కొన్ని అనివార్య
కారణాల వల్ల తప్పని సరి పరిస్థితుల్లో నేను శ్రీమన్నారాయణ సినిమా చూడాల్సి
వచ్చింది. ఇంక ఎలాగో చూసేసాను కనక మీ అందరికి దాని గురించి చెప్పాల్సిందే కదా?
కధ టూకీగా చెప్పాలంటే,
ప్రజల/ రైతుల పక్ష పాతి అయిన ఒక రైతు నాయకుడి (విజయకుమార్) చొరవ తో 5000 కోట్ల రూపాయలు ఒక ఫండ్ గా పోగుచేసి ఒక బ్యాంకు అకౌంట్ లో వేస్తారు. దాన్ని మన
ప్రతి నాయకులు (విలన్లు) దొబ్బేస్తారు, ఈ క్రమంలో ఆ రైతు నాయకుడిని చంపేస్తారు. ఆ
నేరం మన హీరో రైతు బాందవుడి కొడుకు/ Zee 24 గంటలు ప్రముఖ
జర్నలిష్టు అయిన శ్రీమన్నారాయణ
మీద మోప బడుతుంది. హీరో గారు జైలుకి వెళతారు. తర్వాత ఆయన చాక చక్యంగా వీళ్ళ భారతం
పట్టి, వాళ్ళ నాన్నగారి ని ఈయన హత్యా చేసారు అన్న నింద మాపుకుని, ఆ 5000 కోట్లు దొంగిలించారు అని మోపబడిన నింద ని కూడా చెరిపేసుకుని, జనానికి నిజం తెలియజేస్తారన్నమాట.
సరే ఇంత ప్లాట్
ని నడపడానికి కావాల్సిన సంజామా లో భాగంగా ...ఒక తండ్రి (విజయ్ కుమార్), ఒక తల్లి
(సుధా) ఒక మరదలు/ ప్రియురాలు – ఇషా చావ్లా, ఒక సహపాత్రికేయురాలు – పార్వతి మెల్టన్,
ఒక అయిదుగురు విలన్లు అందులో మనకి చెప్పుకోతగ్గ మొహాలు – కోటశ్రీనివాసరావు,
సురేష్(పాత తరం బూరి బుగ్గల హీరో), నాగినీడు ఇత్యాది. అలాగే ఇంకో పాతతరం హీరో
వినోద్ కుమార్ CBI officer పాత్రలో నటించారు.
ఆహుతి ప్రసాద్ జైలు వార్డెన్ పాత్రలో. ఒక పనికి మాలిన పాత్రల్లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం
(అదేదో టీవి చానల్ CEO) , ఎమ్మెస్ నారాయణ,
కృష్ణ భగవాన్ (అనుక్షణం అసహ్యంగా
తిట్టించుకునే బ్రాహ్మణ పాత్రలు – పంతుళ్ళు)
మొదటి భాగం అంతా వేళాకోళంగా వెటకారంగా మన బాలయ్య పాత్రికేయుడి పాత్రలో నాలుగు
ఫైట్ లు ఆరు పాటలు లా గడిచిపోతుంది.
మరదలిగా ఇషాచావ్లా బావుంది. నటన కూడా బాగా
చేసింది, అమ్మాయికి భవిష్యత్తు ఉంది అనిపిస్తోంది. కాకపోతే ఆ అమ్మాయి ఒక్క విషయం
లో కాస్త జాగ్రత్త తీసుకుంటే బావుండును..పాటల్లో కాస్త పొట్ట కనబడకుండా శ్రద్ద
తీసుకుంటే బావుండేది...బుల్లి చిరుబొజ్జ కనబడుతుంది..నార్త్ హీరొయిన్ కి బుల్లి బొజ్జ
బాగోదు కదా? బాలయ్యతో పార్వతి
మెల్టన్ కొన్ని కలల్లో పాటలు పాడుకోడానికి అప్పుడప్పుడు గోకడానికి మాత్రం పెట్టారు
అనిపిస్తుంది. పార్వతి మెల్టన్ ఇంకో size zero heroine – మిగతా శరీరం
చిక్కిపోయింది కాని కళ్ళు మాత్రం పెద్దగా అలాగే ఉండిపోవడం తో ఒక్కోసారి రెండు
కనుగుడ్లు ఇంక బయటకి వచ్చేస్తాయెమో అన్నట్టు అనిపిస్తుంది.
