుంటూ ఉంటె, ఆయనే అన్నారు: “Is it for some Religious purpose?” అని, “హమ్మయ్య బ్రతికించారు” అనుకుని, అవును అదే అదే అని క్లుప్తంగా ముగించేసాను సంభాషణ. కాని అప్పుడు నేను ఆ సమాధానం తో ఇంకా పెద్ద సందిగ్ధంలో లో పడబోతున్నా అని అనుకోలేదు సుమా.  What is your Religion? అని అడిగారు. నేను చెప్పాను Hindu అని.

“సరేలే నాన్-వెజ్ తినోద్దులే” అని ఆ మటన్ బిర్యాని ప్లేట్ లో అన్నం మీద వారగా పడుకోబెట్టిన లేత మేక కాలుని ఒక చేత్తో కాస్త ఎత్తి పట్టుకుని, దాని కింద ఉన్న బాస్మతి రైస్ ని చూపిస్తూ “come take this rice” అని సౌంజ్ఞ చేసారు. “అబ్బే వద్దులెండి సార్” అని నసుగుతున్నా... “ఏంటి ఆలోచన, మీ భారతీయులు కూడా అన్నం తింటారు కదా? రా తీసుకో- తిను” అన్నారు. ఆయనకీ ఎలా చెప్పను ఆ మాంసం ప్లేట్ లోంచి నేను అన్నం విడిగా తీసుకుని తినలేను అని?  నా బాధ ఆయనకీ అర్ధం అవ్వట్లేదు. సరే చివరకి ఆయనకీ విడమరచి చెప్పేసా, అలా మేము తినము అది మా ఆచారం ఒప్పుకోదు అని. “ఆహ్ అయ్యో సారి నాకు తెలియదు” అని ఆయన అక్కడికి వదిలేసారు. అక్కడే మా ఇంకో కొలీగ్ సజిష్ అని మలయాళీ అతను సుబ్బరంగా చికెన్, మటన్ దట్టించి లాగించేస్తున్నాడు. మా బాసు అతన్ని చూపించి నాతో అన్నారు: “what is Sajish’s Religion?” “హిందూ అండి” – చెప్పాను. చెపుతూనే నాకు అర్ధం అయ్యింది తర్వాతి ప్రశ్న ఏమి రాబోతోందో? “మరి అతను తింటున్నాడే? నువ్వెందుకు తినట్లేదు?” కుతూహలం తో అడిగేసాడు ఆయన. ఆయనకీ కాస్త విడమర్చి చెప్పాను, “మేము బ్రాహ్మలం, అతను వేరే కులం వాళ్ళు, వాళ్ళ కులం లో వాళ్ళు తినొచ్చు తప్పులేదు, ఆచారం ఒపుకుంటుంది” అని. ఆయనకీ ఆ కులం అన్న concept అర్ధం కాలేదు, అయినా సరే కాస్త అనుమానం తో OK అని తలూపేసాడు.
ఇంకోసారి మా బ్రాంచ్ లో ఎవరిదో పుట్టిన రోజు అయ్యింది. అప్పుడు లోకల్ ఇండియన్ హోటల్ నించి ఏవో తినడానికి తెప్పించారు. అందరు తింటున్నారు అన్ని వెజ్ డిష్ లే. ఇడ్లి/ దోశా/ సమోసా అవీను. ఆయనకీ కూడా అవి బాగా నచ్చాయి తింటున్నాడు. ఉన్నట్టుండి ఆయన కళ్ళు ఒక స్టాఫ్ మీద పడ్డాయి. మా ఇంకో కొలీగ్ శ్రీనివాసన్ (తమిళుడు – అయ్యంగార్లు) ఏమి తినట్లేదు ఖాళీగా కూర్చున్నాడు. ఆయన అతని దగ్గిరకి వెళ్లి అడిగాడు, “అదేంటి శ్రీని ఏమి తినట్లేదే?”. అతను మొహమాటంగా మొహం పెట్టి ఎదో అస్పష్టంగా నసిగాడు. చివరకి అర్ధం అయ్యింది ఏమిటి అంటే? ఆ రోజు వచ్చిన అన్ని ఐటమ్స్ లో వెల్లుల్లి ఉందిట. వాళ్ళు వెల్లుల్లి తినరు. ఇప్పుడు జుట్టు పీక్కోడం మా మేనేజర్ వంతు అయ్యింది. ఆయనకీ ఎక్కడా లెక్కలు కుదరడం లేదు. “వీళ్ళు హిందూ అంటారు – కాని కొంతమంది వెజ్ తింటున్నారు, నాన్-వెజ్ కొంతమంది తింటున్నారు. మరి వెజ్ వాళ్ళల్లో కొంతమంది వెల్లుల్లి తినరుట”. “అసలు మీకు ఇవన్ని ఎలా తెలుస్తాయి, తెలిసినా ఎలా గుర్తుంటాయి? ఎలా మేనేజ్ చేస్తారు జీవితం, పెళ్ళిళ్ళు, సంబంధాలు అవీ ఎలా?” అని ఒక సవాలక్షా ప్రశ్నలు సంధించేసాడు.
అప్పుడు నాకు అనిపించింది మనం ఇక్కడ ఇండియా లో పుట్టి పెరగడం వల్ల అసలు ఎప్పుడు మనకి ఇలాంటి సందిగ్ధాలు ఎదురుపడలేదు. మనకి అన్ని auto pilot లో నడిచిపోతాయి. కాని మన ఆచార సాంప్రదాయాలు (మంచైనా సరే చెడైనా సరే) తెలియని వాళ్లకి ఇవన్ని అర్ధం చేసుకోవాలి అంటే ఒక జీవిత కాలం పడుతుంది.

[చదువరులకి ఒక మనవి – ఇక్కడ నేను ఒక చిన్న సన్నివేశం ఆధారంగా నడిచిన కొన్ని సంఘటనలు మాత్రం గుర్తుచేసుకుంటున్నా, ఇందులో కులప్రస్తావనలు, మత ప్రస్తావనలు తీసుకు రావద్దు ప్లీజ్. మనం చాలా సామాన్యంగా తీసుకునే విషయాలు అవతలి వాళ్లకి ఎలా కనబడతాయి అన్న విషయం మీదనే నేను దృష్టి కేంద్రీకరించాను అని మనవి చేసుకుంటున్నా]