Showing posts with label hospital. Show all posts
Showing posts with label hospital. Show all posts

Friday, February 6, 2015

John Q - (2002) English Film - జాన్ క్యు ఇంగ్లీష్ సినిమా కధ.


John Q - Denzil Washington (2002)  సినిమా మధ్యాన్నం  చూసాను. ఈ సినిమా మనసుకి బాగా హత్తుకు పోయింది. అందుకే ఇది చాల పాత సినిమా అయినా కూడా మీ అందరితో పంచుకోవాలి అని ఇది రాస్తున్నా..!!!

మన హీరో వాషింగ్టన్ ఒక దిగువ మధ్య తరగతికి చెందిన చిన్న కుటుంబ సంసారి. ఒక ఫ్యాక్టరీ లో ఒక పార్ట్ time ఉద్యోగి. భార్య ఒక కిరాణా కొట్టులో పద్దులు రాసే ఆవిడ (Billing clerk in a Grocery) వీళ్ళకి ఒక 10 సంవత్సరాల కొడుకు. జీవితం ఉన్నంతలో హాయిగా, నవ్వుతూ....సాఫీగా  అలా ఎదో జరిగిపోతూ ఉంటుంది.

ఉన్నట్టుండి ఒకరోజు  కొడుకు స్కూల్ నించి కబురు. అబ్బాయికి ఎదో అయ్యింది అని.

ఉరకలు పరుగుల మీద తల్లి తండ్రులు ఇద్దరూ అక్కడికి చేరుకుంటారు. అబ్బాయిని హాస్పిటల్ కి తీసుకెళతారు. డాక్టర్లు అన్ని  పరిక్షలు చేసాక తెలుస్తుంది అబ్బాయికి గుండె లో ఎదో ప్రోబ్లం ఉంది. ఈ స్థితిలో దానికి చికిత్స లేదు, గుండె మార్పిడి ఒక్కటే శరణ్యం అని. అది విన్న తల్లి తండ్రులకి గుండె గుభిల్లు మంటుంది, అయినా తట్టుకుంటారు. పర్వాలేదు మనకి ఇన్స్యూరెన్స్ ఉందిలే అనుకుంటూ.

తీరా అన్ని చర్చలు అయ్యాకా హాస్పటల్ వారు చావు కబురు చల్లగా చెపుతారు, మీకున్న ఇన్స్యూరెన్స్ లో ఈ ఖర్చు include అవ్వదు. మీరు డబ్బు కడితే కాని వైద్యం కుదరదు అని. ఎంత కట్టాలి? - $250,000/- మన భాషలో అక్షరాలా "ఒక కోటి డెబ్భై అయిదు లక్షలు". చిన్న సంసారి, అంత ఎక్కడినించి తేగలడు? అక్కడికి అక్కడా ఇక్కడా ఉరకలు, పరుగులు పెట్టి వాళ్ళని వీళ్ళని బ్రతిమి లాడి $6,000/- పోగేస్తారు. అది ఏ మూలకి చాలదు.

చివరికి ఇన్స్యూరెన్స్ కంపెనీకి వెళ్లి దేబ్బలాడతాడు ఎందుకు మా ఖర్చు కవర్ అవ్వదు అని? నువ్వు చేసే ఇంతోటి చిన్న ఉద్యోగానికి అసలు ఇన్స్యూర్తెన్స్ ఇవ్వడమే పెద్ద favour  అన్నట్టు మాట్లాడతారు. మన దేశం లో లానే - నీకు కాస్తో కూస్తో ఒక బుల్లి ఉద్యోగం ఉంది కాబట్టి నీకు "ఆరోగ్య శ్రీ" కూడా ఇవ్వలేము  అని ప్రభుత్వం వారు కూడా చేతులు దులిపెసుకుంటారు.

నిరాశా, నిస్పృహతో ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితులలో ఉండగా, ఉన్నట్టుండి భార్య హాస్పటల్ నించి ఫోన్ చేస్తుంది. మన అబ్బాయిని డిశ్చార్జ్  చేసి బయటికి పంపించేస్తారుట అని.  ఏమి చేయాలో తోచని పరిస్థితులలో ఆస్పత్రికి వెళతాడు. డాక్టర్ని పరి పరి విధాలుగా ప్రాధేయ పడతాడు. కాళ్ళా వేళ్ళా పడతాడు. మనసు కరగదు. డబ్బు కట్టాల్సిందే లేదంటే కుదరదు అంటారు.

