Showing posts with label గోడ. Show all posts
Showing posts with label గోడ. Show all posts

Friday, October 5, 2012

Facebook wall - మా ఇంట్లో గోడమీద ఫోటోలు


మా చిన్నప్పుడు అమ్మమ్మ గారు, తాతగారి ఇంట్లో పెరిగాను. ఇప్పుడు కూర్చుని ఆలోచిస్తుంటే ఒక విషయం జ్ఞాపకం వస్తోంది....... ఇప్పుడైతే ఫేస్ బుక్కులు అవీ వచ్చి, walls మీద ఫోటోలు పెట్టుకోడం మనం మనం చూసుకోడం అదీను వచ్చింది ....... కాని ఆ రోజుల్లోనే మా ఇంట్లో గోడ మీద వరసగా మావాళ్ళ వి ఫోటోలు చాల ఉండేవి. అన్ని ఫోటోలు పెద్ద పెద్ద ఫ్రేం లో కట్టించి చక్కగా అన్ని ఒకే సైజులో ఉండేలా చూసి..అన్నిటికి వరసగా ఎగుడు దిగుడులు లేకుండా ఉండేలా ఉండడం కోసం ఒక బేస్ లైన్ లా ఒక చెక్క బద్దలాంటిది గోడమీద కొట్టి వాటిమీద ఈ ఫోటో ఫ్రేములని  వరసగా కూర్చోపెట్టేవారు.
ఇంట్లోకి అడుగు పెడుతూనే ఎదురుగా మొదటి గదిలో పద్మావతిసమేత కళ్యాణ శ్రీనివాసుడు గోడమీద ఫోటో రూపం లో దర్శనం ఇచ్చేవారు. ఈ మధ్య నేను ఎక్కువగా వింటున్నా ...వేంకటేశ్వరుడు మన ఇంట్లోంచి వీధి గుమ్మం చూడకూడదు మంచిది కాదు అని....మరి అ రోజుల్లో మా తాతగారు చాలా బాగా Rich గా బ్రతికారు. ఆయన సకల ఐశ్వర్యాలని అనుభవించారు - మరి ఆయన ఆ ఇంట్లో ఉన్నన్నినాళ్ళు వేంకటేశ్వరుడు వీదిగుమ్మం వేపే చూసేవాడు మరి. “ఆ మంచిది కాదు అన్న సెంటిమెంట్ ఆయనకి మరి ఎందుకో అడ్డు రాలేదు”. అంటే ఆయన కృషీవలుడు కూడాను, కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి..అలాంటి వాళ్ళ ముందు బహుశా ఈ నమ్మకాలు కూడా పనిచేయ్యవేమోలెండి. ఆ ముందు గదిలోంచి హాల్లోకి వెళితే ఎదురుగా గోడమీద తాతగారి అమ్మగారిది నాన్నగారిది ఫోటోలు ఉండేవి. అవి చాల పెద్ద సైజులో ఉండేవి. తాతగారి తల్లి తండ్రులు పాత తరం వారు కావడం చేత సహజంగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు అవి. వాటి కింద మా అమ్మమ్మ గారి ఫోటో - దానికి ఒక దండ వేసి ఉండేది. ఇంకా హాల్లో నాలుగు గోడల మీద రక రకాల చుట్టాలవి, పెద్ద పెద్ద వాళ్ళవి, ఎన్నెన్నో ఫోటో లు ఉండేవి. పండగలు వచ్చినప్పుడు ఇల్లుదులపడం తో బాటు వాటిని కూడా నిచ్చెన వేసుకుని తడిగుడ్డతో తుడవడం ఒక వరుసక్రమం లో జరిగేవి. ఏవైనా కొత్త ఫోటోలు, ప్రత్యెక ఫోటోలు వస్తే పాత ఫోటోలు కిందకి దింపి కొత్త ఫోటోలు పైకి ఎక్కిన్చేవాళ్ళం. తర్వాతి కాలంలో...నేను కూడా రాజారవివర్మ paintings, Monalisa photo కూడా పెట్టేసా వాటి పక్కన.
అంటే ఇంతకి చెప్పొచ్చేది ఏమిటంటే...Walls మీద ఫోటోలు పెట్టుకోడం షేర్ చేసుకోడం Mark Zuckerberg వచ్చి ఏమి కనిపెట్టలేదు అని.