సాఫీగా సాగిపోతున్న జీవితం. పొద్దున్న్నే లేవగానే శ్రీమతి తెచ్చి ఇచ్చే కాఫీ ,
గుమ్మంలో ఆరవ్వకుండా వచ్చే దిన పత్రిక
(అది ఉన్న ఊరుని బట్టి “ఈనాడు”,
లేదా “మైసూరు మిత్ర” లేదా “దైనిక్ భాస్కర్” మరియు Indian Express). హాయిగా వీధి వరండాలో కూర్చుని నీరెండ మొహం మీద పడుతుండగా ఇంటిపట్టున కాఫీ
తాగుతూ, పేపర్ చదివి, స్నానం చేసి బేంక్ కి వెళ్ళడం. అక్కడ “మన వాళ్ళ మధ్య” పిచ్చా
పాటి మాట్లాడుకుంటూ రోజంతా ఆనందంగా పని చేసుకోడం. సాయంత్రం తిరిగి ఇంటికి
చేరుకోడం. కాస్సేపు సేద తీరాకా హీరో హోండా బైక్ మీద ఇద్దరు పిల్లలు భార్యా అందరం
అలా ఒక లాంగ్ డ్రైవ్.........తర్వాత కారు కొనుక్కున్నకా కార్ లో లాంగ్ డ్రైవ్.
దారిలో కారులో మనసుకి నచ్చిన పాటలు వింటూ.......పిల్లలు “నేను ముందు సీట్లో
కూర్చుంటా అంటే నేను ముందు సీట్లో “ అని దేబ్బలాడుకుని చివరికి ఎవరో ఒకరు వాళ్ళ
ఒప్పందం ప్రకారం వచ్చి కూర్చోడం, ఎప్పుడైనా నెలకోసారి రాత్రి హోటల్లో భోజనం,
మిఠాయి కిళ్ళీలు...తిరిగి ..ఇంటికి కాస్సేపు TV చూడడం, వచ్చిపడుకోడం.
ఎక్కడా జీవిత గమనం లో ఒక్క సెంటి మీటర్ కూడా తేడా వచ్చేది కాదు.
మైసూర్ బాంక్ - బళ్ళారి (1988) |
కాకినాడలో పనిచేసిన కాలం ఒక్క రెండేళ్ళు మాత్రమే. 1998, అప్పటికి నాకు
ఇల్లు లేదు, కొంటానన్న ఆశ ఈషన్మాత్రం కూడా లేదు. బేంక్ ఎదో కొంత అప్పు ఇచ్చినా మన
దగ్గిర ఒక్క ఫదివేలైనా ఉండాలిగా? అదీ
లేదు. నా సహచరులు అంతా కలిసి ప్రోత్సాహించి నన్ను ఇల్లు కట్టడం అనే ప్రాజెక్టు
లోకి తోసారు. ఒక కాంట్రాక్టర్ – YV Dasu ని పరిచయం చేసారు. నాకు ఆయన దేముడు పంపిన దూత తో సమానం. అన్ని విషయాలు ఆయనే
చూసుకున్నాడు, నా దగ్గిర చిల్లి గవ్వ లేని కారణాన, ఇంటి స్థలానికి ముందు ఇచ్చే
టోకెన్ ఎడ్వాన్స్ కూడా ఆయనే ఇచ్చాడు. ఆ దాసు గారు మా బేంక్ కష్టమర్ కూడా కాదు – Quid pro Quo ఒప్పందం లేదు. అప్పటి బేంక్ రూలు ప్రకారం ముందు కట్టడం లో ఒక భాగం కట్టాకా, తర్వాత బేంక్
డబ్బు రిలీస్ చేస్తారు, దానికి దాసు గారే పెట్టుబడి పెట్టేవారు, బిల్లు పాస్
అవ్వడానికి రెండు నెలలు పట్టేది.....పాపం ఆయన ఓపికగా ఆగే వారు కూడా నాకోసం. అతకు
ముందు జీవితం లో ఎప్పుడు ఆయనని కలవలేదు, అయినా
సరే ఎందుకనో ఆయనకి నేనంటే చాల గౌరవం ఉండేది. “మేనేజర్ గారు, మేనేజర్ గారు”
అని మాత్రమే సంబోధించేవారు. అలా నన్ను ఒక ఇంటివాడిని చేసారు దాసు గారు. దేముడు
ఆయనకి రావడానికి తీరిక లేనప్పుడు సాయం చెయ్యడానికి వేరే వాళ్ళని పంపిస్తాడని
అంటారు, అలాగే ఆయన దాసు గారిని నా దగ్గిరకి పంపి ఉంటారని నేను ఇప్పటికి
నమ్ముతాను. ఇప్పుడు దాసుగారు అక్కడే
కాకినాడలో ఒక పెద్ద రాజకీయ వేత్త. రేపో మాపో కాబోయే ఒక ఎమ్మెల్లే.
