Showing posts with label kajal agarwal. Show all posts
Showing posts with label kajal agarwal. Show all posts

Friday, May 20, 2016

బ్రహ్మోత్సవం - తెలుగు సినిమా

బ్రహ్మోత్సవం
ఈ మధ్య మన తెలుగు సినిమాల్లో చక్కటి కుటుంబ కధా చిత్రాలు అనగానే... పోలో మని ఒక యాభైమంది జనాల్ని ఒకే ఇంట్లో పోగేసేసి వాళ్లకి కుటుంబం అన్న పేరు పెట్టేసి వాళ్ళకో ఇంటి పెద్ద - ఆయన్ని చూడగానే అందరు లేచి నిన్చోడం , ఆయన్ని చూసేవారి కళ్ళల్లో అమితమైన భయం - భక్తి తొణికిస లాడడం... ఇలా ఇవన్ని ఒక మూసలో పోసినట్టు తయారు చేసేసారు.
అలాగే ఈ సినిమాలో కూడా శ్రీకాంత్ అడ్డాల అదే ఫార్ములా అమలు చేసేసాడు. కాని మన దురదృష్టం ఏమిటి అంటే జనాలు, హడావుడి , కోలాహలం సందడి బావుంది అన్నారు కదా అని అస్తమాను అవే సీన్లు చూపిస్తాం అంటే చిరాకు వేస్తుంది ఒక్కోసారి.
సినిమా మొదలయిన గంటన్నర దాకా ఏమి జరుగుతోందో నాకైతే అస్సలు అర్ధం కాలేదు. ఎవరు ఎవరితో ఎందుకు మాట్లాడుతున్నారో? అసలు ఆ తోరణాలు హడావుడి ఆ కోలాహలం ఎందుకో ఒక్క ముక్క అర్ధం కాలేదు.
ఉన్నట్టుండి ఫారిన్ నించి కాజల్ వస్తుంది. వస్తూనే ఈ పండగల కోలాహలం ఇంట్లోకి వచ్చేస్తుంది. వస్తూనే మహేష్ ని చూసి ఆకర్షితం అవుతుంది ఇద్దరు చెట్టా పట్టా లేసుకుని ఊరంతా (విజయవాడ) తిరుగుతారు. ఉన్నట్టుండి కాజల్ ‘అబ్బే మీ ఇళ్ళు ఈ జనం, ఈ కోలాహల వాతావరణం ఇవన్ని నాకు పడవు అని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోతుంది.
అసలు ఎందుకు వచ్చిందో ..ఎందుకు వెళ్లిందో ఒక్క ముక్క అర్ధం కాదు మనకి.
తర్వాత ఉన్నట్టుండి లండన్ నించి సామంత వచ్చేస్తుంది. ఆ అమ్మాయి ఎవర్రా అని ఆరా తీస్తే... లండన్ లో ఉన్న మహేష్ చెల్లెలి ఫ్రెండ్ ట. “తోచీ తోచనమ్మ, తోడికోడలు పుట్టింటికి వెళ్ళింది” అన్నట్టు...అతని చెల్లెలి ఫ్రెండ్ ఆ చెల్లెలు లేకుండా వీళ్ళ ఇంట్లో ఊరికే కొన్నాళ్ళు ఉండిపోదాం అని వచ్చేస్తుంది. గమ్మత్తైన విషయం ఏమిటి అంటే ఆ అమ్మాయి వస్తూ వస్తూ ఒక బస్సెడు జనాల్ని (ఎవరో తెలియని ఊరు జనాల్ని) కూడా ఊరికే సరదాగా మహేష్ ఇంటికి తీసుకు వస్తుంది సరదాగా ఉండి భోజనం చేసి వెళ్తారు అని. అప్పటికి సమంత ఎవరో మహేష్ ఇంట్లో ఎవరికీ తెలియదు. ఇంత బిల్డ్ అప్ ఎందుకురా అంటే...సమంత మనస్తత్వం కూడా నలుగురిని కలుపుకు పోయి, జనాల మధ్య జనం కావాలి అని అనుకునే మనస్తత్వం అని మనకి తెలియచెప్పడానికి ట. (మరీ అంత V P ల్లా కనబడుతున్నామో ఏమిటో?)
