Saturday, July 18, 2015

Puri Jagannadh's Nabakalebara story - పూరి జగన్నాధుని నవకళేబర కధ

పూరి  జగన్నాధుని నవకళేబర ఉత్సవం వెనుక ఉన్న కధ.
(నాకు చేతనైనంతలో  తెలిసిన విషయం రాశాను. తప్పులుంటే మన్నించగలరు)
హైందవ దేవాలయాల్లో  మూల విరాట్టు విగ్రహాలు (ముఖ్యంగా విష్ణావతారాలు) రాతితో  చేసినవి  కాని, లోహం  తో  చేసినవి  కాని ఎప్పటికి  మార్చటం అన్నది జరగదు. (అవి ఏదైనా ప్రమాదం లో  దెబ్బతిని పాడైతే తప్ప). మూల  విరాట్టు  కనక  చెక్కతో  చేసిన దైతే మాత్రం  అవి ఒక నిర్ణీత  సమయం తర్వాత ఖచ్చితంగా  మార్చి  తీరాలి.  
హైందవ వైఖాసన సాంప్రదాయాలను అనుసరించి  విష్ణాలయాలు  వాటి  విగ్రహ  ప్రతిష్టలు  జరుగుతాయి. వాటి  ప్రకారం అధిక  ఆషాఢ మాసం  వచ్చే  ప్రతీ సంవత్సరం లో సాధారణం గా ఈ నవకళేబర  కార్యక్రమం  నిర్వహిస్తారు.  సాధారణం  గా  ఇలా  అధిక  ఆషాఢ  మాసం  ప్రతీ 13 లేదా 19 సంవత్సరాలకి  ఒకసారి  వస్తుంది అంటారు. అలా  శ్రీ పూరి జగన్నాధుని కి ఈ ఉత్సవం 1996 లో జరిగింది, తిరిగి మళ్ళి ఈ 2015 లో జరుగుతుంది.
 పూరిజగన్నాధుడు, బలభద్రుడు, శుభద్ర మరియు  సుదర్శనుల   విగ్రహాలు వేప  చెట్టు కర్ర  తో చెయ్యబడ్డవి గా ఉంటాయి. ఈ  చెక్కనే   “దారు  బ్రహ్మ” అని  కూడా  అంటారు. ఈ ప్రక్రియ  ఒక రోజులో పూర్తయ్యే  కార్యక్రమం కాదు. ఇది 65 రోజుల దశల వారీ  గా నడిపించే ఒక  బృహత్తర కార్యక్రమం..
ఈ ఉత్సవానికి  ఏర్పాట్లు  చైత్రమాసం  నుండి ప్రారంభం అవుతాయి. ఈ సంవత్సరం లో జరిగే  నవకళేబర కార్యక్రమం  మొన్న మార్చ్ 23 న “బన జగ యాత్ర” తో  ప్రారంభం  అయ్యాయి.  ఇందులో  స్వామి వారి  కొత్త విగ్రాహాలకి  కావాల్సిన ఆ ప్రత్యేకమైన  వేప చెట్టు  కోసం అన్వేషణ  సాగుతుంది. ప్రతీ  వేపచెట్టు ఈ దేముడి విగ్రహాలు  తయారు  చెయ్యటానికి  పనికి రాదు.  ఈ అన్వేషణ  ఆషా మాషీ గా జరిగే  వ్యవహారం  కాదు.  దానికి  కొన్ని  నియమ నిబంధనలు, అవీ ఉంటాయి. జగన్నాధుని  ఆలయ పూజారులు దీనికోసం ప్రత్యేకంగా “కాకట్పూర్ మంగళా” ఆలయం లో  వెలిసిన “మా  మంగళా” అమ్మవారిని  శ్రద్ధతో  పూజిస్తారు. అప్పుడు  ఆ మహా తల్లి  వారికి  కలలో  దర్శనం  ఇచ్చి ఆ నాలుగు  విగ్రహాలు  తయారుచెయ్యడానికి  పనికి  వచ్చే  వేప చెట్లు   ఎక్కడ  ఉంటాయో తెలియచేస్తుందిట.