తర్వాత ఈ డబ్బులేని బ్రతుకు ఏమిటి చ్చా అస్సలు బాగోలేదు అని..... శత విధాల
ప్రయత్నించి చివరకు ఎలాగో అలా ఒక ప్రైవేట్ బేంక్ లో ఢిల్లీ లో చేరాను. అప్పటికి నా
మాత్రు సంస్థ అయిన ఆ ప్రభుత్వ బేంక్ లో నా సర్వీసు 13 ఏళ్ళు పూర్తయింది. అందరు వెళ్ళద్దు అని బ్రతిమిలాడారు, నచ్చచెప్పారు చాలా మంచి
భవిష్యత్తు ఉంది నీకు ఇక్కడ నీకు ఆల్రెడీ మంచిపేరు ఉంది, భవిష్యత్తు ఉజ్జ్వలంగా
ఉంటుంది అని చెప్పి చూసారు. మా డిప్యూటి జనరల్
మేనేజర్ వాసుదేవన్ గారు కూడా వద్దన్నారు. కాని మనకి అప్పటికే తల మీద bhoot sawaar hai. లేదు “దేశానికి నాలాంటి మేధావి అవసరం చాల అవసరం”
నాకు ఇక్కడ తగిన గుర్తింపు లభించడం లేదు (అంటే డబ్బు చాలట్లేదు అని చదువుకో
ప్రార్ధన), అని ఉన్న ఉద్యోగం వదిలేసి కొత్త తీరాలకి వెళ్ళిపోయా ఢిల్లీ కి. ఇంటిలో
ఉండే స్విమ్మింగ్ పూల్ నించి ఒక్కసారి పసిఫిక్ మహాసముద్రం లో పడ్డ ఫీలింగ్.
స్విమ్మింగ్ పూల్ (ప్రభుత్వ బేంక్ లో) ఉన్నప్పుడు ఈత రాక పోయినా చుట్టూ బాగా
సపోర్ట్ ఉండేది (సహచరుల రూపంలో), ఇక్కడ పసిఫిక్ సముద్రం మధ్యలో ఈత రాదు, చుట్టూ
తిమింగలాలు. అదను చూసి వేటు వేస్తాయి. నాకు ఊపిరి ఆడేది కాదు, రెండేళ్ళు
ప్రత్యక్షనరకం అనుభవించాను అక్కడ. ఇంకొన్నాళ్ళు అక్కడే ఉండి ఉంటె ఇప్పుడు ఇలా
బ్లాగ్ రాయడానికి ఉండేవాడినే కాదు. అన్ని రాజకీయాలు, అన్ని కుతంత్రాలు, అన్ని
కుత్సితాలు అంత దగ్గరగా నేను పుట్టాక ఎప్పుడు చూడలేదు. అప్పుడు మొదటిసారి
అనిపించింది – “డబ్బే అన్నిటికి ప్రధానం కాదు” అని. కాని అప్పటికే చాల అలిస్యం
అయిపొయింది. వెనక్కి వెళ్ళే దారులు అన్ని మూసుకుపోయాయి. భయపడితే సముద్రం లో మునగడం
తప్పదు. ముందుకు వెళ్ళడం తప్ప వేరే దారి లేదు.
భగవంతుణ్ణి నమ్ముకుని ప్రయత్నాలు మొదలుపెట్టి ఇంకో
బేంక్ లోకి మారిపోయాను. మొదటి సారి ఉద్యోగం మారినప్పుడు ఉన్న బెంగ బాధ ఇప్పుడు
లేవు. బహుశా దేనికైనా మొదటి సారి విడాకులు ఇవ్వడం కష్టం గా అనిపిస్తుందేమో? తర్వాత
తర్వాత అది అలవాటైపోతుంది కామోసు.
ఈ కొత్త ఉద్యోగం చాలా బావుండేది. పనికి తగ్గ
గుర్తింపు గౌరవం మర్యాద అన్ని ఉండేవి. మళ్ళి పాతరోజుల్లా జీవితం పట్టాల మీదకి
వచ్చేసినట్టు అనిపించింది. జీతం కూడా పర్వాలేదు బాగానే ఉండేది. అవసరాలు
తీరిపోయేవి, గడిచిపోయేవి. నాలుగేళ్ళు హాయిగా...జాలీ గా గడిచిపోయాయి. అన్ని
అలా ఆనందంగా సాగిపోతే ఎలా........? ఇంక
పైవాడి ప్రత్యేకత ఏమిటి? ఉన్నట్టుండి ఒక ఏడాది నా performance average స్థాయికి పడిపోయింది. సంవత్సర చివరి మీటింగ్ లో మా బాసు (ఒక పంజాబీ ఆయన)
నలుగురిలో చాలా చిన్నబరిచేలా, కించపరిచేలా మాట్లాడారు. “మొగుడు కొట్టినందుకు
కాదు, తోటికోడలు నవ్వినందుకు కోపం వచ్చింది” అన్న సామెతలా... ఆయన నన్ను
తిట్టడమే కాకుండా నాకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాడికి నాకంటే మంచి రేటింగ్, గ్రేడ్
ఇచ్చారు. అది చాల బాధ కలిగించింది......మళ్ళి షరా మామూలే...మెదడులో bhoot sawar hua. ప్రయత్నాలు, అవి ఫలించి గల్ఫ్ లో ఒక బేంక్ లో నాకు
ఉద్యోగం వచ్చింది. “జీతం లక్షల్లో ట. ఒక్క రెండు మూడేళ్ళు ముక్కు మూసేసుకుంటే
లక్షలు లేదా కోట్లు కూడబెట్టేయ్యచ్చుట. “ ముందు వెనకలు
ఆలోచించలేదు, ఏమిటి ఎందుకు అన్న విషయం పట్టించుకోలేదు, వెంటనే ఉన్న ఉద్యోగం మానేసా
(చెప్పా కదా విడాకులు, మొదటిసారి ఇవ్వడం కష్టం, తర్వాత తర్వాత ఎన్ని
పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు, వదిలేయచ్చు).
ఝామ్మని విమానం ఎక్కి దుబాయ్ కి వచ్చేసా.....!!