మధ్యలో ఆటలో అరటి పండులా ప్రణీత ఒకత్తి... అప్పుడప్పుడు ’బావా, బావా’ అని మహేష్ తో కళ్ళల్లో కళ్ళు పెట్టి తిరుగుతూ ఉంటుంది . తర్వాత పెళ్లి ఇంకెవర్నో చేసుంటుంది అనుకోండి.
సత్యరాజ్ ఉన్నట్టుండి ఎందుకుపోతాడో అర్ధం కాదు.
రావు రమేష్ పాత్ర అలా అస్తమానూ నీరసంగా ఎందుకు ఉంటాడో సరిగ్గా ఎష్టాబ్లిష్ చెయ్యలేకపోయాడు దర్శకుడు. అదేదో పెద్ద భూమి బద్దలయ్యే ఫ్లాష్ బ్యాక్ అనుకుంటాం కాని, చివరికి ఏది ఉండదు.
అన్నిటికన్నా పెద్ద కామెడి ...హీరో వాళ్ళ నాన్న ఎదో నలుగురు...చుట్టాలు.... ఏడు తరాలు అన్నారని హీరో గారూ, సమంతా కలిసి దేశం మీద పడతారు (ఏడూ తరాల జనాల్ని వెతకాలి అని) తల తోకా - తాడూ బొంగరం లేకుండా ఎలా వెతుకారో? అనుకుంటున్నారా... అక్కడే ఉంది ట్విస్ట్.
నాగపూర్, బెంగుళూర్, లక్నో, హరిద్వార్, కాశి ఇలా చాలా ఊళ్ళ బోర్డులు చూపిస్తారు మనకి. ఎవరు ఎవర్నో కలిసేస్తారు, ఎలా కలుస్తారో, ఏమిటో తెలియదు. కాని చివరాఖర్న ప్రణీత పెళ్ళికి అందరు వచ్చేస్తారు మనం అంతా ఒకటే కుటుంబం అని... నాసిర్ పాత్ర ఎందుకో తెలియదు.
అందరు రావ్ రమేష్ ఆదరగోట్టేసాడు అన్నారు కాని నాకైతే అతని పాత్ర చాలా చిరాగ్గా ఒక బేస్ లేకుండా మలిచిన పాత్ర అనిపించింది.
సినిమా మొత్తానికి హైలైట్ వెన్నెల కిషోర్ ఉన్న కాస్త సేపు అంతే.
ఎప్పటిలాగే మహేష్ చాలా అందంగా ఉన్నాడు.
సినిమా కధనం అతుకుల బొంతలా ఉంటుంది. ఎక్కడా తలా తోకా కలవవు. ఎడిటింగ్ చాలా దారుణంగా ఉంది.
నా అనుమానం బహుశా అసలు సినిమా ఒక నాలుగైదు గంటల సినిమాగా తీసి ఉంటారు....చివరికి నిడివి తగ్గించే ప్రయత్నంలో చేతికి తగిలిన ముక్కలు కట్టిరించేయడం లో అలా అతుకుల బొంతలా అయిపోయి ఉండవచ్చు.
పాటలు సో సో గా ఉన్నాయి. కొన్ని పాటలు అయితే అసలు అనవసరం గా పెట్టారు కూడాను.
ఈ సినిమా దెబ్బ నించి .......మహేష్ బాగా కోలుకుని భవిష్యత్తులో మంచి సినిమాలు చెయ్యాలని ప్రార్దిస్తున్నా.
[నోట్: ఈ సినిమా చూసాకా ఎవరికైనా తెగ నచ్చేస్తే నన్ను, నారివ్యూని తిట్టుకోకండి. పుర్రెకో బుద్ధి- జిహ్వకోరుచీ కదా...అలాగే ఇదీను అనుకోండి]

