Showing posts with label tamanna. Show all posts
Showing posts with label tamanna. Show all posts

Thursday, October 18, 2012

కెమెరామెన్ గంగ తో రాంబాబు - సినిమా సమీక్ష



(పవన్ కళ్యాణ్ అభిమానులకి ఒక విజ్ఞప్తి. నేను కూడా పవర్ స్టార్ కి అభిమానినే. జల్సా, ఖుషి, తమ్ముడు, మొన్న మొన్నటి గబ్బర్ సింగ్ కూడా బాగా నచ్చాయి నాకు...ఈ సినిమా నాకు ఎలా అనిపించిందో అలా ఉన్నది ఉన్నట్టు రాస్తున్నా...దయచేసి తప్పుడు అర్ధాలు తియ్యకండి)
సినిమా పేరు ఉన్నంత క్యాచీ గా సినిమా తియ్యలేదు దర్శకుడు. పవన్ కళ్యాణ్ చాలా బాగా కష్టపడి నటించాడు. ఎక్కడా సినిమాలో అరుపులు కేకలు, మెరుపులు లేవు. హీరో – హీరొయిన్ ఎంట్రీ కూడా ఉన్నంతలో ..కాస్త సాదా సీదాగానే ఇచ్చారు. సినిమా మొదటి భాగం అంతా కాస్త లైవ్ లీ గా నడిచిపోతుంది. ఒక సారి గట్టిగా ఆలోచిస్తే, తమన్నా పవర్ స్టార్ ని కాస్త డామినేట్ చేసిందా అనిపిస్తుంది అక్కడక్కడ. తమన్నా నటన బాగా ఉంది. సినిమా సినిమా కి బాగా పేరు తెచ్చుకుంటోంది.
పవన్ ని చూస్తూ సినిమా లో కాలం గడిపేయ్యచ్చు. పవన్ ఒక కారుషెడ్డు లో మెకానిక్ నించి ఒక టీవి లో న్యూస్ రిపోర్టర్ గా ఎలా మారిపోతాడో చూపించిన క్రమం కాస్త వెటకారం గా అనిపించింది. అయినా కూడా పవన్ బావున్నాడు. తమన్నా మన ‘కెమెరామెన్ గంగ’ అన్నమాట. ఇద్దరు కలిసి రిపోర్ట్ చేసిన సన్నివేశాలు పెద్దగా ఉండవు సినిమాలో, అయినా సినిమా పేరు బాగా కొత్తగా ఉండి అలరిస్తుంది.
ప్రకాష్ రాజ్ పాత్ర చాలా పేలవంగా తీర్చి దిద్దాడు దర్శకుడు. అస్సలు అందులో దమ్ము లేదు.కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి..............వీళ్ళంతా ఇలాంటి పాత్రలు ఎన్నివేసి ఉంటారో లెక్కే లేదు? ఏదో పెట్టాం కదా అన్నట్టు ఉంది ధర్మవరపు సుబ్రహ్మణ్యం/ ఎమ్మెస్ నారాయణ పాత్ర. కాస్తలో ..కాస్త అలీ బావున్నాడు. బ్రహ్మానందం – మళ్ళి ఇంకో disaster character లో కనబడతాడు. బ్రహ్మానందం- పవన్ తో కలిసి TV లో వార్తలు కాస్త వక్రీకరించి ఎలా చదువుతాడో చూపించే సన్నివేశం బాగా పండింది.
