Friday, September 26, 2014

లౌక్యం – సినిమా రివ్యూ
నటీ నటులు:

గోపిచంద్; రకుల్ ప్రీత్ సింగ్; బ్రహ్మానందం;చంద్రమోహన్; ప్రదీప్ రావత్; సంపత్ రాజ్; “30 years ఇండస్ట్రీ – పృథ్వి”; రఘు బాబు;ఒక బుల్లి పాత్రలో పోసాని కృష్ణ మురళి; ఇంకో బుల్లి పాత్రలో కృష్ణ భగవాన్; కాస్త ఎగష్ట్రా గా ఒక చిన్న పాత్ర కోసం మరియు ఐటెం పాట కోసం హంసానందిని.......కూడా ఉందండోయ్.
మాటలు: కోన వెంకట్; గోపి మోహన్
సంగీతం: మన తమన్ బాదుడు నుంచి విముక్తి దొరికింది మనకి.....ఇందులో సంగీతం ...అనూప్ రూబెన్స్
కెమెరా: వెట్రి.    
అస్సలు expectations లేకుండా ఉన్నపళం గా సినిమా చూద్దాం అని వెళ్ళిపోయా. నిరాశ పడలేదు.
కధా, కధనం అంతా మామూలే. హీరో గారు అతను ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ పెద్ద వాళ్ళ అనుమతితోనే పెళ్ళి  చేసుకుంటా  అని చెపుతాడు అలానే చేసుకుంటాడు చివరికి. ఇదివరకు సినిమాల్లో చూసినట్టే ఇందులో కూడా హీరో విలన్ దగ్గిరే చేరి వాళ్ళతో ఉంటూ వాళ్లకి అసలు విషయం తెలియకుండా కామెడి గా మేనేజ్ చేస్తుంటాడు. మధ్య లో హీరో గారు  వాడుకోడానికి మన బ్రహ్మ్మి ఉంటాడు. వాళ్లకి తోడుగా హీరో గారి తండ్రి చంద్ర మోహన్. ఆ కామెడి మీరు ఊహించుకోవచ్చు. కొసమెరుపు ఏమిటి అంటే? ఇందులో హంసానందిని బ్రహ్మానందం భార్య.
గోపీచంద్ పాత్ర నటనా... మామూలే, అన్నిటిలో ఉన్నట్టే ఇందులో కూడా ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ చాలా refreshing గా ఉంది. పెదాల మీద ఎదో కందిరీగ కుట్టినట్టు అనిపించేలా ఉంది మొహం, కాని అమ్మాయి బావుంది. action కూడా బాగా చేసింది. ఈ అమ్మాయిని ఇదివరకు వెంకటాద్రి ఎక్స్ ప్రెస్  లో చూసా అందులో కంటే ఇందులోనే నాజూకుగా బావుంది.   
ఇందులో అన్నిపాటలు చెవులకి అంత ఇబ్బంది కల్గించలేదు కాని ఒక్క పాట కూడా సన్నివేశానికి నప్పలేదు.
కోన వెంకట్ – గోపి మోహన్ మళ్ళి నిరూపిస్తారు వాళ్ళు కామెడి ని బాగా ఇవ్వగలరు అని.  సినిమా మొదటి భాగం లోనూ, రెండో భాగం లోనూ కామెడీ పుష్కలంగా ఉంది. నేనైతే హాయిగా నవ్వాను. బ్రహ్మానందానికి చాల ఆరోజుల తర్వాతా పెద్దగా “ఓవర్ action” లేని పాత్ర వచ్చింది. అయినా అతను తన శాయశక్తులా కాస్త ఓవర్ action చెయ్యడానికి ప్రయత్నించాడు.
హంసానందిని పాత్ర మీద అక్కడక్కడా కాస్త “ముదర  కామెడి” ఉండచ్చు. అవ్వడానికి బ్రహ్మానందం భార్య అయినా కూడా ....సన్నివేశ పరంగా  ఆవిడ మీద చంద్రమోహన్, హీరో గారు వేసే ఓవర్ action కొందరికి ఎబ్బెట్టుగా అనిపించచ్చు కాని దానిని vulgar అని అనలేను.

