Friday, May 31, 2013

ఇద్దరమ్మాయిలతో (అల్లు అర్జున్) సినిమా రివ్యూ

మనతెలుగు సినిమాకి మంచిరోజులు వచ్చేస్తున్న సూచనలు చాలా బాగా కనబడుతున్నాయి. అవును నిజమే అండి. పెద్ద పెద్ద హీరోలవి 40 – 50 కోట్లు పెట్టి తీసే పెద్ద పెద్ద బేనర్ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయిపోతున్నాయి. ఇలా తీస్తూ పోతే కొన్నాళ్ళకి ఈ పెద్ద బేనర్లు, ఈ సోకాల్డ్  పెద్ద హీరోలు కాల గర్భం లో నష్టాలతో మట్టి కొట్టుకుపోయి కలిసిపోతారు. అప్పుడు ఆ మట్టిలోంచి మళ్ళి మామూలు మంచి సినిమాలు వస్తాయని నాకు నమ్మకం.
మీరు బాగా షార్ప్, ఇప్పటికే కనిపెట్టేసి ఉంటారు. అవును ఈ బ్లాక్ బస్టర్ “ఇద్దరమ్మాయిలతో” చాలా పరమ చెత్తగా చాలా బోరింగ్ గా ఉంది.

సినిమాలో కాస్తో కూస్తో బావున్నది అల్లు అర్జున్ నటన, ఆ కొత్తమ్మాయి కేథరిన్ తెరెసా. ఎందుకో నాకు ఈ అమ్మాయిని చూస్తున్నంత సేపు కొత్త బంగారు లోకం లో నటించిన శ్వేతా బసు ప్రసాద్ గుర్తుకు వచ్చింది. ఇంతోటి సినిమాకి అక్కడికేక్కడికో యూరప్ వెళ్లి సినిమా తియ్యవలసిన అవసరం ఏమిటో నాకైతే అర్ధం కాలేదు. బోలెడు డబ్బు ఖర్చు తప్ప. మళ్ళి ఇంతోటి సినిమాకి అన్ని అయ్యాకా మళ్ళి ఏవో కొన్ని రీషూట్ కూడా చేసారుట..!!!
ఇంక బ్రహ్మానందం ఎంత తొందరగా సినిమాలు మానేసి ఇంట్లో కూర్చుంటే అంత మంచిది. ఈ సినిమాలో అతని కామెడి చాలా విసుగొచ్చింది. ఎంత మొహమాటం గా నవ్వుదామన్నా నవ్వు రాలేదు. అలీ కూడా వేష్టే ఇందులో. ఇందులో ఈ కామెడి చాలా loud గా ఉంది అయినా కూడా అస్సలు నవ్వు తెప్పించలేకపోయింది. చాలా మంది జనం మధ్యలో అసహనానికి లోనవ్వడం మనం గమనించ వచ్చు.
చిత్ర సంగీతం నవతరానినికి నచ్చుతుందేమో? నాకు ఏ పాటా కూడా పెద్దగా చెప్పుకోదగ్గట్టు అనిపించలేదు. దేవీశ్రీ ప్రసాద్ కూడా, తమన్ లాగా అన్ని వాయిద్యాలు వేసి బాదుడు తప్ప.
ఈ మధ్య ఒక కొత్త ట్రెండ్ చూస్తున్నా – తెలుగు చిత్ర సీమలో....” సినిమా ఫుల్లు మాస్సు గురూ” అంటున్నారు. ఈ మాస్ అంటే ఏమిటో ఇందులో కొంచం నాకు అర్ధం అయ్యింది. హీరో హీరోయిన్ లు ఎంత చదువుకున్నా, ఎంత సంస్కారం ఉన్నా... తెలుగు భాషనీ కాస్త ఒక మెట్టు కిందకి దింపి మాట్లడడం అన్న మాట – “మాస్” అంటే. “లేసిపోద్ది  (లేచిపోతుంది అనడానికి), లెగు – (లేవరా అనడానికి), సచ్చిపోతావు (చచ్చిపోతావు అనడానికి). అలాగే ఈ మధ్య ప్రతీ సినిమాలో పెడుతున్నట్టే...ఇందులో కూడా పెట్టాడు దర్శకుడు.. హీరోయిన్ హీరోతో అంటుంది...”నీకు ఎప్పుడో పడిపోయాన్రా”, “నువ్వు నాకు నచ్చావు రా”, “నువ్వు వొద్దన్నా నేను నువ్వంటే పడి సస్తారా,” ఇలాంటి పదాలు తన ప్రేమని వ్యక్తీకరించడానికి ఉపయోగిస్తూ ఉంటుంది.
సినిమా మొదటి భాగం బాగా సాగాతీసినట్టు అనిపిస్తుంది... రాం చరణ్ ఆరెంజ్ లాగా మొదటి భాగం అంతా కలర్ ఫుల్ గా ఎదో అలా నడిచిపోతూ ఉంటుంది కాని ఎందుకో ఏమిటో ...... సెకండ్ హాఫ్ కాస్త బెటర్, ఎదో కాస్త కధ కదులుతుంది (నమ్మ శక్యంగా లేకపోయినా) ఎదో ఒకటి నడుస్తుంది. చివర్లో ఇద్దరు అమ్మాయిలతో ఏమి చెయ్యాలో తెలియక – కొత్తమ్మయితో ఒక డైలాగు చెప్పిస్తాడు దర్శకుడు..”ఏమోనమ్మ మీరు ఇద్దరూ కొట్టుకుని ఎప్పుడైనా విడిపోకుండా ఉనటారా? నేను మధ్యలో దూరకపోతానా? ఇది ఇక్కడితో ఆగలేదు, ఇంకా ఉంది” అంటుంది. వేచి చూడండి ఇద్దరంమాయిల పార్ట్ 2.
ఈ సినిమాలో converted brahmins – “బాప్నీస్” ట  అన్న ఒక కొత్త పదం coin చేసాడు దర్శకుడు కామెడీగా (అనుకుని). దాని అర్ధం ఏమిటో ఆ దర్శకునికి ఆయనకీ మాటలు రాసిపెట్టే కొసరు కధకుడికి మాత్రమె తెలియాలి.

సినిమా అయిపోయాకా ఆఖరున స్క్రీన్ మీద మన పూరి గారి టైటిల్ కార్డ్ వస్తుంది THANKS FOR WATCHING THIS MOVIE – PURI JAGANNADH”. అవును నిజమే, ఇంత రిస్క్ తీసుకుని ఇలాంటి సినిమాని చివరి దాకా కూర్చుని చూసినందుకు మనకి ఆ మాత్రం థాంక్స్ చెప్పద్దూ??