అంతే అతనిలో ఉన్న తండ్రి ఒక్క సారీ నిద్ర లేచి జూలు విదిలించిన సింహం లా గర్జిస్తాడు. డాక్టర్ మెడ మీద తుపాకి పెట్టి, ఆస్పత్రి తలుపులు మూసేసి,  అక్కడ ఉన్న అందర్నీ బందీలుగా చేస్తాడు. అతనిది ఒక్కటే కండిషన్. వాళ్ళ అబ్బాయికి ఆస్పత్రి వాళ్ళు అప్పుడప్పుడు  చేసే ఉచిత వైద్యం లో భాగంగా ఈ గుండె మార్పిడి ఆపరేషన్ చెయ్యాలి, అబ్బాయిని బతించాలి.

ప్రెస్, జనం, పోలీసులు, కమెండోలు అందరు వచ్చేస్తారు ఈ hostage situation ని deal చెయ్యడానికి. అంతటా ఉత్కంట. Negotiations  నడుస్తూ ఉంటాయి. చివరాఖరికి పోనిలే మేము ఉచితంగా చేద్దాం అనుకున్నా... ఇప్పుడు గుండె ఎక్కడ ఉంది? అన్న ప్రశ్న వస్తుంది. అప్పుడు అది విన్న ఆ తండ్రి హృదయం లో ఒక ఆలోచన మెరుస్తుంది. అక్కడ ఉన్న డాక్టర్లకి చెబుతాడు, నాకు నా బిడ్డ కంటే వేరే ఏదీ ముఖ్యం కాదు. మీ అందర్నీ వదిలేస్తాను, నన్ను నేను కాల్చుకుని చచ్చిపోతాను, మీరు మాత్రం వెను వెంటనే నా గుండె తీసి మా అబ్బాయికి పెట్టండి. మా ఇద్దరిదీ ఒకటే బ్లడ్ గ్రూప్, అన్ని కలుస్తాయి అని వేడుకుంటాడు. ముందు ఎవరూ ఒప్పుకోరు, కాని ఇతను వదలడు.

ఈ లోపులో బయట ఒక పోలీసు అధికారి కాస్త అత్యంత ఉత్సాహం చూపించి ఒక కమెండో ని లోపలికి  పంపుతాడు ఈ   వాషింగ్టన్ ని కాల్చేసి  అక్కడ ఉన్న ప్రజల్ని రక్షించమని. ఆ కమెండో ప్రయత్నం లో వాషింగ్టన్ కి జబ్బలో బుల్లెట్ దూసుకు పోతుంది కాని కొన్ని అనుకోని చిన్న ప్రమాదం వల్ల కమెండో గాయపడి ఇతనికి దొరికిపోతాడు. ఇదంతా ఒక చానెల్ వాలు వాళ్ళ చానెల్ లో లైవ్ చూపిస్తారు. దేశం అంతా అది చూస్తుంది. కొడుకు పట్ల ఇతను పడుతున్న ఆరాటం చూసాకా...ఇతని పట్ల జనం లో సాను భూతి బాగా పెరుగుతుంది.

చివరికి ఇతను డాక్టర్లని ఒప్పించి చట్ట ప్రకారం కావాల్సిన కాయితాలు అన్ని సంతకాలు పెట్టి (నా పూర్తీ సమ్మతి తోనే నేను నా గుండె మా అబ్బాయికి ఇస్తున్నా అని) డాక్టర్లకి చేతికి ఇవన్ని ఇచ్చి. ఆపరేషన్ టేబుల్ మీదకి ఎక్కి పడుకుంటాడు, తన కణతకి తుపాకి పెట్టుకుంటాడు. ట్రిగ్గర్ నొక్కేస్తాడు. ఇక్కడ భావోద్వేగం తొ మనకి గుండె ఆగిపోవడం ఖాయం. చాలా బాగా చిత్రీకరించాడు దర్శకుడు.

సినిమా ఇంకా ఉంది చివరి దాకా చూడాలి అందరూ.

ఇందులో నాకు Denzil Washington నటనలో విశ్వరూపం కనిపించింది. తన కొడుక్కి, తన గుండె పెడతాను అని చెప్పే సన్నివేశం లో అతను కనబరచిన నటన అసామాన్యం. ఆ పది నిముషాల సన్నిశం  లో గుండెలు పిండేసే నటన కనబరచాడు. అది చూస్తున్నంత సేపు కళ్ళు చెమర్చని వాడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. అంత భావోద్వేగమైన నటన గుండెల్ని పిండేసే భావవ్యక్తీకరణ అతను ఎక్కడా... అరవకుండా, గుండెలు బాదేసుకోకుండా, బల్లలు కుర్చీలు చేతులతో కొట్టెయ్యకుండా.... గొంతు ఎక్కడా ఒక్క పిసరు కూడా పైకి లేవకుండా ప్రదర్సిస్తాడు.

అందుకే అతను Denzil Washington అయ్యాడు. I salute his performance.


అందరూ.........తప్పక చూడాల్సిన సినిమా ఇది.