సినిమా లో కామెడీ కి హైలైట్ “Boiling star – Bablu” (30 years industry fame పృథ్వి). అతను టీవీ సీరియళ్ళ లో హీరో పాత్ర ధారి. ఆలాగే రఘు బాబు కూడా బాగానే ఉన్నాడు. ఒక చోట రఘు బాబు  హీరో వెనకాల Car chasing లో ఉన్నప్పుడు హీరో లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసి కుడివేపు కారు తిప్పుకుని వెళ్ళిపోయే సీన్ నాకు చాలా నవ్వొచ్చింది. అలాగే క్లైమాక్స్ లో కూడా పృథ్వి నవ్వు తెప్పిస్తాడు.

ఏమి తోచనప్పుడు, మరీ చిరాకుగా ఉన్నపుడు......ఓ సారీ వెళ్లి చూసి రావచ్చు. 

Friday, September 12, 2014

రవితేజ - పవర్ సినిమా రివ్యూ

రవితేజ – పవర్

కొత్త దర్శకుడు “బాబి” దర్శకత్వం వహించిన చిత్రం పవర్.

ఈ సినిమా అచ్చు రవితేజ సినిమాలానే ఉంటుంది. మొదటి భాగం చాలా నవ్వులతో నడుస్తుంది. మొదటి భాగం లో కోన వెంకట్ డవిలాగులు బాగా నవ్విస్తాయి ...కాని సెకండ్ పార్ట్ లో చాలా పేలవంగా ఉన్నాయి డయిలాగులు.
సినిమా కధ లో కొత్తదనం ట్విస్టులు ఏమి ఊహించుకోవక్కర్లేదు.........కధ సాగుతుండగానే మనకి అన్ని అలా అలా అర్ధం అయిపోతుంటాయి. పెద్దగా ఆశ్చర్యపడక్కర్లేదు. సినిమాలో డవిలాగులు/ కొన్ని పాటలు/ కొంత కామెడి ఇలా అన్ని కొన్ని పాత సినిమాల్లోంచి తీసుకుని స్వేచ్చగా వాడుకున్నారు........ఒక సన్నిలియోన్ పాట తో సహా ...(అంటే ఇక్కడ సన్నీ లియోన్ “ yeh duniya pittl di” అన్న పాటని ఒక క్లబ్బు లో వెనక జైంట్ screen మీద చూపిస్తుంటారు).

తమన్ మ్యూజిక్ అచ్చు తమన్ సంగీతం లానే ఉంటుంది. ఒక చెక్క టేబుల్ మీద ఒక రూళ్ళ కర్రతో కొడుతూనే  అంటాడు - అన్నిపాటల్లోను అదే బీట్. నేపధ్య గాయకుడూ ఎవడో తెలియదు కాని అతని గొంతు ఎక్కడా వినబడకుండా తమన్ జాగ్రత్తలు తీసుకున్నాడు....పాట ఆద్యంతం బాదుడు శబ్దాలే వినబడుతూ ఉంటాయి కాని వాయిస్ వినబడదు. (లేదా నేను సినిమా చూసిన థియేటర్ లో సౌండ్ సిస్టం వల్లనా?కాని ఆ థియేటర్ ఇక్కడ చాలా పెద్ద పేరున్న వాళ్ళదే మరి? టూరింగ్ టాకీస్ కాదు)

మొదటి పార్ట్ లో హన్సిక తో పాటలు..............రెండో భాగం లో రెజినా తో పాటలు.

ఇంకా తారాగణం వరకు చూస్తే చాలా మందిని వాడుకున్నారు కాని వారంతా అవసరమా? అన్నది ఒక సందేహం. కోట శ్రీనివాసరావు, బ్రహ్మాజీ, ముకేష్ రిషి, పోసాని కృష్ణ మురళి, జీవా, బ్రహ్మానందం, సుబ్బరాజు, అజయ్, సురేఖా వాణి, ప్రకాష్ రాజ్, జోగి బ్రదర్స్, సప్తగిరి  ఇలా.................. చాంతాడంత లిస్టు ఉంది. మొదటి భాగం దర్శకుడు చిత్రీకరించినట్టు...........రెండో పార్ట్ మాత్రం వేరే ఎవళ్ళో ఒక చేత్తో చుట్ట చుట్టేసినట్టు ఉంది.