సంగీతం - పెద్దగా చెప్పుకోడానికి ఏమి లేదు, ఒక ఐటెం సాంగ్ – జరమొచ్చింది  బాగా ఊపుగా ఉంది, పాట  ఉన్నత ఊపుగా ఆ అమ్మాయి డాన్సు లేదు, యధావిధిగా పవన్ బాగా స్టేప్పులేసాడు. తమన్నాతో చేసిన “నీ నగుమోమే extra ordinary” పాత చిత్రీకరించిన తీరు చాలా బావుంది.పవన్ కళ్యాణ్, తమన్నా చితక్కోట్టేసారు ఈ పాటలో.
సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర (నాజర్) స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారిని పోలి ఉన్నట్టు అనిపించింది...ఖద్దరు పంచె కట్టు, నవ్వు ముఖం, “పాదయాత్ర చేసాను కదా అంతా తెలుసులే “ అన్న డైలాగు ల వల్ల. ముఖ్యమంత్రి పాత్ర పేరు కూడా చంద్రశేఖర రెడ్డి. కోట శ్రీనివాసరావు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ప్రతిపక్షనేత...పాత్ర పేరు అదేదో నాయుడు గారు.
తెలంగాణా ఉద్యమాన్ని ఏదో indirect గా వేరే పేరుతో (తెలుగు వాళ్ళు మిగతా భాషల వాళ్ళు అన్న థీం తో) ఏదో భాషా ఉద్యమం అన్నట్టు చూపించే ప్రయత్నం చేసాడు. పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి ఆ సన్నివేశాలు.
సినిమా చివరలో చాల నాటకీయంగా వేలాది ప్రజలు స్వచ్చందంగా ఒక్కచోటకి మన రాంబాబు కి సపోర్ట్ గా వచ్చి నిలబడతారు...ఆ సీన్ చిరంజీవి ఠాగోర్  సినిమాని స్ఫురింప చేస్తుంది. అప్పుడు కొన్ని మూస డైలాగులు ఉంటాయి...తర్వాత............Climax dialogue…..
“మా కుటుంబాన్ని జనం పట్టించుకోలేదు కాని – ‘నేను’ మాత్రం ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తుంటాను” . ఇందులో ఏదో శ్లేష కనబడుతోందా మీకు? ఇది సినిమా శుభం కార్డు పడేముందు ఆఖరి డైలాగు. అంటే మళ్ళి ఇంకో సినిమా (sequel) తీసుకోడానికి తలుపు కాస్త ఓరువాకిలిగా తెరిచి పెట్టుకున్నాడన్నమాట  మన పవన్ కళ్యాణ్. బయటకి వచ్చేసకా నాకు తట్టిన ఊహ ఏమిటంటే..బహుశ మన పవర్ స్టార్ జగన్ బాబు వైపు ఏమైనా చూస్తున్నాడా అని? ఎందుకంటే..రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన పాత్ర విలన్ ఇందులో. రాజశేఖర్ రెడ్డి గారి పాత్ర లో ఉన్న వ్యక్తి మంచివాడు. చివరాఖరు డైలాగు లో మర్మం.......మా కుటుంబాన్ని జనం పట్టించుకోలేదు కాని........(చిరు అన్నయ్యని వదిలేసారు అని కామోసు) “నేను మాత్రం ఎప్పుడు మీ గురించే ”..గమనించండి “మేము” అనలేదు మరి.......!!!!

