ఈ మధ్యన ఎక్కడ చూసినా ప్రతీవాడూ “చరిత్రని మరవద్దు” అని హెచ్చరిస్తూ ఉన్నారు. లేదా చరిత్ర చూస్తే మనకి తెలుస్తుంది అందుకే ‘అలా ఉండాలి, ఇలా ఉండాలి’ అని లెక్చర్లు దంచేస్తున్నారు. ఒక్కసారి సరిగ్గా కూర్చుని అసలు చరిత్రలో ఏముందా అని ఆలోచిస్తే అన్ని విషయాలు మనకి బోధపడతాయి. చరిత్రని మనం ఒక టిష్యూ పేపర్ లాగా వాడుకుంటున్నాం అన్న విషయం సుష్పష్టంగా కనబడుతుంది. (చరిత్ర)నచ్చితే మడత పెట్టి దాచుకోవడం లేదా సుబ్బరంగా తుడిచి పడెయ్యడం.
రెండు జర్మనీలు పోలో మని చరిత్ర మీదే ఆధార పడితే, దాన్నే పట్టుకు వేళ్ళాడితే –
ఇవ్వాళ ఆ బెర్లిన్ వాల్ కూలగొట్టబడేది బడేది కాదు. అదే చరిత్రని నిజంగా నమ్మి ఉంటె ఇవ్వాళ
ఇండియా పాకిస్తాన్ విడిపోయేవే కాదు. గుడ్డిగా ఇదే మా పాత చరిత్ర అని ఇంకా పట్టుకు వేళ్ళాడితే
ఇంకా దేశం లో అస్పృశ్యత ఎక్కడ బడితే అక్కడ కనబడేది. అసమానతలు ఇంకా పెచ్చరిల్లెవి.
కాలానుగుణంగా పద్దతులు చారిత్రాత్మక నిర్ణయాలు మారాలి, మారుతున్నాయి కూడా.
కన్యాశుల్కం పోయి కట్నాలు వచ్చాయి, ఇప్పుడు కట్నాలు కూడా పోయే రోజులు బాగా
దగ్గరలోనే ఉన్నాయి. గట్టిగా మాట్లాడితే అబ్బాయిలకి ఇప్పుడు సరైన జోడి దొరకడం కాస్త
కష్టం అయ్యిందేమో కూడా!!
రాజకీయాల్లో ఈ చరిత్రలని ఎంత తొందరగా మర్చిపోతే అంత దేశానికి మంచిది. ఎప్పుడో
సినిమాల్లో ఉన్నప్పుడు NTR జై ఆంధ్రా అని ఉద్యమించి ఉండవచ్చు, కానీ తర్వాత ఆయన
కోట్లాది తెలుగు వాళ్లకి ఏకైక నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు వెనక్కి
వెళ్లి ‘చరిత్రని తవ్వుకుని’ అదిగో అప్పుడు NTR జై ఆంధ్రా అన్నాడు అందుకని ఇప్పుడు
ఇచ్చెయ్యండి అంటే బాగోదు. అప్పటికి అది ఇప్పటికి ఇది అనుకోవాలి. కాలానుగుణంగా ఆయన
ఆలోచనా తీరు మారింది అనుకోవాలి. తెలుగు దేశం లో మంత్రిగా ఉండగా ‘ప్రభుత్వోద్యోగాల్లో
జోనల్ సిస్టం సుద్ధ వేష్టు పీకి పారెయ్యాలి, అది రాష్ట్రానికి మంచిది’ అని శ్రీ
కల్వకుంట చంద్రశేఖర్ రావు గారు అసెంబ్లీ లో గట్టిగా ఉపన్యసించారు. ఇప్పుడు అదే
పాయింటు మీద తెలంగాణా ఉద్యమం ఉవ్వెత్తున లేవతీసింది ఆయనే (G.O. లో 14F గురించి). ఇప్పటి
కాలానుగుణంగా ఈ పాయింటు కావాలి పాత చరిత్ర అక్కర్లేదు.
అప్పుడు జై ఆంధ్రా అన్నారు కొందరు, ఇప్పుడు వాళ్ళే సమైక్య ఆంధ్రా అంటున్నారు.
మరి చరిత్ర సంగతి? అప్పుడు తెలంగాణా ఊసే లేదు (అరవై ఏళ్ల ఉద్యమం అని అందరు
అంటున్నా... చెన్నారెడ్డి ముఖ్య మంత్రి అయిపోయాకా, నిజానికి ఏక ధాటిన 20-30 ఏళ్ళు
ఎక్కడా ఒక్క ప్రస్తావన కూడా తెలంగాణా గురించి రాలేదు. కొందరు ఒప్పుకోపోయినా ఇది
పచ్చి నిజం?) ఇప్పుడు మాకు వేరే రాష్ట్రం కావాలి అంటున్నాం, ఎందుకంటే ఇది అరవై
ఏళ్ల ఉద్యమం అంటున్నాం, పాత చరిత్ర తవ్వుకుంటున్నాం మనకి అవసరం కాబట్టి తప్పు లేదు
ఇందులో.
ఏతా వాతా ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే చరిత్ర అన్నది ఒక సాకు, మనకి నచ్చితే –
చరిత్రని చూపించి వాడుకుంటాం, నచ్చక పోతే ఎదుటివాడికి “ఎవడో ఎదో తెలిసో తెలియకో
తప్పుచేసాడని మనం కూడా అదే తప్పు చేస్తామా” అని క్లాసుపీకుతాం.