అన్నట్టు చెప్పడం మర్చిపోయా ఉన్నంతలో సప్తగిరి బెటర్ గా ఉన్నాడు..........బ్రహ్మానందం ని ఇంకా ఎన్నాళ్ళు ఇలా చూడాలో?
క్లైమాక్స్ మాత్రం పుటుక్కున కరెంటు తీగ లాగేసి లైట్ ఆరిపోయినట్టు అయిపోతుంది.


అయినా ఒక సారీ వెళ్లి చూసి వస్తే రావచ్చు.........................!!!

Monday, September 1, 2014

నేను బాపు గారిని కలిసిన రోజు

అప్పుడు నాకు సరిగ్గా 24 ఏళ్ళ వయస్సు; 1986 లో మొట్టమొదట సారీ శబరి institute – అన్నాసలై లో ఎదో ఒక మూడు నెలల చిన్న కోర్సు చెయ్యడానికి మెడ్రాసు వెళ్లాను. పల్లవన్ తంగళ్ అనే నగర శివార్లలో ఉన్న ఒక కాలని లో ఒక చిన్న రూములో ముగ్గురం కలిసి ఉండే వాళ్ళం.

వాళ్ళు వీళ్ళు చెప్పగా తెలిసింది కన్నెమెరా లైబ్రరీ ఆసియా లోకెల్లా అతిపెద్ద గొప్ప లైబ్రరీ అని (ఆ రోజుల్లో), దాని చూద్దాం అని ఒకరోజు వెళ్లాను...అన్ని అంతస్తుల లైబ్రరీ లో ఎన్ని వేల, ఎన్ని లక్షల పుస్తకాలు ఉన్నాయో  నాకే తెలియదు. అలా తిరిగి, తిరిగి అలిసిపోయకా అక్కడ ఉన్న ఒకాయన చెప్పాడు “ఇక్కడి ఆర్ట్ gallery మహాద్భుతంగా ఉంటుంది చూసావా బాబూ”? అని. సరే పనిలో పని అది కూడా ఒక సారీ చూసేద్దాం అని అటువేపు కూడా వెళ్లాను.

ఆ ఆర్ట్ గేలరీ ఒక మహా ప్రపంచం. అందులో దేశ విదేశాల చిత్రకారుల బొమ్మలు నిలువెత్తు ఫ్రేముల్లో సజీవంగా ఉన్నట్టు ప్రదర్శిస్తున్నారు. అందులో నాకు తెలిసిన వాళ్ళవి రాజా రవి వర్మ గారి బొమ్మలు (originals) చాలా కళా ఖండాలు ఉన్నాయి. వాటిని దగ్గిరగా నించుని అలా చూడడం మాటల్లో వర్ణించలేని మధురానుభూతి.అలా సాయంత్రం దాకా చూసి కళ్ళనిండా, కడుపు నిండా బొమ్మల్ని మనసులో నింపుకుని రూముకి చేరాను. విచిత్రం అందులో నాకు బాపు గారిది ఒక్క బొమ్మా కనపడలేదు. నేను బాపు గారి ఏకలవ్య శిష్యుడిని. ఆయన లా అక్షరాలూ రాద్దామని, ఆయన బొమ్మలు చూసి ఆయనలా వేద్దామని తెగ తాపత్రయ పడిపోతుండే వాడిని. ఆయన వీరాభిమానిని.