“దర్శకుడు పూరి జగన్నాధ్ సినిమా నిర్మాతపై తనకి రావలసిన బాకీ పారితోషకం వివాదం పై డైరెక్టర్ల సంఘం లో సినిమా విడుదలకి ముందే ఫిర్యాదు చేసారు “ – వార్త. నిజమే మరి బొమ్మ రిలీస్ అయ్యేముందే దర్శకుడు విషయం అర్ధం చేసుకున్నాడు కాబట్టి ఆ మాత్రం జాగ్రత్త పడడం లో తప్పులేదు.

వ్యక్తిగతంగా నాకు, ఈ సినిమా కంటే...గబ్బర్ సింగ్ సినిమా బాగా నచ్చింది.

Friday, September 28, 2012

ప్రభాస్ – రెబెల్ సినిమా రివ్యూ



ప్రభాస్ ఒక నిజమైన “రెబెల్ మాస్ స్టార్” లా అవతారమెత్తిన చిత్రం - రెబెల్ సినిమా. చాలా రఫ్ గా, సరైన మొగాడిలా అతనిని చూపించే ప్రయత్నం చేసిన సినిమా - రెబెల్.  

సినిమా మొదలయ్యిన కాస్సేపటి దాకా మనకి ఏమి జరుగుతోందో పెద్దగా అర్ధం అవ్వదు కాని బాగా గ్రిప్పింగ్ గా ఉంటుంది.
సినిమా అంతా ప్రభాసే!!!
మొదటి భాగం చాలా బావుంది. హాయిగా నవ్వుకోవచ్చు. చాల రోజుల తర్వాత బ్రహ్మానందం కి కాస్త మంచి నిడివి గల  పాత్ర ఇచ్చారు.బ్రహ్మానందం, ప్రభాస్, తమన్నా, కోవై సరళ అందరు కలిసి కాస్సేపు బాగానే నవ్విస్తారు మనల్ని. 
తమన్నా introduction పాట చాలా catchy  గా తీసారు. పాటలో బీట్లు foot tapping గా ఉంటాయి. ఈ పాటలో తమన్నా కి చాలా మంచి స్టెప్పులు, కాష్ట్యూమ్స్ కూడా ఇచ్చాడు లారెన్స్. ఈ పాట చూసాక నేను ఒక నమ్మకానికి వచ్చేసా......తెలుగు తెరకి ఇంక ఇలియానా అవసరం లేదు. తమన్నా వచ్చేసింది....పిట్టనడుముతో.  ఇంక మన దర్శకులు హీరోలు అంతా ఆ నడుము చుట్టూ తిరుగుతారు. http://www.youtube.com/watch?v=UqOlSp4qKjU
బ్రహ్మానందం – కోవై సరళ హాస్యం అనుకున్నట్టే ఉంటుంది. కోవై సరళ ఉన్నంతలో అరవ హాస్యం బాగానే పండించింది. బ్రహ్మానందం, కోవై సరళ Hip – Hop dance steps ఊహించుకుంటేనే నవ్వొస్తుంది...ఇంకా చూస్తే..?? కొన్ని డైలాగులు – “అబ్బ ఊరుకోండి సార్...మనదేశం లో యాభై శాతం నాలాంటి పోట్టున్నోళ్ళు (పొట్ట చూపించి) బట్టున్నోళ్ళు (బట్ట తల చూపించి).” “నాపేరు నరస రాజు అండి ...అందరు నన్ను ‘నస’ రాజు అంటారు”. జెట్ ఎయిర్ వేస్ రిసెప్షన్ అమ్మాయి “నేను మీకు ఏ రకంగా సహాయ పడగలను” అన్నప్పుడు, బ్రహ్మి “ ఓ యాభై వేలు అప్పుంది ఏమైనా సద్దుతావా”?
రెండో భాగంలో మన కమెడియన్ అలీ ఒక డాన్స్ మేష్టారిలా ఎంట్రి ఇస్తాడు. ఉన్న పది నిమిషాలు బాగా నవ్వుకుంటాం. ఆ పదినిమిషాల్లో ఓంకార్ ‘అన్నియ్య’ మీదా, శివశంకర్ మాస్టర్ మీద కాస్సేపు జోకులు...
రెండో భాగం లో మీరు అనుకున్నట్టే కధ నడుస్తుంది. ఇంక ఇందులో అన్ని లారెన్స్ ట్రేడ్ మార్క్ అరవ fightings, అరవ ఎమోషన్స్ చూపిస్తాడు. ప్రభాస్ ఎమోషనల్ సీన్లు కూడా బాగా చేసాడు అనిపించింది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బాక్ లో వచ్చే దీక్షా సేథ్ ...ఫేస్ బుక్ లో ఉన్న చాలా మంది ఆడపిల్లలు పెట్టుకునే ఒక అందమైన display profile picture లా ఉంటుంది...కస్సేపయ్యాక చచ్చిపోతుంది.
సినిమాకి కాస్త Hype create చేద్దామని కామోసు పాత తరం రెబెల్ స్టార్ కృష్ణం రాజుని ఒక పాత్రలో తీసుకువస్తాడు లారెన్స్. అది మన హీరో గారి తండ్రి పాత్ర..సహజంగానే అది ఒక ఊరిపెద్ద, ఉదాత్త మైన పాత్ర. అతన్ని చంపగానే మన హీరో గార రెబెల్ గా అయిపోతారు. ఒక ఫైట్ లో ప్రభాస్ కండలు చాల బాగా చూపించారు మంచి ఎఫెక్ట్ వచ్చింది...నేల, బెంచి జనాల్లో ఈలలు, కేకలు పుష్కలంగా వస్తాయి.
మొదటి భాగం చూసి ఇంటికి క్షేమంగా వచ్చెయ్యండి – హాయిగా నవ్వుకుంటారు. మరీ యుద్ధాలు, రక్తాలు ఉన్నా  పర్వాలేదు అంటే రెండో భాగం కూడా చూడండి. యుద్ధాలు రక్తాలు మనకి కొత్త కాదు కాని, వాటితో పాటు వెనక్కాల అరవ మ్యూజిక్ = కొత్త మనకి, నాకు కాస్తంత గుండె దడ వచ్చింది.
సినిమా బాగా ఆడి మంచిపేరు వస్తే అది మొదటి భాగం వల్ల. ఒకవేళ ‘సినిమా పోయింది – వేష్టు’ అని పేరువస్తే అది రెండో భాగం వల్ల.
మొత్తం మీద ఇది ప్రభాస్ సినిమా.