అప్పుడు  ఆ బృందం  ఆ ప్రత్యెక  చెట్లు  దొరికిన  వార్తని  ప్రకటిస్తారు. వెనువెంటనే ఓడిశా  ప్రభుత్వం  కట్టుదిట్టమైన  రక్షణ  వ్యవస్థ మధ్య ఆ నాలుగు  దుంగలను  కొట్టించి చిన్న చిన్న  బళ్ళలో  వాటిని  పూరికి  తరలిస్తుంది.  ఈ బళ్ళు  అన్ని  భక్తులు  తమ  చేత్తో  లాక్కుని  వెళతారు.
జగన్నాయకుడైన  జగన్నాధుని  విగ్రహ తయారీకి  మామూలు  వేప  చెట్లు పనికిరావు కాబట్టి, వాటికి  కొన్ని పద్దతులు, రకాలు  శాస్త్ర  ప్రకారం పెద్దలు నిర్ణయించారు వాటిల్లో కొన్ని conditions ఏమిటి అంటే...
  • 1.   జగన్నాధుడు నీలమేఘ శ్యాముడు  కావడం వలన ఆయన విగ్రహానికి ఉపయోగించే వేపచెట్టు మాను నల్లగా ఉండేలా చూసుకుంటారు. మిగతా  మూర్తులు అందరు మామూలు రంగులో ఉంటారు కాబట్టి  మామూలు గా ఉండే వేపచెట్టు మాను ను ఉపయోగిస్తారు.
  • 2.    జగన్నాధునికి ఉపయోగించే  చెట్టుకి నాలుగు  కొమ్మలు  ఉండి  ఉండాలి (నారాయణుడి నాలుగు  చేతులకి ప్రతీకగా).
  • 3.   చెట్టు దొరికిన  చోటుకి దగ్గరలో నీటి నెలవు  ఉండి  తీరాలి, అంటే  చెరువో, నదో, తటాకమో అలా...అక్కడికి దగ్గిరలో  స్మశానం కూడా  ఉండి ఉండాలిట.
  • 4.     ఆ చెట్టు వేర్లకి  దగ్గిరలో  ఒక  త్రాచుపాము  పుట్ట  కూడా  ఉండి ఉండాలిట.
  • 5.  ఆ చెట్టుకి  ఉన్న కొమ్మలు ఏవీ  కూడా  నరక బడి కాని, పాడైపోయి  కాని ఉండకూడదుట. మూడు రహదార్ల  కూడలి లో కాని, మూడు కొండల మధ్య భాగం లో కాని  ఈ చెట్లు  ఉండాలిట. ఈ చెట్టు మీద ఏ రకమైన లతలు అవీ అల్లుకుని  ఉండకూడదుట. దానికి  దగ్గరలోనే  ఒక ఆశ్రమం లేదా శివాలయం  ఉండాలట.
  • 6.   అన్నిటికంటే  ఒక అద్భుతమైన విషయం  ఏమిటి అంటే అతిముఖ్యంగా  ఈ చెట్టు  మాను మీద శంఖ  చక్రాలు అచ్చువేసినట్టు  కనబడుతూ  ఉండాలిట.