అలా అక్కడే మెడ్రాసులో  ఉన్నపుడు చటుక్కున ఒక రోజు మనసులో ఆలోచన వచ్చింది, బాపు గారు ఇక్కడే ఎక్కడో మెడ్రాసు లో ఉంటారు కదా? ఒకసారి వెళ్లి కలుద్దాం అని. అనుకున్నదే తడవు ఒకరోజు ఎడ్రస్ కనుక్కుని ఎకాఎకిన బాపు గారి ఇంటికి వెళ్ళిపోయాను. నాకు చిన్నప్పటి నుంచి ఒక hard bound తెల్లకాయితాల పుస్తం లో నాకు నచ్చిన కవితలు, సూక్తులు, చలోక్తులు, కొటేషన్ లు, బొమ్మలు సేకరించే హాబీ ఉండేది. అందులో నేను ఒక బాపు గారి write up ని నా చేత్తో రాసుకుని దానికి బాపు గారి మొహం బొమ్మ వేసి పెట్టుకున్నా. ఆ బుక్కు కూడా నాతో పాటు తీసుకెళ్ళాను, ఒక వేళ బాపు గారు నిజంగానే కలిస్తే ఆయనకీ నేను వేసిన ఆయన బొమ్మ చూపించి ఆయన చేతి autograph తీసుకోవాలి అని నా ప్లాన్/ ఆశ కూడా. గుమ్మంలో నించుని తలుపు కొట్టాను. ఎవరో ఒక అమ్మాయి వచ్చి అడిగింది “ఎవరు కావాలి అండి” అని, చెప్పాను. ఇంతలో లోపల్నించి ఒకాయన గళ్ళ లుంగీ లో బయటికి వచ్చారు...ఎవరా అని  చూద్దును కదా.. సాక్షాత్తు బాపు గారు. నాకు నోటంట మాట రాలేదు ఆనందం లో. ఏం మాట్లాడాలో తెలియదు. పాపం నా అవస్థ గ్రహించి కాబోలు ఆయనే పలకరించారు, ఎక్కడనించి వచ్చావు? ఎం చేస్తుంటావు  ఇలా... అన్ని చెప్పాను. నా చేతిలో ఉన్న పుస్తకం తెరిచి ఆయన బొమ్మ చూపించి ఆయన autograph అడిగాను. దాన్ని సాంతం పరికించి ఒక బుల్లి చిర్నవ్వు నవ్వి కింద “శుభాకాంక్షలతో బాపు“ అని సంతకం పెట్టారు. అప్పుడు నా చాతీ ఆనందం తో ఒక నాలుగించీలు పెరిగి ఉంటుంది.

అప్పుడు అడిగా ఆయన్ని. “నిన్ననే కన్నెమెర లైబ్రరీ కి వెళ్లి అన్ని చూసి వస్తున్నా...అక్కడ మీ బొమ్మలు ఎందుకు లేవండీ?” అని.  దానికి ఆయన నవ్వి, ఒకింత సిగ్గుపడుతున్నట్టు మెల్లిగా అన్నారు, “అబ్బే అక్కడ అన్ని పెద్ద పెద్దవాళ్ళ వి, మహానుభావులవి పెడతారు”. ఆయన నిరాడంబరత్వానికి ఆశ్చర్యపోయా.

ఎందుకో అదేదో ఒక పాత దేవానంద్ హిందీ సినిమా పాట లో లా....”అభి నా జా ఓ చోడ్ కర్... యే దిల్ అభీ భరా నహి” అన్నట్టు ఆయన్ని వదిలి వెళ్ళ బుద్ధి కాలేదు. నా note బుక్కు లో ఇంకో ఖాళి పేజీ తీసి దానిలో ఇంకో autograph ఇమ్మని అడిగా. ఆయన నాకేసి విచిత్రంగా చూసి, నవ్వి “సరే తీస్కో ఫో” అన్నట్టుగా ఇంకో బుల్లి autograph ఆ ఫుల్లు పేజిలో మధ్యలో  పెట్టి ఇచ్చారు. అలా ఆయన్ని ఇంకాస్సేపు చూసి బయటకి వచ్చేసా.

అంతే ఆ తర్వాత మళ్ళి ఆయన్ని భౌతికంగా కలిసే అవకాశం కలగలేదు.

ఇప్పుడు మనం కలుద్దాం అన్నా మనం కలవలేని దూరాలకి ఆయన తన స్నేహితుడిని కలవడానికి వెళ్ళిపోయారు.