పాటల్లో ఒకటి బావుంది, డాన్సులు రెండుబావున్నాయి. ఫోటోగ్రఫి చాలా బావుంది. చక్రి సంగీతం తేలిపోయింది పెద్ద సరుకు లేదు.
రెండో భాగం అంతా మన బాలయ్య వాళ్ళని
చంపే పనిలో ఉన్నది. అంతకుమించి ఏమిలేదు.
కొన్ని పంచ్ లు
అక్కడక్కడ పేలీ - పేలనట్టు ఉంటాయి, మచ్చుకకు కొన్ని:
- Ø “అరటి పండుకి తొక్కే సెక్యురిటి ..నాకు నీ పక్కలో సెక్యురిటి – పార్వతి మెల్టన్ బాలయ్యతో”
- Ø “సార్ భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి ఒక్కడికే కదా చెప్పాడు, మరి ఇప్పుడు మన అందరికి ఎలా తెలిసిపోయింది అండి? అంటే ఆ రోజుల్లోనే పైరసీ ఉండేది అంటారా?” – దువ్వాసి మోహన్ (ఇంట్లో పనివాడు) విజయ్ కుమార్ తో
- Ø “నాకు తాజ్మహల్ కట్టిస్తావా” పార్వతి మెల్టన్ బాలయ్యతో – “ఆ మొన్నే రెండెకరాలు కొని పెట్టాను, ఇంక నువ్వు చావడమే అలిస్యం కట్టించేస్తా..!!!” బాలయ్య బాబు జవాబు.
- Ø “ఒంద మందిలో చెయ్యెత్తి దండం పెట్టిన ఆ 99 మంది గురించి కాకపోయినా సరే, వేలెత్తి చూపిన ఆ ఒక్క చేతికోసం అయిన సరే నా నిర్దోషిత్వం నిరూపిస్తా” జైలులో బాలయ్య బాబు వాళ్ళ అమ్మతో.
- Ø “చావుకి సెంటిమీటర్ దూరం లో నువ్వు ఉన్నావు, సేన్తిమేన్తుకి కిలోమీటర్ దూరంలో నేను ఉన్నా...” ఒక విలన్ని నరికేసే ముందు – వద్దు చంపొద్దు అంటున్నప్పుడు బాలయ్య బాబు డవిలాగు.
- Ø “నువ్విలా బొద్దింకలా లా వంటింట్లో తిరుగుతూ ఉండు అది హాల్లో సీతా కోక చిలుకలా బావ వెనక తిరుగుతోంది” – ఇషా చావ్లా తో పార్వతి మెల్టన్ గురించి దువ్వాసి మోహన్.
- Ø Tempting అక్కడా (పార్వతి మెల్టన్ ని చూపించి)....vomiting ఇక్కడా (ఇషా చావ్లా ని చూసి) దువ్వాసి మోహన్ బాల కృష్ణ ని ఉద్దేశించి మనస్సులో అనుకునేది.
బ్రాహ్మణ పాత్రలని తిట్టడమే కామెడి అనుకునే దౌర్భాగ్య స్థితినించి మన తెలుగు
సినిపరిశ్రమ ఎప్పుడూ బయటకు వస్తుందో తెలియదు కాని, అప్పటిదాకా మనం ఇలా
భరించాల్సిందే. ఇంతకి ఇందులో ఏదైనా కామెడి చచ్చిందా అనుకుంటే అదీ లేదు.
మీరి ఈ సినిమాకి
వెళ్ళాలో వద్దో మీరే తేల్చుకోండి, నన్ను అడిగి ఇబ్బంది పెట్టద్దు.