Friday, December 21, 2012

సారోచ్చారు (రవితేజ) సినిమా రివ్యూ


సారోచ్చారు – ‘రవితేజ మార్కు’ సినిమా అనుకుని వెళ్ళాను.

దర్శకుడు పరశురాం కి సినిమా చాలా కొత్తగా ఎదేదోలా ఎలాగో తీసేద్దాం అని చాలా అనిపించి ఉంటుంది......కాని పాపం అస్సలు చెప్పదలుచుకున్నది సరిగ్గా చెప్పలేకపోయాడు. చాలా పేలవమైన డైలాగు లు సినిమాకి పెద్ద మైనస్ మార్కు. మామూలుగా జనం రవితేజ సినిమా అంటే ఎదో కాస్త loud comedy ఉంటుందనుకుంటారు. ఇందులో కాస్త కూడా కామెడి లేదు. ఎదో ఒక అయిదు నిమిషాలు మొహమాటంగా ఎమ్మెస్ నారాయణతో కామెడి చేయిద్దాం అని ప్రయత్నించారు (నాకైతే అది కూడా విసుగొచ్చింది)
రవితెజ మొహం లో బాగా వయసు కనబడుతోంది. మొహం మీద బాగా మేకప్ వేసినా ముడతలు కనబడుతున్నాయి. అతని నటనలో ఆ స్పార్క్ కనబడలేదు. కాజల్ మామూలుగా ఉంది. ఒక్కో చోట కాస్త ఓవర్ గా చేసిందా అనిపించింది (అరవ సినిమాలు ఎక్కువయ్యాయి అమ్మాయికి). అంత కంటే ఆమె గురించి పెద్దగా చెప్పుకోడానికి ఏమి లేదు. రిచాగంగోపాధ్యాయ్ అసలు ఆ పాత్ర ఏమిటో - ఎందుకో నాకు అర్ధం కాలేదు.
ఇంక కధలోకి వస్తే....యూరప్ లో ఎదో కాలేజిలో చదువుకుంటున్న కాజల్ ఇండియాకి వచ్చే ముందు అనుకోకుండా రవితేజని కలుస్తుంది. అతను అక్కడ ఏమి చేస్తుంటాడో మనకు కధా పరంగా అస్సలు తెలియదు. ఊరికే అక్కడ ఉంటాడు అంతే! ఆ అమ్మాయికి తన మీద తనకి చాలా నమ్మకం, అందగత్తెని అని కూసింత గర్వం. సినిమా అంతా రవితేజా కాజల్ రోడ్డు మీద కార్లో, లేదా విమానం లో, మధ్యలో కాస్సేపు airport లో మళ్ళి కార్లో రోడ్డు మీద..........ఇలా వెళుతూ రవితేజ పాత కధని వింటూ ఉంటారు (అదే రిచా తో రవితేజ వ్యవహారం). అంతా అయ్యాకా అయ్యో అతనికి పెళ్లి అయిపొయింది అని బాధపడుతున్న కాజల్ కి రవితేజ “అబ్బే నేను ఇన్నాళ్ళు చెప్పింది అంతా కల్పితం అసలు అలాంటి అమ్మాయే లేదు, ఒకళ్ళని ఒకళ్ళు ఎలా అర్ధం చేసుకోవాలో చెప్పడానికే ఈ కల్పిత కధ చెప్పాను” అంటాడు. అంతే కాజల్ కి కోపం వస్తుంది...ఛీ నువ్వు మోసగాడివి నిన్ను నమ్మకూడదు అదీ ఇదీ అని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ కాజల్ వాళ్ళ అమ్మ (జయసుధ – గెష్టు రోల్) కాజల్ బావతో పెళ్లి కుదురుస్తుంది. బావ ఎవరో కాదు మన చంద్ర బాబు నాయుడి తమ్ముడి కొడుకు నారా రోహిత్ . అదీ ఒక గెష్టు పాత్రే! మరి అతనికి ఏమి మొహమాటాలో లేదా ఖర్మ కాలిందో అలా గెష్టు రోల్ వేసుకోవాల్సి వచ్చింది. తర్వాత మామూలే తాంబూలాలప్పుడు రోహిత్ కాజల్ ని ఆపేసి చిన్న స్పీచి పీకి ఆ అమ్మాయిని వెళ్లి రవితేజాని పెళ్లి చేసుకో అంటాడు..............అప్పుడు శుభం కార్డు ముంది titles తో వస్తుంది పాట “రచ్చ రంభోల”.
దేవిశ్రీ సంగీతం ఆహ్లాదంగా ఉంది. “మిరపకాయిలాంటి పిల్లడంటా – made ఫర్ each other “ అన్నపాట చాలా క్యాచీగా ఉంది. అందులో స్టెప్పులు చాలా కొత్తగా స్మూత్ గా ఉన్నాయి. నాకు చాలా చాలా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది చిత్రీకరణ.
సాధ్యమైనంతవరకు చూడకుండా ఉండటానికి ప్రయత్నించండి వీలైతే. మరీ తప్పక మొహమాటానికి వెళితే ఖచ్చితంగా first half లో నాలా ఒక పావు గంట  చిన్న కునుకు తీసేస్తారు.