ఇన్నిరకాలుగా  అన్ని  conditions match  అయ్యాకా  మాత్రమె ఆ చెట్లను సేకరిస్తారు. మొట్ట మొదటగా పతి  మహాపాత్ర  కుటుంబీకుడు  బంగారు  గొడ్డలితో  మొదటి వేటు  వేస్తారు, తర్వాత దయితపతి  కుటుంబీకుడు  వెండిగోడ్డలితో ఇంకో  వేటు వేసాకా చివరగా మహారాణా  కుటుంబీకులు  ఇనపగోడ్డలితో చెట్టుని  నరుకుతారు. ఈ ప్రక్రియ జరుగుతున్నత సేపు  ఆ దేవదేవుడి 108 నామజపం  జరుగుతూనే  ఉంటుంది., అత్యంత  పవిత్రమైన ఘడియల్లో అతి రహస్యంగా  మొదలు పెట్టి...కొన్నాళ్ళ  పాటు  ఆ దుంగలని,  భత్రతా  ఏర్పాట్ల  మధ్య గుడి  ప్రాంగణం లోనే  దేవతామూర్తుల  రూపంలో  చెక్కుతారు.

ఈ విగ్రహాల్ని  తయారు  చేసేటప్పుడు  ఎవర్ని  అక్కడికి అనుమతించారు.  ఆలయ ప్రధాన పూజారికి  కూడా అప్పుడు  అక్కడ  ప్రవేశం  నిషిద్ధం. ఇలా 21 రోజులపాటు  స్మావి  వారి  విగ్రహాలు  చెక్కి  తయారు  చేస్తారు. ఈ విగ్రహాలు  చేక్కేంత  సేపు వాళ్ళు  ఏమితినకూడదు. అసలు ఆ 21 రోజులూ వాళ్ళు  ఆ ఆలయ  ప్రకారం  దాటి  బయటికే  రాకూడదు.  రాత్రి పూట  మాత్రం ఆ జగన్నాధుని  మహా నైవేద్యం  వీళ్ళకి  ఆహారం  కింద  ఇస్తారు. అంత  నియమ నిష్టలతో  విగహాలు  తయారు  చేసాకా......... దయితపతి  కుటుంబీకులు మాత్రమె ఈ కొత్త  విగ్రహాలని  గర్భగుడిలోకి  తీసుకువెళ్ళి, ఆ పాత  మూర్తులకి ఎదురుగా నిలబెడతారు.  ఆ కుటుంబీకులు  ముగ్గురికి మినహా  వేరెవ్వరికి  ఈ దృశ్యం  చూసేందుకు అనుమతి లేదు. అతి గోప్యంగా  జరిగే  ప్రక్రియ ఇది. ఆలయ ప్రధాన అర్చకులకి  కూడా అప్పుడు ప్రవేశం  నిషిద్ధం. అధిక ఆషాఢ కృష్ణ  చతుర్దశి అర్ధరాత్రినాడు “తత్వ  పదార్ధాన్ని” పురాతన  విగ్రహం నించి  కొత్త విగ్రహం లోకి దైతపతి కుటుంబీకులు  మారుస్తారుట.  ఈ “తత్వ పదార్దమే”  ఆ బొమ్మల్లోకి  మహత్తును, తేజస్సును నింపుతుంది అని విశ్వశిస్తారు.  పురాతన  తాళపత్ర గ్రంధాలలో  నిక్షిప్తమైన తత్వ పదార్ధాన్ని  మార్చే ఈ నిగూఢ  రహస్య  ప్రక్రియ ఆ ముగ్గురు కుటుంబీకులకి  మాత్రమె  తెలుస్తుంది. ఆ ప్రక్రియ  జరుగుతున్నంత సేపు ఆ ముగ్గురి కళ్ళకి  గంతలు కట్టి ఉంటాయి, వాళ్ళ చేతుల మీద  జగన్నాధుని  బట్ట కప్పి ఉంటుంది. ఆ బ్రహ్మ పదార్ధం పాత విగ్రహం నుండి కొత్త విగ్రహం లోకి మారేటప్పుడు వారి అనుభూతి  ఎలా ఉంటుంది  అని  చాలా మంది అడుగగా... వారిచ్చే సమా దానం ఒక్కటే, “అది మాటలకి అందని అనుభూతి, మా కళ్ళు కట్టి వేయబడి ఉండడం వాళ్ళ మాకు ఏమి కనబడదు, చేతులకి ఆ స్వామీ గుడ్డలు  చుట్టి ఉండడం వాళ్ళ స్పర్శ కూడా తెలియదు కాని  ఎదో  చెప్పలేని  ఒళ్ళు  గగుర్పొడిచే  అనుభవం, చేతుల మీదుగా ఏవో  కుందేళ్ళు  పరుగెడుతున్న  భావన లా అనిపిస్తుంది”  అని  చెపుతారు.
ఆ రోజు అర్ధరాత్రి ఆ దయితపతులు పాత విగ్రహాల్ని గుడిలో  ఒక చోట  తవ్వి పాత విగ్రహాలు పూడ్చిన చోటే వీటిని కూడా పూడ్చిపెడతారు.  ఈ ప్రక్రియ ఎవరూ  చూడకూడదు అని ప్రభుత్వం చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. ఆ సమయం లో  పూరి నగరం లో పూర్తిగా  దీపాలు  ఆర్పేసి  అంధకార బంధురం గా చేస్తారు. ఒక వేల  ఎవరైనా  అత్యుత్సాహంతో  చూస్తే మరణం తథ్యం అని నమ్ముతారు.

రెండో రోజున కొత్త  విగ్రహాలు రత్న సింహాసనం మీద ఆశీనులను  చేసాకా  ఆలయమర్యాదలతో  ఆ దేవదేవునికి  పూజలు అవీ  మామూలుగా  58 రోజుల తర్వాత మొదలవుతాయి. 

మూడవ రోజున దేవదేవుడు  రథం మీద లోకానికి  దర్శనం  ఇవ్వడానికి  బయలుదేరతాడు. సుమారుగా ముఫై లక్షల మంది ఆ జగన్నాధుని  రథోత్సవం లో పాల్గొంటారు.


ఆ జగన్నాధుని ఆశీస్సులు మీ అందరికి దొరుకు గాక!!!

1 comment:

  1. నమస్కారమండీ వెంకట్రావుగారు :),

    ఎప్పుడో మా చిన్నప్పుడు మా తాతగారు పూరీ జగన్నాధుడి మహిమలని చెబ్తూ ఈ విగ్రహాల విశిష్టతని చెప్పినగుర్తు కానీ ఇంత విపులంగా చెప్పలేదు. మీరు వివరంగా ఒక టపానే రాసేసారు. ధన్యవాదాలు. ఏకాదశి రోజునా జగన్నధుడి మంచి విష్యాలు కొన్ని తెలిసాయి

    - నందు (ముఖ పుస్తక మితృడు..మీకుగుర్తుంటే)

    ReplyDelete